- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాక్యాలు పొడుగు, మాటలు పొదుపు..
నా సాహిత్యం గురించి మాట్లాడటానికి నాకు చాలా సిగ్గుగా వుంటుంది’’ అంటారు ఈ ఏడాది నోబెల్ బహుమతి పొందిన హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నొహోర్కై. రాయడం పూర్తిగా వ్యక్తిగత చర్య అనే 71 ఏళ్ల ఈ నవలాకారుడు

‘‘నా సాహిత్యం గురించి మాట్లాడటానికి నాకు చాలా సిగ్గుగా వుంటుంది’’ అంటారు ఈ ఏడాది నోబెల్ బహుమతి పొందిన హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నొహోర్కై. రాయడం పూర్తిగా వ్యక్తిగత చర్య అనే 71 ఏళ్ల ఈ నవలాకారుడు తన సాహిత్యం గురించి ఎవరైనా అడిగితే, గోప్యమైన వ్యక్తిగత రహస్యాలు అడుగుతున్నట్టే వుంటుందని వ్యాఖ్యానించారు.
విధ్వంసకర ఇతివృత్తాలు, పదునైన వచనంతో పాటు పేజీల కొద్దీ సాగే పదునైన వాక్యాలకు ఆయన సాహిత్యం ప్రసిద్ధమైంది. దోస్తోవిస్కీ, కాఫ్కా, ఫాల్కనర్ వంటి రచయితలకు భిన్నంగా సొంత శైలిని ఏర్పరచుకోవడానికి ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు శక్తివంతమైన, లయబద్ధమైన స్ఫూర్తినిచ్చే ఇతిహాస శైలిని సొంతం చేసుకున్నారు.
తొలి నవలతోనే సంచలనం
1985లో వెలువడిన క్రాస్నోహోర్కై తొలి నవల ‘సాతాన్ టాంగో’ హంగేరి సాహిత్య ప్రపంచంలో సంచలనం సృష్టించింది. కమ్యూనిస్టు వ్యతిరేక భావాలున్న ఆ నవలా ప్రచురణ ఎలా సాధ్యమైందో తనకు గానీ, తన చుట్టూ ఉన్నవారికి గానీ అర్థం కాలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఒక పాడు బడిన సామూహిక వ్యవసాయ క్షేత్రంలో నడిచే ఈ నవల సామాజిక వ్యవస్థలు పతనం కావడం, ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటూ గందరగోళంలో వుండటాన్ని అక్షరీకరించింది.
లాయర్ కావాలనుకున్నా..
బుడాపెస్ట్‌కు 120 కిలో మీటర్ల దూరంలో వున్న చిన్న పట్టణం గ్యూలాలో 1954లో క్రాస్నోహోర్కై జన్మించారు. తండ్రి లాయర్ కాగా, తల్లి సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖలో పని చేసేవారు. కాఫ్కాపై అభిమానంతో తాను కూడా లాయర్ కావాలని, క్రిమినల్ సైకాలజీ చదవాలని అనుకున్నాడు. కానీ, హంగేరియన్ భాషా సాహిత్యాలు చదువుకున్నాడు. పాఠశాల పూర్తయ్యాక మిలటరీలో చేరాడు. కానీ, అక్కడ చేసిన పొరపాట్లకు శిక్షించడంతో పారిపోయి 300 ఆవులు వున్న గోశాలకు నైట్ వాచ్మెన్‌గా కుదిరాడు. ఆ సమయంలో దోస్తోవిస్కీ, మాల్కం లోరీ రచనలు అధ్యయనం చేశాడు. లోరీ ‘అండర్ ద వాల్కనో’ తనకు బైబిల్ లాంటిదని ఆయన చెప్పుకుంటారు.
రచనలు ఇబ్బందికరంగా అనిపించినా..
