ఆహ్వానం

by Ravi |   (  Updated:2025-03-30 23:45:43  IST  )

Poem

ఆహ్వానం
X

చైత్ర మాసపు గాలుల

పలకరింపుతో పులకరించిన వేప

పువ్వుల కొమ్మ ఎగసిపడుతూ

హత్తుకోమంటూ ఎదను తాకింది

మదిలో మొదలైన ఆశల పల్లకి

చిట్టా పేజీలు అటు ఇటుగా తిరుగుతూ

కాల చక్రాన్ని గుర్తుచేసాయి

ఒక్కో పేజీలోని ఆశయం

ఉలిక్కి పడేలా

నన్ను తట్టి లేపింది

నేను ముందు నేను ముందంటూ

ఉక్కిరి బిక్కిరి చేసాయి

ఒక్కసారిగా షడ్రుచులను

తలుచుకోగానే జీవితం

కలగలిపిన మేళవింపని

జీవితం చీకటి వెలుగుల

తెరచాపని, కష్టసుఖలు

రంగుల ఋతువుల

వైకుంఠపాళి అని అర్థమైంది

ఒక్కో ఆశయానికి ప్రణాళిక

సిద్ధం చేసి ఐకమత్య జీవితాశయానికి

ఊపిరి పోసి ఉగాది జాతీయ సమైక్య

విజయ కేతనం ఎగురవేసాను

విశ్వావసు సంవత్సరాదికి

ఆహ్వానం పలికాను.

ఎం. కె. లక్ష్మి

98484 34500

Next Story