కథా-సంవేదన:ఓ అందమైన దృశ్యం

by Disha edit |
కథా-సంవేదన:ఓ అందమైన దృశ్యం
X

మొన్న రాత్రి మా బాల్కనీలోని బ్రహ్మకమలం విచ్చుకునేట్టు అనిపించింది. అవి విచ్చుకుంటున్న దృశ్యాన్ని చూడాలని, దాన్ని కెమెరాలో బంధించాలని అనుకున్నాం. అందుకని ఓ గంటసేపు అక్కడే కూర్చున్నాం. మొబైల్ వీడియో ఆన్ చేసి వుంచాం. ఓ గంట తరువాత ఓ రెండు కమలాలు విచ్చుకున్నాయి. ఆ తెల్లవారి ఉదయం టీ తాగుతూ బెడ్ రూంలో కూర్చున్నాను అది గ్రౌండ్ ఫ్లోర్‌లో వుంటుంది. ఇంటి ముందటి పరిసర ప్రాంతాలు మా బెడ్ రూం కిటికీ నుంచి కాస్త కన్పిస్తాయి. మా ఇంటి ముందు వున్న ఖాళీ స్థలంలో చాలా పూల మొక్కలు వున్నాయి. ఆ రోజు రకరకాల పుష్పాలు పూచాయి. అందులో ఎర్ర గులాబీలు విరగబూసాయి. వాటిని చూస్తూ అలా కూర్చున్నాను.

సరిగ్గా అదే సమయంలో మా అందరి విల్లాల నుంచి చెత్తను తీసుకెళ్లడానికి చిన్న వ్యాన్ వచ్చి ఆగింది. లాక్‌డౌన్ సమయంలో కూడా క్రమం తప్పకుండా పనిచేసిన వ్యక్తులు వాళ్లు. ఆ తరువాత కూడా ఆ జంటే రోజూ వచ్చి చెత్తని తీసుకుని వెళ్తూ ఉన్నారు. చాలా మంది చెత్తని తమ ఇంటి ముందు వున్న ఖాళీ స్థలంలో వుంచుతారు. కొంతమంది అప్పుడే తెచ్చి అక్కడ పెడుతూ వుంటారు. అలాంటి వ్యక్తుల కోసం మా వీధి మూలమలుపు దగ్గర అతను చిన్న హారన్ మోగిస్తాడు. అంతే తప్ప ఎలాంటి శబ్దమూ చేయడు. నిశ్శబ్దంగా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ వెళ్లిపోతారు.

ఆ వ్యాన్ నడుపుకుంటూ, చెత్తని తీసుకొని వెళ్తాడు ఆ కుర్రవాడు. అతని వయస్సు 25 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఆమె వయస్సు అతని కన్నా ఒకటి రెండు సంవత్సరాలు తక్కువ ఉండవచ్చు. అతను వ్యాన్ దిగి అందరి ఇళ్ల ముందు వున్న చెత్త మూటలను తీసుకొని వెళ్లి వ్యాన్ లో వున్న ఆమెకి అందిస్తూ వున్నాడు. ఆమె తీసుకొని వాటిని వ్యాన్‌లో సర్దుతూ వుంది. సాధారణంగా ఆ వ్యాన్‌ని మా ఇంటి దగ్గరలో ఆపుతారు. అందరి ఇళ్ల ముందు వున్న చెత్త మూటలని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది రోజూ కన్పించే దృశ్యం. అయితే ఆ రోజు ఉదయం ఓ అందమైన దృశ్యం కనిపించింది.

మా ఇంటి ముందు పూచిన పుష్పాలు అతని దృష్టిని అంతగా ఆకర్షించలేదు. అతని పనిలో అతను నిమగ్నమై వున్నాడు. ఆమె తన పని తను చేస్తూనే విరగబూసిన ఎర్ర గులాబీల వైపు ఇష్టంగా చూస్తోంది. చెత్త మూటలని అందిస్తున్న అతను, ఆమె దృష్టిని ఆకర్షించిన పువ్వుల వైపు చూశాడు. అప్పటి దాకా అతనికి కన్పించని పువ్వులు అతనికి కన్పించాయి. ఆకర్షించాయి. మరీ ముఖ్యంగా ఎర్ర గులాబీలు అతన్ని కూడా ఆకర్షించాయి. ఆమె ఆ పువ్వులు కావాలని అడగలేదు. కావాలా? అని అతనూ అడగలేదు. కానీ, తన చేతికి వున్న తొడుగులని తీసి వేశాడు. ఆ ఎర్ర గులాబీలలో విరగబూసిన ఓ ఎర్ర గులాబీని తుంచి వ్యాన్‌లో వున్న అతని భార్యకు అందించాడు. అతను పువ్వుని ఇస్తాడని గమనించిన ఆమె తన చేతి తొడుగులని తీసేసి ఆ పువ్వుని అందుకోవడానికి సిద్ధంగా వుంది.

ఆమె ఆ గులాబీని ఆనందంగా అందుకుంది. ఆమె ముఖంలో లక్ష గులాబీలు వికసించినట్టుగా అన్పించింది. ఎంతో ఇష్టంగా అందుకున్న ఆ ఎర్ర గులాబీని వెంటనే తలలో తరుముకుంది. ఆ దృశ్యాన్ని చూసి అతని కన్నులు ఆనందంగా నవ్వాయి. ఎంత సున్నితంగా వుంది ఆ దృశ్యం అన్పించింది నాకు. అర్థరాత్రే కాదు. బ్రహ్మ కమలం మళ్లీ ఆ ఉదయం మా ఇంటి ముందు విచ్చుకుంటున్నట్టు నాకనిపించింది. అర్థరాత్రులే కాదు. అప్పుడప్పుడు ఇలా బ్రహ్మ కమలాలు ఉదయం మా ఇంటి ముందు వికసించాలని అన్పించింది.

మంగారి రాజేందర్ జింబో

94404 83001


Next Story