- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీమ నుంచి వచ్చిన కథా గుళిక: కటకటా మర్కటా
Katakata Markata Book By R.C. Krishnamaraju Book Review

కథల ద్వారా పిల్లలకు ప్రపంచాన్ని పరిచయం చేయండి. వారి ఊహలకు రెక్కలు తొడిగి, సృజనాత్మకంగా ఆలోచించేలా తయారు చేయండి.” అని అంటారు ప్రముఖ విద్యావేత్త, బాలసాహితీవేత్త గిజూభాయి బధేకా. భారతదేశానికి మాంటెస్సోరి విద్యా పద్ధతులను పరిచయం చేయడంలో సహాయపడిన విద్యావేత్త ఆయన.
బాల సాహిత్యం అనేది కేవలం పిల్లల వినోదం కోసం మాత్రమే కాదు. అది వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనా సరళికి, భవిష్యత్తుకు బలమైన పునాది. బాల్యంలో చదివిన పుస్తకాలు, విన్న కథలు జీవితాంతం గుర్తుండి పోతాయి. నీతి కథలు, జానపదాలు పిల్లలలో నిజాయితీ, దయ, పెద్దల పట్ల గౌరవం, సామాజిక బాధ్యత వంటి ఉత్తమ గుణాలను పెంపొందిస్తాయి. చిన్న వయసులోనే మంచి-చెడుల మధ్య తేడాను సులభంగా అర్థం చేసుకునేలా చేస్తాయి.
మనం వదిలేసిన బాల సాహిత్యం
బాల సాహిత్యం చదవడం లేదా వినడం ద్వారా పిల్లలకు మాతృ భాషపై మంచి పట్టు లభిస్తుంది. స్పష్టమైన ఉచ్ఛారణ, మరియు భాషా సౌందర్యాన్ని అలవరచుకోవడానికి సహాయపడుతుంది. ఆకర్షణీయమైన గేయాలు, సరదా కథలు పిల్లలకు ఆనందాన్ని ఇస్తాయి. చదువు, ఇతర ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగించి, వారిని మానసికంగా ఉల్లాసంగా ఉంచుతాయి. ఇతర దేశాలతో పోలిస్తే, మన దేశంలో బాల సాహిత్యానికి ఆదరణ, ప్రోత్సాహం రెండూ తక్కువే. మరీ ముఖ్యంగా పిల్లలకు బాల సాహిత్యాన్ని అందివ్వాలి అనే స్పృహను మన తెలుగు సమాజం ఎప్పుడో వదిలేసింది. సాహితీవేత్తల్లో సైతం కేవలం కొద్ది మంది రచయితలు మాత్రమే బాల సాహిత్యాన్ని రాస్తున్నప్పటికీ, అవి చేరాల్సిన వారికి చేరడం లేదు. తల్లిదండ్రులు ఆ బాధ్యతను తీసుకోవడం లేదు. ప్రభుత్వాలు పూనుకొని ప్రయత్నిస్తే తప్ప అది సాధ్యం కాదేమో!
సీమ నుంచి మెరుపులు..
రాయలసీమ నుండి బాల సాహిత్య కృషి చేసిన వారిలో కలువకొలను సదానందం, సభా ముఖ్యలు. వారు చూపిన దారిలో నడుస్తూ, అతికొద్ది మంది రాయలసీమ రచయితలు మాత్రమే బాల సాహిత్యం కోసం విశేష కృషి చేస్తున్నారు. వారిలో ఆర్ సి కృష్ణ స్వామి రాజు ప్రముఖులు. వివిధ వార, మాస పత్రికల్లో ప్రచురణకు నోచుకున్న వారి కథలను గుదిగుచ్చి తెచ్చిన పుస్తకం ఈ ‘కటకటా మర్కటా’. ముప్పై కథలున్న ఈ పుస్తకంలో ప్రతి కథా, మరో కథకు భిన్నంగా ఉంటుంది. అంతర్లీనంగా పిల్లలకు సమాజ పోకడను, సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది.
పిల్లల కోసం చెప్పిన కథలు..
రూపంలో కానీ, గుణంలో కానీ, నడవడికలో కానీ ఏ ఇద్దరూ ఒక్కలా ఉండరు, అనే జీవిత సత్యాన్ని ‘రెండాకులు’ కథ ద్వారా రజితకే కాకుండా రజిత లాంటి ఎంతోమంది పిల్లలకు చెబుతారు రచయిత. ఆశకు, అత్యాశకు మధ్య తేడాను ‘చిట్టి చీమ ఆశ’ కథ ద్వారా ఆసక్తికరంగా మలిచారు. సాహసం చేస్తేనే ఫలితం దక్కుతుంది అనే నీతిని ‘ఆటలో అరటిపండు’, ‘బొరుగుల్లో రాళ్లు’ కథల ద్వారా తెలియజేశారు రచయిత. సైన్స్ కథలు పిల్లల మానసిక వికాసానికి, మేధో సంపత్తికి దోహదపడుతుంది. వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయి. ఈ పుస్తకంలో ఉన్న ‘పాలు పొంగకుండా..’ అనే కథ ఈ కోవకు చెందినదే! తప్పక చదవాల్సిన కథ ఇది. బడికి వెళ్లే పిల్లలు మాస్టార్లు చెప్పిన పాఠాలను ఒక చెవితో విని, మరో చెవితో వదిలేయకుండా మెదడులో భద్రంగా దాచుకోవాలని చెప్పే కథ “పెట్టెలో ఏముంది”.
