- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రోలిటేరియన్ జర్నలిస్ట్ మాత్రమే కాదు.. ఒక ఫినామినా
Muneer Bhai- Proletarian Journalist Book Review

తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు నిష్టతో బతికిన అరుదైన సామాజిక రుషి మహమ్మద్ మునీర్. సింగరేణి నల్ల నేల కడుపున పుట్టి, అక్కడి మసిబారిన బొగ్గు గనుల కార్మికుల గొంతుకగా మారిన ఒక అసాధారణ ప్రజా నాయకుడి జీవిత ప్రస్థానమే ఈ పుస్తకం.
పారిశ్రామిక కాలుష్యం పెంచిన కేన్సర్ మహమ్మారితో పోరాడి ఆయన భౌతికంగా మనకు దూరమై ఉండొచ్చు, కానీ ఆయన వదిలివెళ్లిన ఆశయాలు, చూపిన మార్గం ఈ సమాజానికి ఎప్పటికీ సజీవ దిక్సూచి.
ఆయన స్థానం చెక్కు చెదరదు ఎందుకంటే..?
మునీర్ కేన్సర్ రోగానికి బలై.. ఈ దేశ ఆరోగ్య వ్యవస్థకు, అభివృద్ధి పేరిట విషం చిమ్ముతున్న కాలుష్యానికి ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు. మునీర్ మరణానికి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. కానీ.. అతడు సంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికేంతవరకు అతని స్థానం చెక్కు చెదరదు. మునీర్ పరిణామక్రమం.. ఒక మనిషి పరిపూర్ణ జీవితం. ఒక వందేళ్లు పాటు ఈ సమాజానికి దారి చూపే ద్రష్ట.. అసమానత ప్రాతిపదికగా నిర్మించబడ్డ సమాజాలను సంఘటిత పరిచి, వాటిని సమానత్వపు పునాదులపై నిలిపే ఒక సంఘం వైపు నడిపించే నూతన మానవులకు మరణమే లేదని ఎప్పటికప్పుడు చరిత్ర ప్రకటిస్తూనే వుంది. ఆ పిలుపును మునీర్ అందుకున్నాడు. ఒక వీరుడిలా.. ఒక ధీరుడిలా బ్రతికాడు.
మునీర్ భాయిని మరవని నల్లనేల..
మునీర్..మూడు అక్షరాలే.. తన పేరు... కానీ, ఎంత పెద్ద పేరు సంపాదించాడు! మూడు అక్షరాల మునీర్ పేరును మనం అందరం కలిసి అయిదు అక్షరాల.. మునీర్ భాయ్.. చేసి మన ప్రేమను ప్రకటించుకున్నాం. కానీ.. అది సరిపోదు.. అతని ఆశయాలు నెరవేరేంతవరకు అతని పేరు చెరిగిపోదు.. అతన్ని కని పెంచిన ఈ నల్ల నేల అతన్ని మర్చిపోదు. మునీర్... ఒక మనిషి ఎలా బతకాలో.. జీవించి చూపించిన ఒక పరిపూర్ణ ప్రతిరూపం. అతనికి ..మరణమే లేదని నిరూపించడమే ..ఇప్పుడు మన అందరం కలిసి చేయాల్సిన పని..
ఎలాగైనా బతికించుకోవాలి
అప్పుడే.. మునీర్ నవ్వు.. అది ఒక విజయహాసం.. ఒక వీర హాసం ...మన అందరి వీపు తట్టి.. చల్! నడువుర భయ్..! ..అని ..మన వెంటే నడిచి వస్తుంది. అలాంటి మునీర్ జీవితాన్ని ఒక పుస్తకంగా మలిచి.. సంపాదకులు ఒక చారిత్రక అవసరాన్ని నెరవేర్చారు. దీంతో ..వారు, వారి బరువు కాస్త దించుకున్నారు.. కానీ ఇప్పుడు మన బాధ్యత మొదలవుతుంది... మునీర్‌ను మనం ..మన ఆచరణలో తిరిగి బతికించుకోవాలి.
