కిటికీలో చందమామ

by Ravi |   (  Updated:2025-04-07 00:31:02  IST  )

Poem

కిటికీలో చందమామ
X

లైట్ తీసేసిన పడక గది

తూర్పు కిటికీలో

మిసిమి పున్నమి చంద్రుడు

పూత రేకుల వెన్నెల్లో

షవర్ స్నానం చేయించేవాడు

లైట్ తీసేసిన పడక గది

10 గంటల రాత్రి

పడమర గవాక్షంలోంచి

అష్టమ నాటి చంద్రుడు

చిలిపి సైగ చేస్తూ

కన్ను గీటుతున్నాడు

ఇప్పుడు ఎంత తడిసినా

అడవిన కాచిన

వెన్నెలలా అనిపిస్తుంది

"ప్రియా ఎందుకిలా

ఎప్పుడు అవుతుందా అని

ఉత్సాహంగా ఈల వేస్తూ రాత్రి

ఈ వేళెందుకు ఊళ వేసినట్టు

స్థానభ్రంశం చెందుతున్నది" అడిగాను

అప్పటి స్ఫురద్రూపు వేరు

ప్రతి మొగ్గ సిగ్గుపడుతూ

అందంగానే కనబడుతుండేది

"ఇప్పటి దృష్టి వేరు

నీలో లోపలికి చూడు

కొన్ని వెన్నెల సరస్సులో

కలువలు వికసిస్తాయి"

చెవిలో గుసగుసగా చెప్పింది

చూపు మోసం చేసిందో లేక

వయసు దాహం తీరిందో

కిటికీలోని చంద్రుడు కాస్తా

పడమర ఎడారిలో అస్తమించాడు

-జూకంటి జగన్నాథం

94410 78095

Next Story