కూలీల కష్టాన్ని గుర్తించరూ..!
‘మనం ఏది నమ్ముతామో అదే జరుగుతుంది’ అని చాటిచెప్పే కథ ‘అంతా మన మంచికే!’ ఈ కథలో బియ్యపు గింజ, కలుపు మొక్క మధ్య జరిగే సంభాషణలు ఆసక్తిగా సాగి, పాఠకుడికి ఆనందాన్ని పంచుతాయి. ఇరుగుపొరుగుతో, స్నేహితులతో ఎలా మెలగాలో చెప్పే కథ ‘ఇచ్చుటలో ఉన్న హాయి’. మరో కథ ‘చీమ తెలివి’ ద్వారా మంచి వారితో స్నేహం చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అని అంటారు రచయిత. ఆపద ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పే కథ ‘సజ్జ వడల డబ్బా’. ఏ పనికైనా మంచి ఫలితం లభిస్తే యజమానుల కీర్తి పెరుగుతుంది. కూలీల కష్టం విస్మరించబడుతుంది. రేయింబవళ్లు పనిచేసిన కూలీలను కూడా గుర్తించాలి అని చెప్పే కథ ‘గాడిద కష్టం’. పెద్దగా ఆలోచించేవాడే, పెద్ద గమ్యాలు పెట్టుకుని దాని కోసం కృషి చేస్తాడు అని చెప్పే కథ ‘కోట కట్టాలి’. ఇలా చెప్పుకుంటూ పోతే పుస్తకంలోని ప్రతి కథా అన్యోపదేశంగా పిల్లలకు మంచి సందేశాన్ని ఇచ్చేదే!
కడుపుబ్బ నవ్వించే 'కటకటా మర్కటా'
హాస్య కథలు రాయడం కష్టం అందులోనూ బాల సాహిత్యంలో హాస్యాన్ని పండించడం కత్తి మీద సాము లాంటిది. కానీ కృష్ణస్వామి రాజు బెలూన్‌కు గాలి ఊదినంత సులభంగా కథలలో హాస్యాన్ని చొప్పించగలరు. కవర్ పేజీ కథ ‘కటకటా మర్కటా’ ద్వారా పిల్ల కోతికి బెలూన్ అందించి మన పెదవులపై నవ్వులు పూయిస్తారు రచయిత. ఇందులోనే మరో హాస్య కథ ‘అమ్మా అరుస్తోందే!’ సైతం పాఠకుడిని నవ్విస్తోంది. ఈ కథలో కొత్త సైకిల్ కొన్న శ్యామ్, ఆ సైకిల్‌ను తన స్నేహితులకు చూపించి, వారి దగ్గర గొప్పలు పోవాలని అనుకుంటాడు. అందుకు అతడు చేసే ప్రయత్నం పాఠకుడిని కడుపుబ్బా నవ్విస్తుంది. జిల్లేడు చెట్టు, నల్ల తుమ్మ, బఠానీల వర్షం, పొడుగు తోక ఎలుక పేర్లతో మరికొన్ని కథలు సైతం పాఠకుడిని నవ్విస్తాయి. కథలలోని పిల్లల పాత్రధారులైన రజిత, చక్రి, రంజిత్, దీపక్, కుబేరుడు, రవితేజ, శ్యామ్, ఆదిశేషు మొదలైన వారు మన వీధిలో నిత్యం మనకు తారసపడే పిల్లలను గుర్తు చేస్తారు.
తెలుగు బాల సాహిత్యానికి గొప్ప కూర్పు
కృష్ణ స్వామి రాజు కలం నుండి వందల కొద్దీ బాలల కథలు పురుడు పోసుకున్నాయి. 23 పుస్తకాలను రాసిన కృష్ణ స్వామి రాజు పిల్లల కోసం ‘రాజు గారి కథలు’, ‘రాణి గారి కథలు’, ‘కార్వేటినగరం కథలు’, ‘నాన్నారం కథలు’ పేరుతో బాల సాహిత్య కథల పుస్తకాలను వెలువరించారు. వారు రాసిన ‘మునికిష్టడి మాణిక్యం’ అనే బాలల నవల తానా బాల సాహిత్య నవలల పోటీలో గెలుపొందింది. ఇప్పుడు ఈ బాలల కథల పుస్తకం ‘కటకటా మర్కటా’ తెలుగు బాల సాహిత్యానికి ఒక గొప్ప కూర్పు కాగలదు. నాణ్యమైన బాల సాహిత్యం కరువవుతున్న ఈ రోజుల్లో పిల్లల కోసం విలువలతో కూడిన మంచి సాహిత్యాన్ని అందిస్తున్న కృష్ణ స్వామి రాజు మున్ముందు మరింత మంచి సాహిత్యాన్ని అందివ్వాలని, బాల సాహితీవేత్తగా వారి పేరు దశదిశలా వ్యాపించాలని కోరుకుందాం.
పుస్తకం: కటకటా మర్కటా
(బాలల బొమ్మల కథలు)
రచయిత: ఆర్. సి కృష్ణస్వామి రాజు
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 120
వెల: రూ. 140
ప్రతులకు: 93936 62821
సమీక్షకులు
-పేట యుగంధర్
94925 71731






