సాహిత్య యుద్ధం

by Disha edit |
సాహిత్య యుద్ధం
X

ఆమె స్త్రీ వాద రచనలు

ఆయనకు నచ్చవు

ఆయన నవరస చర్చలు,

అలంకార ఛందో వైశిష్ట్యాలు

ఆమెకు సరిపడవు

ఆయన ఉహా జగత్తులో

ఆకలి దప్పులు, ఈతి బాధలుండవ్

ఆయన భావనామయ ప్రపంచంలో

సెలయేటి గలగలలు,

చిరుగాలి గుస గుసలు,

మావి చిగురులు,

కోయిల కుహు కుహులు,

మధుర ప్రణయోద్వేగాలు

అనంతానందమే అక్కడ!

ఆయన కలంలో

రూపు దిద్దుకున్న స్త్రీలు

అందమైన శిల్పాలు,

కొమ్మ చాటు పువ్వులు,

ఏమెరుగని ముగ్దలు,

మగడు లేనిదే

గడప దాటలేని అబలలు,

వాసక సజ్జికలు!

ఆమె కలంలో ఊపిరి పోసుకున్న

స్త్రీలు ధిక్కార స్వరాలు,

పోరాట యోధులు,

శ్రమ జీవులు, ఆత్మగౌరవ ప్రతీకలు!

ఆమె రచనలు ఆయన చదవడు

ఆయన రచనలు చదివింపచేస్తాడు

వేర్వేరు గదులలో బందీలైన

రచయితలు, భార్యా భర్తలు వారు

ఒకరిపై ఒకరి ఆధిపత్యపు పోరులో

ఆ ఇంట ప్రతిరోజూ సాహిత్య యుద్ధమే!

- డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

63027 38678



Next Story

Most Viewed