శ్రమజీవి అస్తిత్వాన్వేషణలో దిశా నిర్దేశం మెట్న

by Ravi |   (  Updated:2026-04-27 01:00:29  IST  )

Metna Book Review

శ్రమజీవి అస్తిత్వాన్వేషణలో దిశా నిర్దేశం మెట్న
X

తెలుగు సాహిత్యంలో వర్గ చైతన్యానికి, శ్రమజీవి జీవితానికి సంబంధించిన రచనలు విస్తృతంగా ఉన్నప్పటికీ, ఒక నిర్దిష్ట వృత్తి వర్గాన్ని కేంద్రీకరించి, వారి చరిత్ర–పౌరాణిక మూలాలు–ఆధునిక సామాజిక వాస్తవాల సమన్వయంతో దీర్ఘకావ్య రూపంలో రచించబడిన గ్రంథాలు అరుదు. ఈ నేపథ్యంలో ‘మెట్న’ ఒక ప్రత్యేకమైన సాహిత్య కృషిగా నిలుస్తుంది.

ఇది కేవలం కవిత్వం కాదు. ఇది ఒక వృత్తి వర్గ ఆత్మగాథ. శ్రమను సాహిత్య విలువగా, వృత్తిని గౌరవ చిహ్నంగా, చరిత్రను ఆత్మ సాక్ష్యంగా మలిచిన కవితా నిర్మాణం. ‘మెట్న’ అనే పదం నిర్మాణ ప్రక్రియలో ఉపయోగించే ‘మెట్టు’ భావాన్ని ప్రతిబింబిస్తుంది. మెట్టు ఎత్తుకు తీసుకెళ్లే సాధనం. కానీ ఆ మెట్టును నిర్మించినవాడు ఎత్తుకు చేరకపోవడం ఒక సామాజిక విరోధాభాసం. కవి ఉప్పరి తిరుమలేష్ ఈ ప్రతీకను కేంద్రీకరించి, నిర్మాణ వృత్తి కార్మికుల జీవన యథార్థాన్ని దీర్ఘ కవితా రూపంలో విశ్లేషిస్తాడు ఈ పుస్తకంలో. శీర్షికలోనే సామాజిక విమర్శ, వర్గ చైతన్యం, అంతర్ముఖత అంతర్లీనంగా ఉన్నాయి.

ఇతివృత్త నిర్మాణం

ఈ గ్రంథం సంప్రదాయ కవితా సంకలనంలా విడివిడిగా ఉన్న కవితల సమాహారం కాదు. ఇది ఒకే దీర్ఘకావ్య ప్రవాహం. ఉపఖండాలుగా విభజింపబడినప్పటికీ, వాటి మధ్య అంతర్గత భావ సంబంధం స్పష్టంగా ఉంటుంది. వృత్తి మూలాలు, పురాణ అనుసంధానం, నిర్మాణ ప్రదేశ దృశ్యాలు, సామాజిక అసమానత, ఆత్మగౌరవ స్వరం. ఇవి అన్నీ సమగ్రంగా ఒకే భావరేఖలో కదులుతాయి. ‘మెట్న’లో ముఖ్యంగా గమనించదగిన అంశం పురాణ ప్రస్తావన. సగర చక్రవర్తి వంశ గాథ, భగీరథుని తపస్సు వంటి అంశాలను కవి తిరుమలేశ్ తన ఉప్పరి వృత్తి మూలాలతో అనుసంధానిస్తారు. ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రయోగం కాదు.. వర్గ చరిత్రను గౌరవప్రదంగా పునర్నిర్వచించే ప్రయత్నం. భగీరథ చరిత్ర భావితరానికి మార్గదర్శం పూర్వీకులకు ఉత్తమగతులు కలిగిస్తూ సగర చరితకు ఆయువైనాడు ఆయన సగర మూలపురుషుడు భగీరథుడు. చరిత్రలో తమ స్థానాన్ని కోల్పోయిన వర్గానికి సాంస్కృతిక ఆధారం కల్పించడమే ఈ ప్రయోగం లక్ష్యం.

శ్రమ సౌందర్య శాస్త్రం

సాహిత్యంలో శ్రమను సాధారణంగా బాధ–వేదనల కోణంలోనే చిత్రిస్తారు. కానీ ‘మెట్న’లో శ్రమ ఒక సృజనాత్మక శక్తిగా దర్శనమిస్తుంది. గడ్డపార, తాపీ, గుండు, దారం, ఆయం, ఇటుక, ఇసుక ఇవి కేవలం పనిముట్లు కాదు.. అవి కవితా ప్రతీకలు. ‘మెట్న మూలలను నిర్మిస్తే గుండు బాధలను దూరం చేస్తుంది. తాపీ ఇంటి తలరాతలు రాస్తుంది దారం జీవిత రహదారి నిర్మిస్తుంది. ఆయం ఉప్పరుల చేతిలోని ఇంటి నిర్మాణ అస్త్రం... ఇలా ఇంటి తలరాతలు రాసే మట్టి మనుషులు ఉప్పరులు అంటాడు కవి ఒకచోట. అలాగే, ‘పునాదే తొలి సంతకం గడ్డపారనే ఉప్పరుల కలం. తాపీ పళ్ళెమే బలం. వొలెంగుండు దారమే ఆయుధం అంటూ నిర్మాణ ప్రదేశం ఒక సాహిత్య వేదికగా మారుతుంది కవి కన్నుల్లో. చెమటకు కవి ఇచ్చిన గౌరవం ఈ గ్రంథానికి ప్రత్యేకతను ఇస్తుంది.

