మానవీయ కవిత చిరునామా

by Ravi |   (  Updated:2025-03-10 00:15:32  IST  )

Human poem address vajpayee

మానవీయ కవిత చిరునామా
X

కవిత్వం మనిషిలో ఒడ్డును వొరుసుకున్న నది. అందులోనూ మానవీయ కోణంలో కవిత్వం అరుదైన గొప్ప ప్రక్రియ. ఇక్కడా అక్కడ ప్రవాహ చలనశీలతలే హైలైట్. అలాగే రాజకీయం తప్ప రాజనీతి కన్పించని కాలంలో రాజనీతిజ్ఞతతో దేశాన్ని ముందుకు నడిపించే పాలన అందించడం అరుదైన గొప్ప లక్షణాలే మరి. భారత దేశ ప్రధానిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, గొప్ప వక్తగా, మంచి కవిగా... అంతకు మించిన మానవీయ తాత్వికుడు మహనీయ పాలనా ధురంధరుడు.. వీటన్నింటి సంతుల సమాహార సంహిత... టవరింగ్ పర్సనాలిటీ, హిందీ కవి భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్. భారత రాజకీయ యవనికపై అపర భీష్ముడు అటల్ జీ గొప్ప అజాతశత్రువు.

వాజ్‌పేయి భారత ప్రధానమంత్రిగా, హిందీ కవిగా అద్భుతమైన వాగ్ధాటికి ప్రసిద్ధి చెందిన వక్త. ఆయన కవిత్వం, జాతీయవాద ఉత్సాహం, మానవ విలువలతో మిక్కిలి గుర్తించబడినారు. ఆయన వ్యక్తిగత జీవితం సాధారణంగా గడిచింది. ఆయన బహ్మచారి. ఆయనకు భారతీయ సంగీతం, నాట్యం అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికుడైన ఆయనకి హిమాచల ప్రదేశ్‌లోని మనాలీ ప్రాంతమంటే ఎనలేని ఇష్టం.

వాజ్ పేయ్ కవితలు..

ట్వంటీవన్ పోయంస్ (2003), క్యా ఖోయా క్యా పాయా: అటల్ బిహారీ వాజ్‌పేయి, వ్యక్తిత్వ ఔర్ కవితాయే (హిందీ సంచిక) 1999, మేరీ ఇక్యావన్ కవితాయే 1995, శ్రేష్ట కబిత 1997, నయీ దిశా – జగ్జీత్ సింగ్తో కలిసి సంగీతపు ఆల్బమ్ 1999, సంవేద్నా – జగ్జీత్ సింగ్తో కలిసి సంగీతపు ఆల్బం 2002, ప్రైం మినిస్టర్ అటల్ బిహారీ వాజ్‌పేయి, సెలెక్టెడ్ స్పీచెస్ 2000, అటల్ బిహారీ వాజ్‌పేయి అండ్ పోఖ్రాన్. స్వతహాగా కవి అయిన వాజపేయి తాను వ్రాసిన కవితల గూర్చి ఈ విధంగా చెప్పుకున్నాడు."కవిత్వం ఒక యుద్ధ ప్రకటన, అది ఓటమి నాందీ ప్రస్తావన కాదు. అది ఓడిపోయిన సైనికుడి నిస్పృహ మృదంగనాదం కాదు, కానీ పోరాడే శక్తుల విజయాకాంక్ష. అది నిరాశ గొంతుల నిర్వేదం కాదు కానీ విజయ కేక అంతర్మథనం." అంటారు.

మేధస్సుతో పాటు మనస్సు కలిగిన వ్యక్తి

వాజపేయి వేలాది మంది ముందు, పార్లమెంటులోనూ కవితాత్మకంగా, జనరంజకంగా, పలు విషయాలు ప్రస్తావిస్తూ ప్రసంగించేవాడు. అప్పటికి స్వాతంత్ర్యోద్యమ నేతగా, భారత ప్రధానిగా నెహ్రూ సైతం యువకుడైన, ప్రతిపక్ష నాయకుడు వాజపేయి ప్రసంగాలను శ్రద్ధగా విని ప్రశంసించేవాడు. అటల్ జీ లోని కవిని దేశం సొంతం చేసుకోవడం వల్లనే వ్యక్తిగత ప్రజాసంబంధ వేదికలపై అందరినీ మెప్పించగలిగాడని చెప్పడం అతిశయోక్తి కాదు. కవి గుండె తనను జాగృత పరిచింది కాబోలు.. అందుకే బాధల పొత్తిళ్ళను ప్రజాకాంక్షలనూ మేధస్సు మనస్సు రెండింటితో ఆలోచించగలిగారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం రాసిన నా ఇరువైవొక్క కవితలు చరిత్రలో మిగిలే కవిత్వంగా చెప్పవచ్చు. ఇది చాలా భారతీయ భాషల్లోకి అనువదించబడింది. ఆంగ్లానువాదం పవన్ సి.కుమార్ చేశారు. ఇక ఏమి సంపాదించుకున్నది. ఏమి పోగొట్టుకున్నది కవిత్వం ఇంకా ఎన్నో సంకలనాలు అలా...అలా వాజ్ పాయ్ ఖాతాలోకి వచ్చి చేరాయి. శిఖరం పేరుతో వాజ్ పాయ్ కవిత్వాన్ని జలజం సత్యనారాయణ తెలుగులోకి అనువాదం చేశారు.

వాజ్ పేయీ కవిత్వం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పే రెండు లైన్స్ కవితలో చూడొచ్చు. ఒక టీ.వి ఛానల్ వారు 1996లో మీరు ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన వార్తకు మీ అనుభూతిని కవితలో చెప్పమని కోరిన, తనదైన పద్దతిలో వాజ్ పేయీ స్పందనగా 'హే ప్రభూ /ముఝే ఇత్ నా ఊంచాయియా మత్ దే /జహ సే/జమీకే త్రున్ న దేఖే '/ పోయం రెండర్ చేశారు. ఇది ఒక్కటి చాలు ఆయనలోని మానవీయత, ప్రజా హృదయాలకు దూరంగా ఉండలేని వ్యక్తిత్వంతో చెప్పేందుకు. అలా చరిత్రలో చిరస్థాయిగా ఆయన సేవలు కవితలు ప్రసంగాలు కలకాలం దేశం గుండెలో మార్మోగుతూనే ఉంటుంది.

డా.టి.రాధాకృష్ణమాచార్యులు

98493 05871

Next Story