ప్రజాకవి వేమన

by Ravi |   (  Updated:2026-01-26 00:30:30  IST  )

People's poet Vemana

ప్రజాకవి వేమన
X

ఆదికాలంలో తిక్కన, మధ్య కాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ అని, తెలుగులో మహా కవులు వీరేనని మహా కవి శ్రీ శ్రీ పేర్కొన్నాడు. మీ దేశం పిల్లలకు మాత్రమే వేమన పద్యాలు నేర్చుకునే అదృష్టం దక్కితే ఎలా, మా దేశీ పిల్లలు కూడా ఇటువంటివి నేర్చుకోవాలి, ఆ పద్యాలలో దాగిన నీతి ననుసరించి నడుచుకోవాలంటూ వేమన పద్యాలను ‘ది వర్సస్ ఆఫ్ వేమన’ అనే పేరుతో ఆంగ్లంలోనికి అనువదించి, వేమనకు ప్రపంచ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానం కల్పించాడు సీపీ బ్రౌన్. గురజాడ అప్పారావు తన కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు. కట్టమంచి రామలింగారెడ్డి తన 'కవిత్వతత్వ విచారం' గ్రంథంలో వేమనని మహాకవిగా గుర్తించాడు.

ఆటవెలది పద్యం ఆయుధమై..!

లోక నీతులు, సామాజిక చైతన్యం వంటి వస్తువులతో, ఆటవెలది పద్యలక్షణముతో తను చెప్పద లిచిన విషయాన్నీ ముక్కుసూటిగా చెప్పడం, సమస్యలను ఎత్తి చూపటమే కాకుండా సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా అతి సులువైన సరళ పదాలతో చెప్పటం వేమనకే సాధ్యం. నాలుగు పాదాలైన ఆటవెలది పద్యం అతనికొక ఆయుధం. తాను విన్న ప్రతీ విషయాన్ని, చూసిన ప్రతీ సన్నివేశాన్ని పద్య పందిరిలో అక్షర మాలలుగా కూర్చాడు. ‘పనసతొనల కన్న! పంచదారల కన్న / జుంటి తేనె కన్న! జున్ను కన్న / చెఱకు రసము కన్న! చెలిమాట తీపిరా / విశ్వాదాభిరామ వినురవేమ’

ప్రజల నాలుకలపై చెరగని ముద్ర..

మొదటి మూడు పాదాలలో నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో తగిన సౌమ్యాన్ని, నాలుగో పాదాన్ని మకుటంగా తీర్చి దిద్దడం వేమన లక్షణం. శతక కవులలో పేరెన్నికైన కవిగా, ప్రజల నాలుకలపై చెరగని ముద్రగా మిగిలిన ప్రజాకవి వేమన. రెండు మూడు తరగతులు తెలుగు వాచకాలలో అనేక వేమన నీతి పద్యాలు అవలీలగా పిల్లల గొంతులో నడయాడడం, పద్యాలు వల్లె వేయటం వాటిని రాసిన కవి గొప్పదనమే... మేడిపండు చూడ మెలిమై యుండు / పొట్టవిప్పిచూడు పురుగులుండు/ పిరికివాని మదిని బింకమీలాగుర/ విశ్వాదాభిరామ వినుర వేమ

విశ్వదా అనే పేరు ఎవరిదైతేనేమి?

వేమన పద్యాలలో మకుటంగా వున్న విశ్వదా అనే పేరు అతని మిత్రుడదని కొందరు, తనను అమితంగా పెంచిన వదినగారిదని మరికొందరి వాదనలు. ఏది ఏమైనా పద్యాలలో దాగిన నీతిని మాత్రమే గ్రహించాలి. అనగననగరాగ మతిశయించునుండు/ తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/ విశ్వదాభిరామ వినుర వేమ. చేసే పనుల పట్ల శ్రద్ధ కలిగి చేయడం, ప్రతిరోజు సాధన చేయటం వంటి గుణాలను పిల్లలకు, పెద్దలకు అర్థమయ్యేలా చెప్పడం పద్యం ధ్యేయం. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. వేమన 1367-1478 మధ్య కాలంలో జీవించాడని కొందరి అభిప్రాయమయినప్పటికీ, జనవరి 19న వేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం నిర్వహించాలనుకోవటం గొప్ప విషయం.

- ఎం. లక్ష్మి,

94928 58395

Next Story