రెండు మంచి బాల నవలలు..

by Ravi |   (  Updated:2025-11-17 01:00:24  IST  )

మన తెలుగులో బాల సాహిత్యం, అందులోనూ బాలల నవలికలు ఈ మధ్య కాలంలో చాలా తక్కువగానే వెలువడ్డాయని చెప్పుకోవాలి. భాషా సాహిత్య పఠనాలపై దృష్టిని ఆకర్షించవలసిన అవసరాన్ని

రెండు మంచి బాల నవలలు..
X

మన తెలుగులో బాల సాహిత్యం, అందులోనూ బాలల నవలికలు ఈ మధ్య కాలంలో చాలా తక్కువగానే వెలువడ్డాయని చెప్పుకోవాలి. భాషా సాహిత్య పఠనాలపై దృష్టిని ఆకర్షించవలసిన అవసరాన్ని గుర్తించినందువల్లేమో 'తానా, మంచి పుస్తకం' హైదరాబాద్ ప్రచురణల వారు సంయుక్తంగా పోటీ నిర్వహించారు. ఆ బాలల నవలల పోటీలో వచ్చిన రచనల్లో, పేట యుగంధర్ ‘జాను అనే నేను, నా స్నేహితురాళ్లు’, ఆర్. సి.కె. రాజు గారి ‘మునికృష్టడి మాణిక్యం’ నవలలు ఎంపిక చేసిన ఐదులో ఉన్నాయి. పేట యుగంధర్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ చేసి కంప్యూటర్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సామాజిక హాస్య క్రైమ్ అన్ని రకాల కథలు రాస్తూ బాలసాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తి కనపరచటం హర్షించదగ్గ విషయం. ఈ పోటీలో ఎంపికై ప్రచురింపబడిన రెండవ నవలిక ఆర్సీ కృష్ణస్వామి రాజుది. ఆయన ఇప్పటికే నాలుగు బాలల పుస్తకాలు ప్రచురించి పురస్కారాలు పొంది ఉన్నారు.

చదువుకుంటాం.. ఆగిపోం..

ఇప్పుడు ఈ రెండు నవలల్లోని వస్తు వైవిధ్యం, కథనం గురించి పరిశీలిస్తే.. పేట యుగంధర్ నవలికలో, పదవ తరగతికి వచ్చిన జాను తన అన్న కిషోర్ కంటే బాగా చదివినా, ఇంటి పనులలో సహాయం చేసినా, ఏనాడూ జానుని వాళ్ళ నానమ్మ మెచ్చుకోదు. ఆడపిల్లలకు చదువు, ఉద్యోగాల కలలు అక్కర్లేదు అనుకునే ఆమె వైఖరికి జానూ నిరాశపడదు. టీచర్లు అందించిన ప్రేమ ప్రేరణలతో జాను, ఆమె స్నేహితురాండ్రు పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలని కష్టపడి పరీక్షలు రాస్తారు. చదువుతోపాటు సమకాలీన సమాజంలోని సాంఘిక, శాస్త్ర సాంకేతికత పట్ల కూడా చక్కని అవగాహన కలిగి ఉంటారు.

కిడ్నాపర్ల ముఠా గుట్టు రట్టు

వాటిలో ముందుగా వారు సాధించిన విజయం - జాను నాయకత్వంలో తమ ఊర్లో బాల్య వివాహాన్నొకదాన్ని నిలుపు చేయించడం. అలాగే పిల్లల అదృశ్య కిడ్నాప్ వార్తలు పత్రికలలో చదువుతూ తమ ఊరి తోటలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా అనుమానిస్తారు. ఆ వైనాన్ని పసిగట్టి అపురూప శైలిలో కిడ్నాపర్ల ముఠా గుట్టు బట్టబయలు చేసి ఎస్పీ చేత అభినందనలు అందుకుంటారు. జానూని సాహస బాలల రాష్ట్రపతి అవార్డుకు సిఫార్సు చేస్తామని, జానుకు, ఆమె స్నేహితురాళ్ళకు పోలీసు అధికారులు నగదు బహుమతులిస్తారు. అదే సమయంలో ఈ బృందం ట్రిపుల్ ఐటీలో సీట్లు సంపాదించిన వార్త తెలియవస్తుంది.

