- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంటను కలగన్న విత్తనం.. కలల రంగు
‘దర్శించడం మాత్రమే కాదు దర్శించిన దాన్ని వర్ణించే వాడే కవి’ కవి కౌతుకంలో భట్టతౌతుడన్న మాట. అక్షరాల ఇది కలల రంగు కవి రహీమొద్దీన్ కవిత్వం చదువుతుంటే నాకనిపించింది. తన బతుకు చుట్టూ గిజిగాడి గూడులా అల్లుకున్న ఆలోచనల నుండి పూసలు పూసలుగా పేర్చబడ్డ కన్నీటి ధారల కవన శిల్పం.

‘దర్శించడం మాత్రమే కాదు దర్శించిన దాన్ని వర్ణించే వాడే కవి’ కవి కౌతుకంలో భట్టతౌతుడన్న మాట. అక్షరాల ఇది కలల రంగు కవి రహీమొద్దీన్ కవిత్వం చదువుతుంటే నాకనిపించింది. తన బతుకు చుట్టూ గిజిగాడి గూడులా అల్లుకున్న ఆలోచనల నుండి పూసలు పూసలుగా పేర్చబడ్డ కన్నీటి ధారల కవన శిల్పం. నేల తల్లిని ముద్దాడిన అమ్మ బాపుల అస్తిత్వ నేపథ్యం, బతుకు పోరుకు సిద్ధపడి గెలుపోటముల సంఘర్షణలో తనను తనే కవిత్వంగా రికార్డ్ చేసుకున్న అక్షరశిల్పం, గుండె లోపలి నిశ్శబ్దాలు శబ్దాలైన ప్రసవవేదన, చరిత్రకు మేకులు కొట్టి వేలాడే సమాజాన్ని వేదికలా చూపి, ఆత్మని వేదనకు ఆత్మసాక్షికి అద్దంగా నిలిపి ఒంటరి గానం చేసిన ‘పంటను కలగన్న విత్తనం’ కవి రహీమొద్దీన్.
అందరి జీవితాలను చూపగల కవి!
కవిత్వం ఆయన ఊపిరి, ఊరట. కళ్లముందు మెదలాడే దృశ్యం భావ చిత్రమై పురుడు పోసుకుంటే దానికి భావుకతనద్ది సాహితీ క్షేత్రంలో వారసుడై కొత్త కలాన్ని చేపట్టిన కవి. కలం సిరల్లో అలలెత్తే అక్షరాల ఒత్తిడిని తట్టుకొని నిండు మనసును ఒలికించిన నెమ్మది మనిషి రాసిన కమ్మని కవిత్వ ధార! అక్షరాలకు వయసును లెక్కగట్టి పసితనపు గాయాలను మాయని పుట్టుమచ్చల్లా మలుచుకొని అందరి జీవితాలను అందులో చూపగల సమర్థకవి. దేహం వీడని బంధాలకు తావుగా తన కలంలో కాగిన అనుభవాల స్పర్శ ఈ పుస్తకం నిండా పరుచుకొని ప్రతి వాక్యంలో పాఠకులను పలకరిస్తాయి.. కలల రంగు కవితలు కొన్ని వైయక్తికమే ఐనప్పటికీ సామూహిక స్ఫురణలో అందరినీ మేల్కొల్పుతాయి.
ప్రతి గడపకు సార్వజనీనం చేసే కవితలు
మన నవ్వులెందుకు చెల్లాచెదరవుతున్నాయి/ పువ్వులను దండలా అల్లిన దారం ఎక్కడో తెగిపోతున్నది/ మనసుల్ని కలిపి ముడి వేసుకుందాం రండి.. (వెలుగు రాగాల పాట) అంటూ ఎక్కడికక్కడ తెగిపోతున్న మానవ సంబంధాలను ఎవరి మనసులో వారు పడే ఆత్మ సంఘర్షణలను అదృశ్య దారంతో ముడివేస్తూ డప్పులో నిద్రిస్తున్న దరువుల్ని నిప్పులతో కాపి దండోరా వేస్తున్నాడు కవి. అలాగే చీకటి పడ్డాక/ దీపపు తోడులోని నిశ్చింత తెలిసినట్టు /పక్కన లేనప్పుడే ఆ మనిషి మనలో నింపే/ వెలుగు తెలుస్తుందేమో! (ఆమె లేని ఓ సాయంత్రం) స్త్రీ శక్తి స్వరూపినిగా నమ్మే మన సంప్రదాయం కాగితాలకు మాత్రమే పరిమితం చేసినా, నేటి సామాజిక అంతరాలు స్త్రీ పాత్రను తగ్గించి చూసినా, ప్రతి ఇంటి వెలుగు ఆ ఇంటి ఆడదే అని నొక్కిచెప్పుతూ తోడు లేనప్పుడు/ అంకెల విలువే కాదు /ఆనందం విలువ కూడా తగ్గిపోతుందని /ఆమెలేని ఈ సాయంత్రం/ జీవిత గణితంలోని/ తీసివేతల అధ్యాయం నాకు నేర్పింది." అంటూ తన జీవిత భాగస్వామి గురించి గొప్ప విగ్రహ వాక్యాన్ని కూర్చినా.. ప్రతి గడపకు సార్వజనీనం చేసిన కవితా వాక్యాలు ఇవి.
