పైకప్పు లేని సొంత ఇంట్లో

by Ravi |
పైకప్పు లేని సొంత ఇంట్లో
X

పై కప్పులేని సొంత ఇంట్లో

అతడు నివసిస్తున్నాడు.

ఇంటి నిండా ఉష్ణం వ్యాపిస్తోంది

ఇంట్లో జడివాన కురుస్తోంది

ఇంట్లో సుడిగాలి వీస్తోంది

ఇంట్లో రాళ్లూ పడుతున్నాయి...

పై కప్పులేని సొంత ఇంట్లో

అతడు నివసిస్తున్నాడు-

అతడికి తెలుసు తాను విడిగా,

ఒంటరిగా ఉన్నాను అని

అతడి ఉనికికి పెద్దగా కారణమేదీ

లేదని అతడే గ్రహించాడు.

పై కప్పులేని సొంత ఇంట్లో

అతడు నివసిస్తున్నాడు-

అతడి వ్యక్తిత్వం అతడిని

అల్లకల్లోలం చేస్తోంది

అతడి నడత అతడిని బాధిస్తోంది

అతడి తెలివి అతడిని నలిపేస్తోంది

అతడి గుర్తింపు అతడిని కాల్చేస్తొంది

పై కప్పులేని సొంత ఇంట్లో

అతడు నివసిస్తున్నాడు-

బయటపడడానికి అతడు కదులుతున్నప్పుడు

ఆలోచనల గోడలు అతడిని అడ్డుకుంటున్నాయి

ఒక మనిషిగా... అతడికి

వాకిలి ఎక్కడుందో కనిపించడంలేదు.

పై కప్పులేని సొంత ఇంట్లో

అతడు నివసిస్తున్నాడు

అతడు ఒక మధ్యతరగతి మనిషి.

రోచిష్మాన్

94440 12279



Next Story

Most Viewed