జన జాగృతికి జేజేలు

by Ravi |   (  Updated:2024-06-09 18:30:09  IST  )

Poem

జన జాగృతికి జేజేలు
X

ఆకాశంలో విహరించే వాని

అహంకారానికి ముక్కుతాడేసి

నేల మీదికి కుదేసి

గుంజకు కట్టినట్టు

రంకెలేసే ఆంబోతుకు

లెంకె పీటలేసి ఆపినట్టు

అదుపుతప్పి ఆడకుండా

పగ్గాలేసి గుంజినట్టు

పూట పూటకో మాటకు

పేట పేటకో వేషానికి

పాబందీలేని ఆటకి

ప్రతిపక్షాల వేటకి

చదరంగంలో చెక్కు పెట్టినట్టు

జనం నాడి ఇదంటూ

జర్నలిజం పేరుతో

వ్యాపారం చేసేటోని

మా మనసు మర్మం

నీకేం ఎరుకని

జాడిచ్చి తన్నినట్టు

పాలకులంటే పరమాత్ములు కాదని

ప్రజాసేవకులని గుర్తెరిగేటట్టు

ప్రజాస్వామ్య దేశంలో

వ్యక్తి పూజ సరికాదన్నట్టు

పగలకు పంతాల సాధనకు

పాలకుల అవసరం లేదని

ప్రజా సమస్యలే ప్రధానం కావాలంటూ

ప్రజలంతా గుర్తించినట్టు

ప్రజా వజ్రాయుధం 'ఓటు'ను

అదును చూసి పదునుగా గుద్దిన

బలి బలి రా ! జనజాగృతి

మన గణ"జన జాగృతి"కి జేజేలు

డా.ఎడ్ల కల్లేశ్

9866765126

Next Story