మాస్టర్ స్టోరీ టెల్లర్ జి. కృష్ణ

by Ravi |   (  Updated:2025-12-01 01:00:30  IST  )

ఎవడన్నా కోపంగా కొడతాడు. లేకపోతే బలంగా కొడతాడు. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడ్రా".. అతడు సినిమాలో హీరో మహేష్ బాబు ఫైట్ సీన్ తర్వాత జరిగే కథాక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తనికెళ్ల భరణి నోట పలికించిన డైలాగ్ ఇది. జి. కృష్ణ రచన ఏది చదివినా వెంటనే ఈ డైలాగ్ నాకు స్ఫురణకు వస్తుంది.

మాస్టర్ స్టోరీ టెల్లర్ జి. కృష్ణ
X

"ఎవడన్నా కోపంగా కొడతాడు. లేకపోతే బలంగా కొడతాడు. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడ్రా".. అతడు సినిమాలో హీరో మహేష్ బాబు ఫైట్ సీన్ తర్వాత జరిగే కథాక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తనికెళ్ల భరణి నోట పలికించిన డైలాగ్ ఇది. జి. కృష్ణ రచన ఏది చదివినా వెంటనే ఈ డైలాగ్ నాకు స్ఫురణకు వస్తుంది. ఆ డైలాగ్‌లోని భావాన్ని అంతఃసారాన్ని కాస్తంత తరచి చూస్తే ఏ పని చేస్తున్నా అందంగా, అలవోకగా, శ్రద్ధగా చేయాలన్న విషయం బోధపడుతుంది.

జి. కృష్ణ రిటైరయ్యాక కూడా వివిధ పత్రికల్లో నిర్విరామంగా రాస్తూ వచ్చారు. రాసుకు బతకండర్రా! అంటూ యువ జర్నలిస్టులకు సలహా ఇచ్చిన ఆయన తన సలహాను తనే పాటిస్తూ ఓపిక ఉన్నంతవరకూ అప్పుడు - ఇప్పుడు, కన్నవీ విన్నవీ వంటి శీర్షికలతో కాలమ్స్ రాశారు. అప్పుడు ఇప్పుడు కాలమ్ ఆంధ్రప్రభ దిన పత్రికలో వెలువడింది. విశేషమేమంటే అంధ్రప్రభకు ఎడిటర్లు ఎందరు మారినా, వారంతా ఈ కాలమ్‌ను కొనసాగించడం.

పాతకు వెలుగు ద్వారాలు తెరిచి..

తీసుకున్న ఇతివృత్తానికి తగ్గట్లు పాఠకుడిలో భావం రగిలించేట్టు రాయడం ఆయన ప్రతి రచనలోనూ కనిపిస్తుంది. కొన్ని ఆవేశాన్ని రాజేస్తే, మరికొన్ని ఆలోచనలో పడేస్తాయి. ఔరా! అని సంభ్రమపరిచేవి కొన్ని. చదవటం పూర్తి చేశాక ముగింపు వాక్యాల నుంచి పాఠకుడి ఆలోచనల తీగను మరింత ముందుకు సాగించేవి మరికొన్ని. చెంప చెళ్లు మనిపిస్తూ మన బోలుతనాన్ని, తింగరితనాన్ని తరిగి పోగులు పెట్టే వాక్య విన్యాసాలు మరికొన్ని. ఆయన పాత విషయాలన్నీ కలబోసుకోవడమెందుకు? అనే సందేహ డోలలో ఎవరైనా పడవచ్చు. కానీ ఆయన కాలమ్స్‌ను తరచి చూసే కొద్దీ, లోతుల్లోకి వెళ్లే కొద్దీ సరికొత్త వెలుగు ద్వారాలు తెరచుకుంటూ వస్తాయి. గతాన్ని, వర్తమానంతో ముడిపెడుతూ అక్షరాల వంతెనలను ఆయన నిర్మించారు.