సామాజిక విమర్శ

కవి ప్రశ్నించిన ప్రధాన విరోధం భవనాలు నిర్మించినవారికి నిలువనీడ లేకపోవడం, విద్యాసంస్థలు నిర్మించినవారికి విద్య అందకపోవడం, దేశ నిర్మాణంలో పాలుపంచుకున్నవారికి నిర్ణయాధికారంలో స్థానం లేకపోవడం. ఈ విమర్శ ఘాటైనదే అయినా, అది విద్వేషపూరితంగా కాకుండా చైతన్య పూర్వకంగా ఉంటుంది. కవి సమాజాన్ని శత్రువుగా కాకుండా సంస్కరణకు అవసరమైన వేదికగా ఇలా అంటాడు. ‘ముగ్గు పోసి మొగ్గలాంటి భవనాలను నిర్మించిన భవన కార్మికులమైనందుకేనా మాకు రాజ్యాధికారం దూరమవుతుంది’ ‘మెట్న’లో భాష ప్రాంతీయతను కలిగి ఉంది. స్థానిక పదజాలం, వృత్తికి సంబంధించిన శబ్ద వినియోగం కవితకు సహజత్వాన్ని ఇస్తాయి. అలంకార భరితం కాకుండా, అనుభవ భరితం కావడం ఈ గ్రంథానికి బలం. భావ గాంభీర్యం సరళమైన పదప్రయోగంలోనే వ్యక్తమవుతుంది.

భవిష్యత్ పరిశోధనలకు..

ఈ గ్రంథం ప్రధానంగా వర్గ చైతన్య కవిత. ఉప్పరి వృత్తిని తక్కువగా చూడే సామాజిక దృక్పథాన్ని కవి సవాలు చేస్తాడు. “మట్టి గుణం తెలిసిన మట్టి మనుషులం” అనే భావన గ్రంథమంతా ప్రతిధ్వనిస్తుంది. వృత్తి గౌరవాన్ని సాహిత్య రూపంలో స్థాపించడం ఈ రచన ముఖ్య లక్షణం. అయితే దీర్ఘకావ్య రూపంలో ఒక వృత్తి వర్గ జీవితాన్ని సమగ్రంగా ఆవిష్కరించడం సాహసోపేతమైన కృషి. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇది ఒక సామాజిక దస్తావేజుగా పరిగణించదగినది. భవిష్యత్ పరిశోధనలకు ప్రత్యేకంగా వర్గ అధ్యయనం, ఉపాధి ఆధారిత సాహిత్య పరిశీలన, శ్రమ సౌందర్యశాస్త్రం వంటి విభాగాలకు ఈ గ్రంథం ఒక ఆధార గ్రంథంగా ఉపయోగపడగలదు.

ముగింపు..

‘మెట్న’ ఒక శ్రమజీవి వర్గ ఆత్మగాథను కవిత్వంగా మలిచిన సమగ్ర కృషి. ఇది కేవలం నిర్మాణ వృత్తి గాథ కాదు; ఇది సమాజ నిర్మాణంపై ప్రశ్న. శ్రమకు గౌరవం ఇవ్వని వ్యవస్థపై సాహిత్య విమర్శ. వృత్తి గౌరవాన్ని పునరుద్ధరించే చైతన్య కవిత. సామాజిక బాధ్యతతో కూడిన సాహిత్య సృష్టి ఎలా ఉండాలో చూపించిన ఉదాహరణగా ‘మెట్న’ నిలుస్తుంది. శ్రమను సౌందర్యంగా, వర్గాన్ని గౌరవంగా, చరిత్రను ఆత్మ సాక్ష్యంగా మలిచిన ఈ గ్రంథం ఆధునిక తెలుగు సాహిత్యంలో కవి ఉప్పరి తిరుమలేశ్‌కు ఒక ప్రత్యేక మైలురాయి అని చెప్పవచ్చు.

పుస్తకం: మెట్న(దీర్ఘ కవిత)

కవి: ఉప్పరి తిరుమలేశ్

పేజీలు:100, వెల: 100/-


సమీక్షకులు

- కమలేకర్ నాగేశ్వర్ రావు

98484 93223.

Next Story