రూపకల్పన..!!

by Ravi |   (  Updated:2025-06-09 00:30:37  IST  )

Poem

రూపకల్పన..!!
X

ఒక రూపకల్పన చేయాలి

మనసును బాగా మర్ధన చేసి

అక్షరాల్ని చక్కగా పేర్చుకుని

పదాలుగా చిక్కగా మలుచుకుని

ఒక కావ్యాన్ని కమ్మగా కూర్చాలి

శిలను చెక్కి శిల్పంగా మలిచినట్టు

పాలరాతి గోడలు నిర్మాణం చేసినట్టు

సమస్తాన్ని బాగా క్రోడీకరించి

భావాన్ని పరిమళింప చేయాలి

కవనంలోని కమ్మదనాన్ని గుప్పించాలి

కవ్వంతో మజ్జిగను చిలికినట్టు

వెన్నలాంటి మధురమైన అల్లికతో

మస్తిష్కంలోని కల్మషాన్ని తొలిగించే

విలువైన కవనానికి శ్రీకారం చుట్టాలి

రూపకల్పన అద్భుతంగా వుండాలి

సాహిత్యంతో సాన్నిహిత్యం చేసే

ప్రతి పాఠక మెదళ్ళకు

విజ్ఞానం నింపే మేత వేయాలి

సమాజాన్ని చదివే తెలివినివ్వాలి

చక్కటి ప్రతిభా పఠనానికి చోటివ్వాలి

మంచి కవన రూపకల్పనకై

మనసుకు పదును పెట్టాలి

పాళికి అలుపు లేకుండా కదపాలి

నరెద్దుల రాజారెడ్డి

9666016636

Next Story