గుబాళిస్తున్న కన్నడ కథలు.. నెమళ్ళు

by Ravi |   (  Updated:2026-04-13 00:45:58  IST  )

Nemallu - Adhunika Kannada Kathakula Kathalu Book Review

గుబాళిస్తున్న కన్నడ కథలు.. నెమళ్ళు
X

భారతీయ భాషల సాహిత్యంలో కన్నడ సాహిత్యం తనదైన ముద్రను వేసింది. గొప్ప కథకుల కథలలో కేవలం ఒక్క కథను ఎంపిక చేసి, మొత్తం 17 ఆధునిక కథలను తెలుగు పాఠకులకు అందించారు అనువాదకులు, సంకలనకర్త రంగనాథ రామచంద్రరావు. ఈ పుస్తకంలోని కథల రచనా కాలం 1950-1990. గ్రామీణ నేపథ్యంతో పాటు మానవీయ విలువలు, ఉద్వేగాలు, అంతః సంఘర్షణలు మిళితమైన కథలు మనల్ని ఆలోచింపచేస్తాయి. మూఢనమ్మకాలు, సామాజిక కట్టుబాట్లు, స్త్రీవాద దృక్పథం, వాస్తవిక ప్రపంచాన్ని కళ్ళ ముందుంచుతాయి. కొన్ని కథలు అనుభూతి ప్రధానంగా సాగుతూ, లోతైన భావాత్మకతతో సాగుతాయి.

సామాజిక జీవన చిత్రాలకు అద్దం పట్టి..

'బి.టి. లలితా నాయక్' కథ "తల్లీ సాకీ బాయి". గ్రామీణ నేపథ్యానికి చెందిన కథ. బంజారా తెగ మహిళ సాకీ బాయి కేంద్రంగా కథ సాగుతుంది. సాకీ బాయి చిన్న వయసులోనే భర్తను కోల్పోయి, తొమ్మిదేళ్ల సవితి కొడుకుతో పాటు తన కొడుకుని చూసుకునే బాధ్యత చేపట్టింది. ఆమె తన కష్టాలను అధిగమించి, సమాజం విధించిన ఆంక్షలు ధిక్కరించి స్వతంత్రతో అడుగు ముందుకు వేస్తుంది. కానీ చివరికి కొడుకులే హత్య కావించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు. ఈ కథ బలహీన వర్గాల మహిళల ఆశలు, ఆకాంక్షలు, సామాజిక వాస్తవ జీవన చిత్రాలకు అద్దం పడుతుంది.

గులాబీ మృదు పాదాల కథలో..

వైదేహి కథ "గులాబీ మృదు పాదాలు". ప్రపంచాన్ని చూడకముందే, గర్భంలో మాయమైన బిడ్డ తాలూకు జ్ఞాపకాలతో తల్లి పడే మానసిక వేదన, ఆరాటాన్ని ఈ కథ దృశ్యమానం చేస్తుంది. డాక్టర్ వీరభద్ర కథ "అమ్మ". ఈ కథలో తల్లి ప్రేమ కోసం ఆరాటపడే బిడ్డ మనసును చూస్తాం. ఎవరూ లేని అనాధను దత్తత తీసుకుంటారు ఆ దంపతులు.. కొంతకాలానికి ఆ తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. దాంతో దత్తత తీసుకున్న బాలుని పట్ల నిర్లక్ష్యం వహిస్తుందా తల్లి. ఆకలి, ఒంటరితనం, ప్రేమ రాహిత్యం ఆ బిడ్డను ఒంటరిని చేస్తుంది. కొద్ది రోజులకు ఆ తల్లి కన్న బిడ్డను కోల్పోయి, తిరిగి ఆ బాలుడిని ప్రేమగా చేరదీస్తుంది. ఈ కథలో పాత్రలు ఆయా సందర్భాలను బట్టి ప్రవర్తిస్తాయి.

బాల్యం, ప్రస్తుతం మధ్య బేరీజు వేస్తూ..

