అతడు..

by Ravi |   (  Updated:2025-04-06 23:30:18  IST  )

Poem

అతడు..
X

వేయి చంద్రోదయాలు చూసిన వాడు

వేవేల గ్రంధాలయాలు మోసిన వాడు

ఎన్ని ఇంద్రధనుస్సులు దాచినాడో

కన్నులలో వెన్నెలనెంత నింపినాడో,

ఆ గొంతులో ఎన్ని సెలయేళ్ళో,

వెండి గిన్నె లాంటి ఆ గుండె నిండా

ఏ అత్తరు పరిమళాలో?

ఆ అనుభవానికి శిరస్సు వంచాను

అడగక పోయినా అభినందించాను

చిత్రం! ఆ మోముపై

నెలవంకయినా పూయలేదు

పలకరింపు తాకిన ఆ సరస్సు పై

చిరు ప్రకంపనైనా కానరాదు

వెనుతిరిగిన నేనిప్పుడు

పసి మోముకై వెదకాలి

ఋతువుల కొలతలు పక్కన పెట్టి,

సహజంగా ఉదయించే

నగవులను దర్శించి

మానవ సంగీతమై ప్రవహించాలి.

డా.డి.వి.జి.శంకరరావు,

94408 36931

Next Story