వార్రీల్

by Ravi |   (  Updated:2025-06-09 01:00:14  IST  )

Poem

వార్రీల్
X

సెల్ టవర్ల రేడియషన్‌లో

సెర్చ్ లైట్లు చీకట్లను చీరుతున్నాయ్

నా గుండెల్లోని పత్రహరితాన్నెవరో

పీల్చేస్తున్నారు

-మీరెవరూ ఆపలేరు

నా హృదయపు రోడ్ల మీంచి

ట్రాఫిక్ ఇప్పుడప్పుడే సద్దుమణగదు

కాంతిని గుర్తించగలిగే ప్రతివాడికీ

కాంతి వేగం తెలియక్కర్లేదు

-వాళ్లు కోరుకునేదీ అదే

యుద్ధంలో నిలబడ్డాక

సంధి ప్రేలాపనలు

బీరత్వపు ఆర్తనాదాలు మాత్రమే

చెప్పడానికి మొహమాటపడ్డా

- వాళ్లు బహిరంగానే పడీపడీ నవ్వారు

తిరణాళ్లలో తప్పిపోయిన పిల్లాడు

తీర్థయాత్రల్లో ఎదురుపడడు

రణభూమినే మరుభూమిగా

అలంకరిస్తూ అలసిపోతాడు

-ఇది కొందరికే తెలుసు

పిశాచాలకు పైశాచికత్వం

వుండదనుకోవడం

ఎవరి అమాయకత్వం?

దెయ్యాలు వేదాలు వల్లిస్తాయన్నా

నమ్మకపోవడం ఎంత వెర్రితనం?

-తెలియనట్టే నటించారందరూ

ఒక్క పూవైనా విచ్చుకోకుండానే

నూరు సీతాకోకలు వాడిపోయే

సంఘర్షణేమీ లేకుండానే

వెర్రి వేయి విధాలుగా చీలిపోయే

-వాళ్లెప్పుడో పిడికిలిని వేళ్లుగా విడదీసేశారు

సరే, ఇక ఇవన్నీ వదిలేద్దాం,

కడుపు చించుకున్నా మిగిలేది శాశ్వత నిద్రే

కలలు పుర్ర్‌మని చిరిగినా,

మిగిలినవి చల్లారని చితులే

-ఇప్పుడందరం మౌనం వహించక తప్పదు

అద్దంలో ఒక యుద్ధం చూపించి,

మరో యుద్ధంలో కాలరాయడమే కుటిలత్వం

మన మధ్య యుద్ధాన్ని సృష్టించి

ఇద్దరి మీదా వాడి జెండా ఎగరేయడమే వికృతం

-మీకెవరికీ ఇది అర్థం కాదు

నీడ కోసం వచ్చే మానవత్వం మిగల్లేదని

చెట్లన్నీ చీకట్లోనే కుప్పకూలిపోయాయి

టపాసులు పేల్చుకుంటూ

- మన శవయాత్రలో మనమే నర్తిస్తున్నాం

డస్సిపోయిన గొంతుతో గాయకుడు

ఎత్తుకున్న చివరి గీతంలోనూ అపశృతే

ఇక ఉషోదాయాలన్నీ కన్నీటి మడుగులో

బుడుంగుమన్నాయి

అవేమైనా గుడ్లుపెడతాయేమో?

ఇప్పుడే ఎవరూ చెప్పలేరు.

- దేశరాజు

99486 80009

Next Story