ఆధునిక సమాజం.. తాత్విక దిక్సూచి

by Ravi |   (  Updated:2025-11-30 22:31:07  IST  )

Modern society.. Philosophical compass

ఆధునిక సమాజం.. తాత్విక దిక్సూచి
X

తత్వశాస్త్రం మానవ చరిత్రలో సుదీర్ఘ మార్పులకు కారణమైన ప్రాథమిక శక్తి. ఇది సిద్ధాంతాల సమాహారం మాత్రమే కాదు, జీవితాన్వేషణ. అస్తిత్వం, సత్యం, జ్ఞానం, నైతికతలపై చేసే లోతైన ప్రశ్నల విచారణ తత్వానికి హృదయం. శాస్త్రం ‘ఎలా’ అని అడిగితే, తత్వం ‘ఎందుకు’ అని అన్వేషిస్తుంది. సాంకేతిక పరిణామం వేగంగా మారుతున్న ఈ యుగంలో మనిషి అడుగులు దారి తప్పకుండా నడిపించే దిక్సూచి తత్వమే.

తత్వ, శాస్త్రజ్ఞానాల సమన్వయం

భారతీయ తత్వ సంప్రదాయం జీవనశైలితో ముడిపడి ఉంటుంది. ఉపనిషత్తుల ‘ఆత్మ విజ్ఞానం’, బౌద్ధంలోని దుఃఖనివారణ మార్గం, ధర్మపథం, యోగశాస్త్రం, గాంధీజీ ఆహింస. ఇవి కరుణ, ధర్మం, జ్ఞానం అనే పునాదులను నిర్మించాయి. గురుకుల విద్యలో శరీర బలం, మనోనిగ్రహం, సేవ, ధర్మబోధ ప్రధానాంశాలు. ఆధునిక విద్య పరిశోధన శక్తిని పెంచినా, విలువలు కొంత మేర మసకబారాయి. అందుకే తత్వజ్ఞానం, శాస్త్రజ్ఞానం సమన్వయం అత్యవసరం.

సమాజాన్ని మార్చేది తాత్వికతే..

తత్వవిలువలు సమాజాన్ని ఎలా మార్చాయనడానికి కేరళలోని కుడుంబశ్రీ ఒక సాక్ష్యం. మహిళా శక్తీకరణ, సమానత్వం, సహకార భావనకు ఇది ప్రపంచం గుర్తించిన “ఇండియన్ సోషల్ మోడల్”. చిప్కో ఉద్యమం ప్రకృతి రక్షణను ధర్మంగా భావించిన ఉదాహరణ. అభివృద్ధి అంటే ప్రకృతి నాశనం కాదని ప్రపంచానికి భారత్ ఇచ్చిన నైతిక సందేశం అది. అంతర్జాతీయంగా కూడా ఇదే దృక్పథం పెరుగుతోంది. సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్లోబల్ ఎథిక్స్, డిజిటల్ హ్యూమానిజం వంటి రంగాల్లో దేశాలు తత్వాన్నే మార్గదర్శకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా భూటాన్ దేశం ప్రవేశపెట్టిన ‘గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ (GNH)’ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాత్విక, సామాజిక నమూనా. ఇది జీడీపీ కన్నా మానవ సంతోషాన్ని ప్రాధాన్యంగా చూపించింది.

విలువల సమాజమే భావికి రక్షణ..

యాంత్రిక నిర్ణయాలు మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్న కాలంలో ధ్యానతత్వం నిలకడనిస్తుంది.అనుభవ తత్వం సత్యం చెబుతుంది. నైతికత సాంకేతికతకు మానవతను అందిస్తుంది. యంత్రాలు తప్పు చేస్తే మార్చవచ్చు. మనిషి తప్పు చేస్తే ఆలోచన మార్చాలి. ఆ మార్పుకు మార్గం తత్వం. తత్వం ఆలోచనలకు వెలుగు, శాస్త్రం ఆ వెలుగుకు రూపం, విద్య ఆ రూపాన్ని జీవితంలో నాటే శక్తి. ఈ త్రి సూత్రం ఒకటైనప్పుడు సమాజం జ్ఞానం, మానవత, సంస్కృతి, సమగ్రాభివృద్ధి దిశగా ప్రవహిస్తుంది. విలువలతో కూడిన సమాజమే భవిష్యత్తు తరాలకు రక్షణగా ఉంటుంది.

-గిలకత్తుల వెంకటరమణగౌడ్

98668 78769

Next Story