ఆడపిల్లలను సమానంగా పెంచండి

చివరగా కొసమెరుపు ఏమిటంటే జాను నానమ్మ, తన తప్పుని ఒప్పుకుని తన వైఖరి పట్ల పశ్చాత్తాపంతో “ఇప్పుడు జానుకు నాన్నమ్మనని గర్వంగా చెప్పుకుంటాను. మీరు కూడా ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా పెంచండి’ అంటుంది. ఇది తన ఒక్కరి విజయం కాదని, 'జాను అనే నేను నా స్నేహితురాళ్ళు' సాధించిన విజయం అని, ధైర్య సాహసాలలో స్త్రీలు కూడా పురుషులకు తీసిపోరని’ జాను ప్రకటించడంతో నవలిక ముగుస్తుంది.

ముద్దుల కోడిపుంజు అదృశ్యం..

అలాగే కృష్ణ స్వామి రాజు 'మునికిష్టడి మాణిక్యం' నవలలో మునికిష్టడికి ఇష్టమైన 'మాణిక్యం' అనే ముద్దుల కోడిపుంజు ఎందుకు అదృశ్యమైందో.. చివరి వరకు సస్పెన్స్‌తో సాగి, అసలు విషయం తెలుసుకున్నాక నోరార నవ్వుకుంటాం. రచయిత భాషా శైలి.. తప్పిపోయిన మాణిక్యం క్షేమంగా ఉందా ఎక్కడ దాక్కుంది అసలు దొరుకుతుందా లేదా ఇలాంటి ప్రశ్నలు మునికిష్టడినే కాదు, పాఠకుడిని కూడా సతమతం చేస్తాయి. చివరికి తన మిత్ర బృందం- పంచపాండవులు, శ్యామల సహకారంతో ఊరువాడా పుట్టగుట్ట గాలించి పట్టుకుంటారు. మాణిక్యం ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిందో నవల చివరాఖరికి తెలిసి రావడంతో నవలిక వినోద ప్రదంగా ముగుస్తుంది.

కూస్తే అలారం.. కోస్తే పలారం

చివర్లో మాణిక్యం దొరికితే దానిని తలపై పెట్టుకుని మునికిష్టడు రాజకుమారుడిలా తన మిత్ర బృందంతో 'జజ్జనక జజ్జనక' అని ఎగురుకుంటూ ఊరేగింపుగా ఇంటికి చేరుకుంటుంది. ఆ విజయోత్సవానికి ముగింపు వారం రోజుల తర్వాత మునికిష్టడి తల్లి నారాయణమ్మ విందు చేస్తుంది. అందరూ 'కోడి కూస్తే అలారం-కోడి కోస్తే పలారం' అని డాన్స్ చేసి, ఉడకబెట్టిన నాటు కోడిగుడ్ల పులుసన్నం ఆరగిస్తుండగా మాణిక్యం పరవశంతో కూడిన పర్యవేక్షణలో.. దూరంగా పుత్తూరు శల్య వైద్యశాల నవ్వుతున్నట్లుగా ఉంది' అన్న వాక్యంతో నవల ముగుస్తుంది. తానా, మంచి పుస్తకం ప్రచురణలైన ఈ రెండింటిలో సందర్భోచితమైన రేఖాచిత్రాలు ముద్రణ పరమైన తప్పులు లేకుండా కంటికింపైన ఫాంటుతో ప్రచురించడం, పిల్లలు కూడా తాము పొదుపు చేసుకున్న పాకెట్ మనీతో కొనుక్కోగలిగిన ధర పెట్టడం ముదావహం.

పుస్తకం: మునికిష్టడి మాణిక్య, జాను అనే నేను, నా స్నేహితురాళ్లు

ప్రతులకు: 94907 46614


పరిచయకర్త

-మల్లేశ్వర రావు ఆకుల

79818 72655

Next Story