యు.ఆర్. అనంతమూర్తి కథ "నెమళ్లు". సమాజంలో మానవ సంబంధాలు, నైతిక ప్రవర్తన, బాల్యపు సంఘటనలు, కుటుంబ బాంధవ్యాలు సహజాతి సహజంగా చిత్రించారు. నలభై ఏళ్ల తర్వాత తండ్రి శ్రాద్ధం కోసం సొంతూరికి వస్తాడు. పదేళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు తిరిగి జ్ఞాపకాలలోకి లాక్కెళతాయి. చిన్నతనంలో చూసిన నెమళ్ల నృత్యం తాత్కాలికమే కానీ అది కలిగించిన అనుభూతి జీవితాంతం వెంటాడుతుంటుంది. అలాగే కొన్ని ఆనందాలు జీవితంలో క్షణికమే అయినప్పటికీ, ఆ అనుభూతి జీవిత పర్యంతం కొనసాగుతుంటుంది. ఈ కథ బాల్యం, ప్రస్తుతం మధ్య గల పరిస్థితులను బేరీజు వేస్తూ, అంతర్మథనానికి లోను చేస్తూ ఆలోచింపచేస్తుంది. డాక్టర్ హేమ పట్టణ శెట్టి కథ "నీడ" కథ, ఈ కోవకే చెందిన వీణా శాంతేశ్వర కథ "చివరి దారి". స్త్రీవాద దృక్పథం, సమాజంలోని కట్టుబాట్లు, స్త్రీ పురుష సంబంధాలు, నైతిక విలువల పట్ల మనల్ని ఆలోచింపచేస్తాయి. కుం వీరభద్రప్ప కథ "తుఫాను". భారీ తుఫాను నేపథ్యంగా సాగుతుంది. ప్రకృతి బీభత్సం కన్నా సహాయ చర్యలు, నష్టపరిహారం మాటున దాగే కుటిల రాజకీయాలు, దుర్మార్గుల బుద్ధి వంటివి వేదనకు గురి చేస్తాయి. శాంతినాథ దేశాయి కథ "మంచు గడ్డ" ఒక వాస్తవిక, సందేశాత్మక కథ. వయసుతో పాటు పరిపక్వత చెందే ఆలోచనలు, నిర్ణయాలు జీవితాన్ని పరిపూర్ణం చేసే దిశగా సాగుతాయని తెలుపుతుంది.

వాస్తవ జీవిత కథలు..

శ్రీకృష్ణ ఆలనహళ్లి కథ "ఫీనిక్స్". గ్రీకు పురాణాల ప్రకారం ఫీనిక్స్ అనే పక్షి సూర్యుడి వద్దకు వెళ్లి బూడిదై తిరిగి అదే బూడిద నుండి పునర్జన్మిస్తుంది. ఈ కథ లో స్త్రీ, పురుషు సంబంధాలలోని సంక్లిష్టత, ప్రేమ, ద్వేషం, అంతః సంఘర్షణలను, సంభాషణల రూపంలో వ్యక్తపరిచిన తీరు కొనియాడదగినది. డాక్టర్ బెసగరహళ్లి రామన్న కథ "గాంధీ". గాంధీజీ ఆశలు, ఆశయాలు నెరవేరాల్సిన భారతావనిలో ప్రాథమిక అవసరాలు నెరవేరక, పేదవారు ఆసుపత్రుల చుట్టూ తిరిగి పడే పాట్లు కంటనీరు తెప్పిస్తాయి. వాస్తవ జీవితాల్లో నుంచి పుట్టిన కన్నడ కథలను తెలుగువారికి అందించిన అనువాదకులు రంగనాథ రామచంద్రరావు అభినందనీయులు. కళాత్మకమైన ముఖచిత్రంతో, ప్రచ్చాయ ప్రచురణల ద్వారా వెలువడిందీ పుస్తకం.

పుస్తకం: నెమళ్లు (కన్నడ కథా సంకలనం)

అనువాదం: రంగనాథ రామచంద్ర రావు

పేజీలు: 181, వెల:200/-

ప్రతులకు: 70931 65151

సమీక్షకులు

-లేదాళ్ల జయ,

87901 82908

Next Story