- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవనాకాశంలో 'నేనే'.. ఓ ధ్రువతార..!
Nene Book by Enugu Narasimha Reddy Book Review

కొందరి ఆలోచనల ప్రభావం అక్షర ప్రవాహమై చరిత గుండెలపై కదులుతూనే ఉంటుంది. కవిత్వంగా మారి సమాజంలోని అనాగరిక, అజ్ఞాన పోకడలపై అలుపెరగని యుద్ధమే చేస్తుంది. దాదాపు 25 సంవత్సరాల కిందట రాసిన కవిత్వం నేటి సమాజానికి రిలవెంట్‌గా ఉండటం కవి దార్శనికతకు నిదర్శనం. ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డి రాసిన "నేనే" కవితా సంపుటి అలాంటి కోవలోకే చెందుతుంది.
నేనేలో 49 కవితలు ఉన్నాయి. అవన్నీ దేనికవే ప్రత్యేక పరిమళాన్ని కలిగి ఉంటూ సామాజిక వాస్తవికతకు జీవం పోశాయి. వృత్తిపరంగా ఎంతో బాధ్యత కలిగిన ప్రభుత్వ పదవిలో ఉంటూనే.. ఓ మేధావిగా అనునిత్యం సమాజంలో మంచి మార్పు గురించి ఆలోచించే ఓ శక్తి.. ఏనుగు నరసింహారెడ్డి.
ప్రాంతీయ అభిమానంతో..
నిండుకున్న వంకలు చూసేది నిన్నే నిన్నే/ నమ్ముకున్న మబ్బులు పిలిచేది నిన్నే నిన్నే.. అంటూ పుస్తకంలోని మొదటి కవిత "నీటి పిట్ట"లో తెలంగాణ ప్రాంతీయ అభిమానంతో నిజమైన మట్టి బావుటా ఎగరేశారు. నీరుడీ వారసత్వం చేపట్టిన నీ సుగుణమే జ్ఞానమంటూ తెలంగాణ గ్రామ సేవకులను, వారి జీవన తత్వాన్ని అద్భుతంగా కవిత్వీకరించారు. జీవితం వర్ణ సౌధంలోకి అడుగేస్తూ అకస్మాత్తుగా ఆరిపోయిన నిండు దీపం గురించి 'వాలు గులాబీ'ల కవన వర్షం కురిపించారు. అందరం భుజించి తీరాల్సిన ఫలమే మరణమంటూ వేదాంతం ఆవిష్కరించారు.
'వానాకాలం'.. వన్నెల బహుమానం
పజ్జెం తనను పసిపిల్లలా అల్లుకుంటుందని, గుండె చుట్టూ తారాడుతూ ఉంటుందని, ఇక పజ్జెమే నాలో కొత్త ఆశల్ని పూయిస్తుందంటున్నారు. కాలువలో చందమామ వంపుకు సాగిపోతూ దృశ్యం పచ్చరంగేసుకొని దూకుతున్న జింకల చుట్టూ విశ్వం విలాసహాసం 'వానాకాలం'.. వన్నెల బహుమానంగా మలిచారు. ఇప్పుడు గురుత్వం దిష్టిబొమ్మల సాక్షిగా పరీక్షల చిట్టడవిలో పసిడి వన్నెల పాలపిట్ట బుక్కై, నెత్తురోడినందుకు సిగ్గుతో చితకాల్సింది మనమే అంటూ విద్యా వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కళింగ యుద్ధం లేకుండానే 'ధమ్మ'ను అల్లుకున్న శాంతి కపోత సౌందర్యాన్ని వర్ణించారు.