ఖాళీలను పూరించే ఘనాపాఠి

సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందిన నారేటివ్ పదానికి అసలు సిసలు అర్థాలను జి. కృష్ణ ఆనాడే కల్పించారు. చరిత్ర గతిలో భర్తీ కాకుండా మిగిలిపోయిన ఖాళీలను పూరిస్తూ వచ్చారు. స్త్రీ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం పరితపించి, పలవరించిన చలం, జీవిత చరమాంకంలో రమణాశ్రమానికి వెళ్లటాన్ని జీర్ణించుకోలేని వారనేకమంది. ఈ సందేహలకు ఫుల్ స్టాప్ పెడుతూ జి. కృష్ణ కొత్త చూపునిచ్చారు అక్షరాలలో... అరుణాచలంలో ఆయన 'శైలి' అయనదే - వ్యాసంలో “మానవ ప్రవర్తనా సరళిని ధర్మాలతో, ఆచారాలతో కలవకుండా చూడగలిగాడు చలం. ధర్మాలు, ఆచారాలు కలిసినప్పుడు ఎంత దారుణంగా మానవ నైజం మారుతుందో చెప్పాడు. చలం కుటుంబానికి మతం, కులం లేదు. వాళ్ల ఆధ్యాత్మిక సాధనకు మత, కుల కాలుష్యం లేదు. ఆధ్యాత్మిక సాధనలోనూ చలానిది అవగతం కాని మార్గమే” అని కృష్ణ సూత్రీకరించారు.

తెలియని కోణాల ఆవిష్కర్త..

పక్కన కూచుని కబుర్లు చెప్తున్నట్లు రాయగల నేర్పరి. బంగారు నగలో వజ్రాలను పోదిగేటపుడు స్వర్ణకారుడు చూపే పనితనం, శ్రద్ధ కృష్ణలోనూ ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. మనకు బాగా తెలుసుననుకున్న విషయాల్లో సైతం తెలియని కొత్త కోణాలను ఆవిష్కరిస్తారు. చారిత్రక అంశాలను తవ్వి తీస్తున్నపుడు మంచి చరిత్రకారుడిని కృష్ణలో చూస్తాం. చిత్తూరులో ఆంధ్రప్రభ ఎడిషన్‌లో కృష్ణ రెసిడెంట్ ఎడిటర్‌గా కొంతకాలం పని చేశారు. ఆంధ్రప్రభ కార్యాలయ భవనం కట్టమంచి రామలింగా రెడ్డిది. ఆ భవనం పేరు - పద్మ ప్రభాస. ఈ పేరు కట్టమంచివారి ప్రియురాలి స్మృతి సూచకం అంటారు. ఆయన తమిళ రెడ్డి, ఆమె అయ్యంగారు. ప్రేమకు అడ్డురాని కులం పెళ్లికి అడ్డు వచ్చినందువల్ల, వారిద్దరూ అవివాహితులుగానే ఉండిపోయారు. ఈ వైనాలన్నీ 'కట్టమంచి వారసత్వం’లో కళ్లకు కట్టిస్తారు.

నాకు మీ చదువు రాదండి..

ఈ పాత భవనంలో పూల మొక్కలు, పళ్ళ చెట్లు ఉండేవి. ఒకతను మాలిగా ఉండేవాడు. అతడిని ఆ గుబురు చెట్లలో మకాం వేసిన పాములు చాలాసార్లు కరిచాయి. పాములకు కరవటానికి చాలా అవకాశాలు ఇచ్చాడు. ఇక అవి కరిచినా అతడికి ఏమీ కాదు అన్నట్లు అయింది. ఆ ఆవరణ అతడి సుఖం కోసం ఏర్పడిందే. ఏమిటయ్యా నీ జీవిత రహస్యం అని అడిగారట కృష్ణ. ‘నాకు మీ చదువు రాదండి’ అని మాలి అన్నాడు. ఈ ముగింపు వాక్యం నుంచి పాఠకుడిలో చదువుల సార్థకతపై పలు సందేహాల తేనె తుట్టె కదులుతుంది.

కుక్క పెంచుకుంటే...

