- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఈ రాతిరి ఇట్టే
ఆగిపోతే బాగుండు
నీవక్కడెక్కడో పైలంగానే
ఉన్నవనుకుంటు
నాది అత్యాశైతే కావచ్చురా
దుఃఖానికి ఆశెక్కువ బిడ్డా
జరిగింది జరుగకుండుంటే బాగుండని
పదే పదే తలుసుకుంటుంది
ఉదయాలకు నెత్తురద్ధీ
ఆలోచనల ఎలుగులు తొడిగి
ఈ లోకం కోసం తోలినోళ్ళు
ఒక్కరొక్కరుగా కుప్పకూలుతుంటే
పొత్తి కడుపులో అంతా కలికలైతుందిరా
తల్లులారా...
శిన్నపుడు ఆటలాడంగా అరికాళ్ళలో
గరికపొసల కొసలిరిగితేనే
విలవిలలాడినోళ్ళు
తూటాలకెట్లా ఎదురు
ఉరికిండ్రోనని తలుసుకుంటేనే
కడుపుల్లకెళ్లి ఈపులకు దవజొచ్చి
పెయ్యంతా వణుకుడెడుతుంది
బిడ్డలారా...
తూటా ఎవరిదైనా కావచ్చు
చీల్చేది మాత్రం తల్లిపేగునే
మీరక్కడా సచ్చినందుకే కాదురా ఈ దుఃఖం
కారకులెవరో తెలిసినా
కదలక మెదలకున్న
ఈ మనుషుల జూస్తే ఏడుపోస్తుంది
పంజరంలో బందీగున్న
తెల్లపావురాలనన్నా
వదలమని అడుగలేని
ఈ జీవచ్ఛవాల కోసమా
మీ తనువులిడిశిందని
దుఃఖం తడలు తడలుగా తన్నుకత్తంది
మాపటేలా ఆకిట్ల గుంపులుగా కూసుండి
ఆకాశంకెళ్లి ఆశగా చూస్తున్నాం
తోకసుక్కెపుడు రాలుతుందోనని
సుక్కరాలంగా సూత్తూ
మదిల దలుసుకుంటే...
అనుకున్నదేదో నిజమైతదట కదా!
పిల్లలారా...
రేప్పొద్దునా మీరున్నారన్న వార్త
ఏ కాకితోనన్నా కబురంపగలరా...!
ఈ తల్లుల దుఃఖాన్ని ఊకుంచి పోనీకి
ఒక్కసారన్నా వచ్చిపోరా...!
దిలీప్.వి
84640 30808
- Tags
- Poem






