- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ప్రతి కొత్తదనం వెంటా
పాతరేసిన గతం ఉండే ఉంటది
మహానగరాల పునాదుల్లో
ఊర్లకు ఊర్లు
కూరుకుపోయే వుంటాయి
నువ్వు నగరానికి
కొత్తగా వొచ్చినప్పుడు
అన్నింటినీ వదిలేసి
నగ్నంగా వచ్చేసి ఉంటావు
ఒంటిమీద నూలుపోగయినా
లేని నీకు నగరం అన్నీ నేర్పుతుంది
లోదుస్తులు వేసుకోవడం మొదలు
నిలువెత్తు అద్దాల ముందు
అందంగా నిలబడడానికి
అవసరమయినవన్నీ
అనవసరమయినవి కూడా
నగరం నేర్పుతుంది
మెరిసే రంగుల్ని
నీ దేహానికి అద్దుతుంది
ఆకాశాన్ని తెచ్చి
నీ అరచేతిలో పెడుతుంది
అయినప్పటికీ నీ దేహాన్ని
ఎంత కొత్తదనం కమ్మేసినా
పాత వాసనలతో పాత ప్రేమల్తో
నీ లోపల ఆత్మేదో మెసుల్తూనే వుంటది
ఎంత పాతరేద్దామన్నా
గతం వెన్నంటే వుంటది
వారాల ఆనంద్
94405 01281
- Tags
- Poem
Next Story