ప్రతి వ్యాక్యం కండ్లను మనసును ఒక్కటి చేస్తయ్!
కవితా స్పర్శకు మొదటి పాఠశాల కవి ఇల్లే! ఇంట్లో పారాడిన అక్షరాలు జవవసత్వాన్ని పొందుతాయనే గట్టి నమ్మకాన్ని తట్టి లేపాడు రహీమొద్దీన్. అమ్మ, బాపు అంటూనే వారి జీవిత పుస్తకంలో గుండె నిండా దుఃఖపు ముక్క వాసన ఎలా కొడుతుందో కళ్ళ ముందు బొమ్మ గీసి చూపుతాడు. గుండె తడి రుచిని అనుభవైక వేద్యంతో అద్దిన కళారూపమే ఈ కలల రంగు! అనగనగా ఓ అమ్మ కథ కవితలో.. ఎనుగంతా పారిన కంచె కాకర తీగకు/ మొదలెక్కడో దొరకనట్టు/ అంతం లేని అమ్మ దుఃఖపు తీగకు/ అదెక్కడో దొరకదు../ అమ్మను ఏడిపిస్తే/ నాన్నయినా నాకు శత్రువే / కాదు కాదు లోకం మీద / ఎవర్ని ఎవడు ఏడిపించినా/ వాడు నాకు శత్రువే! ఇలా విశ్లేషణలకు అందని అనుభూతి ఈ కవిత్వ పుస్తకం నిండా గాయాలకు లేపనం పూసి మరీ శ్రద్ధతో చదివేలా చేస్తుంది. "పొలం నెత్తురు" అంటూ 'ఆత్మను ఆదివాసి'ని చేసి "కలల నిర్మాణ కార్మికుల" కు 'మోదుగు పూల గుండె నిబ్బరం' ను అద్దుతూ ‘ఒకరైతు ఒకనాగలి’లా తన కలంతోనే "ఆకుపచ్చనిదీవెన" నిచ్చిన అద్భుత రచనాశైలికి అంతరంగాన్ని పంచిన కవనమాంత్రికుడు ఈ కవి. ఇలా ఒక్కటి కాదు ప్రతి కవితా వాక్యం పనిగట్టుకుని వచ్చి కండ్లనూ మనసును ఒకటి చేసి పాఠకులను చుట్టుకుంటవి.
మతాల గోడలకు రంగులేయలే! సర్వమతాల సారానికి కవి నిదర్శనమనే భావుకతను భద్రంగా, సున్నితత్వపు పోకడతోనే పాఠకుల గుండెలను తొలుస్తూ బరువెక్కిన భావాలను భోజనంగా పెట్టించగల సమర్థుడు.. తన చిక్కని చెక్కుచెదరని భావాలు ఏ కాలం మనుషులనైనా తన కలల రంగులోకి ఒంపుకుంటాడనడంలో సందేహమే లేదంటూ.. వివరణకు అందని విస్తృతమైనది ఈ పుస్తకం."పంటను కలగన్న విత్తనం" అన్న తన మాటల ఆంతర్యాన్ని గ్రహించడం అంత సులువు కాదు. పుస్తక సంద్రాన్ని ఈదాల్సిందే!
పుస్తకం: కలల రంగు
రచయిత: రహీమొద్దీన్
వెల: 180
ప్రతులకు: 9010851085
పుస్తక సమీక్షకులు
-గన్నోజు ప్రసాద్
94916 17161