ఒక రాత్రి సాతన్ టాంగో నవల చదివిన దర్శకుడు బేలా తార్ సినిమా తీస్తానని ముందుకు వచ్చాడు. ఆ నవల నిండా తనకు పేద జనం, దురదృష్టవంతులైన ప్రజలు కనిపించారని, రచయిత వారికి అరుదైన గౌరవాన్ని కల్పించారని ఆయన అన్నారు. అలా మొదలైన వారి ప్రయాణంలో క్రాస్నోహోర్కై రచనలెన్నో తెరకెక్కాయి. అరడజను వరకు స్క్రీన్ ప్లేలు రాశారు. ఆయన పాపులర్ రచన ‘ద మెలంకొలీ ఆఫ్ రెసిస్టెన్స్’ కూడా ‘వెర్క్‌మైస్టర్ హార్మనీస్’ పేరిట 2000 సంవత్సరంలో సినిమాగా రూపొందింది. ఒక సర్కస్ కంపెనీ ఓ బొమ్మ తిమింగలాన్ని తీసుకుని వచ్చిన తర్వాత పట్టణంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ నవల నడుస్తుంది. తన రచనలు అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందాలని ఎప్పుడూ క్రాస్నోహోర్కై పాకులాడలేదు. ఆయన రచనలు కొంత ఇబ్బందికరంగా కనిపించవచ్చు. అయితే, అందుకు కారణం వాటిలో ఎక్కడా విరామం లేకపోవడమేనని ఆయన అభిమానులు చమత్కరిస్తారు. అయినా, ఆయన రచనలకు విదేశాల్లో మంచి ఆదరణ లభించింది. 2015లో మ్యాన్ బుకర్ ప్రైజ్ వరించింది.
కమ్యూనిస్టు పాలనపై వ్యతిరేకత దేనికంటే?
తానెప్పుడూ రాజకీయ నవలలు రాయాలని కోరుకోలేదని, కమ్యూనిస్ట్ పాలనపై తన వ్యతిరేకత రాజకీయమైనది కాదని, అది సమాజానికి వ్యతిరేకంగా ఉందని మాత్రమే చెప్పదల్చుకున్నానని అంటారు. అయితే, నిరంకుశత్వం, మితవాద భావజాలం ప్రబలడంపై ఆయన రచనల్లో విమర్శలు కనిపిస్తూనే ఉంటాయి. హంగేరి నేత విక్టర్ ఓర్బన్, ఆయన పార్టీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అయితే, ‘నోబుల్ బహుమతితో క్రాస్నోహోర్కై దేశానికి గర్వకారణంగా నిలిచార’ని ఓర్బన్ ట్విట్టర్‌లో అభినందించడం విశేషం.
ఒకే ఫుల్‌స్టాప్‌తో 400 పేజీలు..
క్రాస్నోహోర్కై తాజా నవల ‘హెర్స్చెట్ 07769’ గత ఏడాది అమెరికాలో వెలువడింది. యూరప్‌లో ఫాసిజం పడగవిప్పబోతోందని భయాందోళనలు వ్యక్తం చేస్తూ, ప్రపంచానికి పోయేకాలం దాపురించిందని ఛాన్సలర్ ఏంజెలా మార్కల్‌ని అప్రమత్తం చేస్తూ ఒక జర్మన్ గ్రాఫిటీ క్లీనర్ లేఖలు రాయడం ఇందులోని కథాంశం. నాలుగొందల పేజీల ఈ నవలలో కేవలం ఒకేఒక్క ఫుల్‌స్టాప్ వుండటం విశేషం. ఇంత సుదీర్ఘమైన వాక్యాలు రాసే ఈయన మాటల్లో మాత్రం చాలా పొదుపు. శిఖరాయమానమైన నోబెల్ బహుమతి పొందిన తర్వాత ఆయన స్వీడిష్ రేడియోలో మాట్లాడుతూ ‘‘నేను చాలా సంతోషంగా వున్నా. కృతజ్ఞతలు.’’ అంటూ ‘‘భవిష్యత్తులో ఏం జరగబోతోందో నాకు తెలియదు’’ అని ముక్తసరిగా ముగించారు.
-దేశరాజు
99486 80009