మనసులోని మాటను నీళ్లు నమలకుండా చెప్తూ, వ్యంగ్య వైభవాన్ని గుది గుచ్చుతారు. కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలపు ముచ్చటని 'వృత్తిలో సరదాలు' వ్యాసంలో తలపోసుకున్నారు. ‘బ్రహ్మానంద రెడ్డి ఎక్కడికో వెళ్ళి (ఢిల్లీకే) విమానంలో తిరిగి వస్తున్నాడనుకోండి. విమానం వచ్చే వేళకు విలేఖరులంతా ఆయన నివాసానికి చేరుకునేవాళ్లం. అదే సమయంలో ఆయన గారి పెంపుడు అల్సేషియన్ కుక్క వెళ్లి గేటు దగ్గర కూర్చునేది. ఆయన కారుకు ఎదురు వెళ్లి, దాని వెంట ఇంటి వరకు పరుగెత్తుకువచ్చేది' అంటూ కృష్ణ తన కామెంట్‌ని ఇలా జోడిస్తారు.. పలువురు తాము కుక్కను పెంచుతున్నామంటారు. నిజం ఏమంటే, పలువురిని కుక్క పెంచుకుంటున్నట్లుంటుంది.

స్వర్గంలోనూ ఇంగ్లిషే మరి..

జర్నలిజంలో యజమాని బెడద కంటే సాటి ఉద్యోగుల బెడద ఎక్కువని అనుభవపూర్వకంగా తేల్చి చెప్పారు. సహ ఉద్యోగులలోనే శని ఉంటాడు. రాహువు ఉంటాడని కుండబద్దలు కొట్టారు. ఏ కొద్ది అనుభవం ఉన్న జర్నలిస్టుకైనా ఇది తెలిసిందే. తెలుగు భాష పరిస్థితిని ఒక వ్యాసంలో వ్యంగ్యంగా చిత్రీకరించారు. ఒక తెలుగు పండితుడు మరణశయ్యపై ఉన్నాడు. ఆయనను చూసేందుకు కృష్ణ వెళ్లారు. 'జీవిత పర్యంతం తెలుగులో రాస్తూ గడిపాను. నా జీవితం వృథా. కనీసం సంస్కృతంలో రాసి వుంటే స్వర్గలోకంలో నా గురించి తెలిసేది' అని ఆ పండితుడు తెగ బాధ పడ్డాడట. కృష్ణ ఆయను ఊరడించారట. 'ఇప్పుడు స్వర్గంలో కూడా సంస్కృతంలో ఎవరూ మాట్లాడటం లేదు. అక్కడ కూడా ఇంగ్లీషే చలామణిలో ఉంది కనక మీరేమి దిగులు పడకండ'ని కృష్ణ అనునయించారు. ఇదీ కృష్ణ మార్కు వ్యంగ్యం.

జీతం మాసిక దారిద్య్రం..

కృష్ణ చాలా కొత్త పదాలను సృష్టించారు. ఉన్నవాటికి ప్రాచుర్యం కల్పించారు. ఏదీ నా దగ్గర డబ్బు? అనుభవాన్ని బట్టి నా నెల జీతాన్ని ముద్దుముద్దుగా మాసిక దారిద్య్రం అని పిలుచుకోనారంభించాను అంటారు ఒక చోట. గురుశంక, పొగరెట్టు, నిస్పృశ్యం, యథాకామ వద్యుడు, తలకాయ విలేకరి, దగ్ధ యోగి, న్యాయశాస్త్రి, వార్తోత్సాహం వంటి పదాలు సందర్భోచితంగా ప్రయోగిస్తారు. యాభై ఏళ్ల పత్రికా రచన వలన, నాకు నన్ను గురించి కాక, ఇతరులను గురించి ఆలోచించడం అలవాటు అయింది. అందువలన నన్ను గురించి రాయవలసిన సందర్భాలలోనూ, ఇతరులను గురించి కొంత రాస్తుంటాను అని కృష్ణ అంటారు. జి. కృష్ణ వ్యక్తిత్వం, ఆలోచనలు ప్రతి వ్యాసంలో దోబూచులాడుతుంటాయి. మంచి వచనం ఎలా రాయాలో ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు.

పుస్తకం: అప్పుడు - ఇప్పుడు,

రచన : జి. కృష్ణ.

సంకలనం : టి. ఉడయవర్లు

ప్రచురణ : వయోధిక పాత్రికేయ సంఘం

పేజీలు : 222.

వెల : రూ. 300

పుస్తకాలకు: 93947 12208


- గోవిందరాజు చక్రధర్

98498 70250

Next Story