నీలాకాశపు సాయంతనంలో సేదదీరేలా
డాడీకి బదులు ఫోను వడగండ్లో, వడదెబ్బ మరణాలో అగ్ని ప్రమాదాలో, రేషన్ సప్లై లో కారణాల ఏకరువు అక్కర్లేదంటూ పావురమై అలరిస్తున్న 'లాంగ్ రింగ్' ఇచ్చారు. తంగేడు పూల మీద మంచు చుక్కల్ని తుడిచే వేకువ తుమ్మెదలమయ్యే వాళ్ళం మేమంటూ 'బతుకమ్మ కల' ను నీలాకాశపు సాయంతనంలో సేదదీరేలా మార్చారు. బతుకు చీకట్ల మీది అర్థ చంద్రిక మాయమై, చేద బావిలో షహీదై తేలింది పురిటి బాలుడికి తెలియదు గాయం దగ్గరే స్పందించాలని తెగిన గొంతుకెలా సాధ్యం ప్రతి నరికివేతకీ కేకలేయడం వంటి వాక్యాలు పాఠకుల్ని తీవ్ర భావోద్వేగాలకు గురిచేస్తాయి. పాట కాసింత ఆగింది మరింత పదునెక్కటానికే అనే బలమైన సందేశాన్ని వినిపిస్తాయి.
అందని ఓ పురా జ్ఞాపకానికి...
ప్రవహించే కాలం వెంట నడుస్తూ ఈ కవి..కాయలు పండిపోయాక పూలు కేవలం ఓ స్మృతి. దేవాలయం శిథిలమైందని దేవుడు మరో చిన్ని కోవెలను వెతుక్కుంటాడంటాడు. ఉద్యోగం బదిలీ గురించి కాదు బాధంతా బదిలీ కాలేని మనసు గురించే అంటూ దీపం కత్తితో రాత్రి నదిని చీలుస్తాడు. గోడ గడియారం జాలిపడి ఆగిపోతుంటే, జీరో బల్బు లేజర్‌లా ప్రకాశిస్తూ ఉంటుందనీ.. "ఒక రెండు సందర్భాల గురించి" వివరిస్తారు. ఆకాశం నల్లటి దుఃఖంతో తడిసిపోతుంటే నేనెవర్ని గుర్తుకు తెచ్చుకోను అంటూనే 'అందని ఓ పురా జ్ఞాపకానికి...' మాయ పరదాల మరింత దట్టపు మేఘాల మధ్య అల్లుకుపోతాడు రచయిత.
తాత్విక వెలుగులు ప్రసరించే అక్షర పువ్వులు
ఇలా ఈ పుస్తకం నిండా సామాజిక ఇతివృత్తాలను తీసుకుని మార్మికతతో అందమైన తెలంగాణ భాషలో తనదైన కవిత్వ శైలిని పాఠకులకు అందించారు నరసింహారెడ్డి. చావు పాట, కలల శకల మ్మీద, తీగకాస్తా తెగిందా, అమ్మమ్మ, మరిచిన పద్యం, ఒక జీవితమూ.. ఇంకొన్ని ఖండికలూ... వంటి విభిన్న శీర్షికలతో, భిన్న వస్తువులతో తనదైన ప్రమాణాలతో పాఠకుల హృదయాల్లోకి చేరేలా కవిత్వంలో జీవించారు రచయిత. జీవితం ఓ అసందర్భ వ్యంగ్య చిత్రం అంటూ తాత్విక వెలుగులు ప్రసరించే అక్షర పువ్వులను పూయించిన "నేనే".. ఏనుగు నరసింహారెడ్డి ఇంకా ఇలాంటి ఎన్నో పుస్తకాలతో పాఠకులను అలరిస్తూనే, స్ఫూర్తినిస్తూనే, భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పుడే "నేనే" పుస్తక లోకాన్ని సందర్శించాను. మరి... మీకు కూడా స్వాగతం పలుకుతున్నాను.
పుస్తకం: నేనే.. (కవితా సంపుటి)
వెల: ₹100
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
040-27678430
సమీక్షకులు
ఫిజిక్స్ అరుణ్ కుమార్
93947 49536