ఇంత మందిని ఎలా ఆకర్షించినట్టు..
మునీర్ ఇంత మందిని ఎలా ఆకర్షించగలిగాడు.. భారత దేశమే గర్వించదగ్గ లాయర్ కన్నాభిరాం తన ఆత్మకథ 24 గంటల్లో మునీర్ పేరే ఎక్కువ సార్లు పలవరించారని ఆ పుస్తక రచయిత ఎన్. వేణుగోపాల్ పేర్కొన్నారు. దేశం గర్వించదగ్గ మేధావి, మానవ హక్కుల నాయకుడు బాలగోపాల్ సింగరేణి ప్రాంతానికి వచ్చి సరాసరి మునీర్ ఇంటి తలుపు తట్టాడు.
మునీర్ ఏమిటి ప్రొఫెసర్..మేధావా కాదు... కానీ ఏమిటి అతని ప్రత్యేకత.
అందరి కంటే ముందు నడిచాడు..
అతను ఇక్కడి ప్రజల గొంతుక. అతను అందరి కంటే ముందు మేల్కొంటాడు. అందరి కంటే ముందు నడిచాడు.. అందుకే ప్రజలు అతని వెంట నడిచారు. ఇప్పటికి నడుస్తున్నారు. ఎప్పటికి నడుస్తారు. అది.. ఒక నాయకుడి ప్రభావం.. మునీర్ గొప్ప నాయకుడే కాదు... తన చుట్టూ వున్న వారిని ఆ దిశగా నడిపించ గలిగిన మహా నాయకుడు.. అతడు ఒక 'ఫినామినా'. ఎవరో కవి అంటారు. మహాకవి శ్రీశ్రీ గురించి.. కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నదని.. అలాంటి ఒక ఫినామినా అనిపిస్తాడు మునీర్. అతని స్ఫూర్తిని నాలో..మీలో నింపుకోవడానికి. ఈ పుస్తకం ఒక సహాయకారి కాగలుగుతుందని నమ్ముతున్నాను.
మరణించినా ఇంకా ప్రకాశిస్తున్నాడు..
''ఇన్ని రకాల సామాజిక సంబంధాలు, సహచర్యాలు ఉన్న మునీర్‌కు అందులో కోల్ బెల్ట్ సంస్కృతిలో పుట్టి పెరిగిన మునీర్‌కి ఒక వ్యసనం కానీ, ఒక బలహీనత కానీ లేక పోవడం గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. సిగరెట్ తాగడు, మద్యం సేవించడు, జూదరి కాదు, సినిమాల పిచ్చి లేదు. ఇలా ఏ దీక్షా తీసుకోకుండానే జీవితాంతం తాను నమ్ముకున్న విశ్వాసాల కోసం, సిద్ధాంతాల కోసం నిష్టపూనిన రుషి మా మహ్మద్ మునీర్.... పుట్టుక నాది. చావు నాది.. బతుకంతా సమాజానిది.. అని చచ్చేదాకా బతికినవాడు.. మరణించినా ఇంకా ప్రకాశిస్తున్న వాడు.. మా మునీర్... ఇక్కడి ఆకలి బాధలను, అన్నార్థుల ఘోషలను అర్థం చేసుకున్నవాడు.... నల్ల నేలను మసిబారిన బాయి పని బతుకులను గుండె నిండా ప్రేమించినవాడు మునీర్...''
పుస్తకం: మునీర్ భాయ్ (పొలిటికల్ జర్నలిస్ట్)
ఎడిటర్స్: మాదాసి రామమూర్తి, నక్క వెంకట్రావ్
పేజీలు: 184 , వెల: 200/-
ప్రచురణ: అక్షర ఫౌండేషన్
ప్రతులకు: 9849986366
పరిచయకర్త
- పి.హేమ లలిత,
73968 02440






