కల్లోలంపై కదలాడే శాంతి స్వరం

by Ravi |   (  Updated:2026-04-13 01:00:30  IST  )

Evaridi Choopu? Book Review

కల్లోలంపై కదలాడే శాంతి స్వరం
X

వ్యక్తిగత అనుభూతులకు మనిషి దాచుకోలేడు.. నలుగురికి నచ్చేలా వాటిని కళారూపం ఇస్తాడు. ఆ కల్పనలో రూపకర్త దాగి ఉంటాడు. తనలో తనకు, సమాజానికి తనకు జరిగే ఘర్షణను అక్షరంగా చెప్పినపుడు కవుల భావోద్వేగాలను సముద్రపు ఆటుపోట్లతో పోల్చవచ్చు. తమ భావాలను వేలెత్తి ప్రశ్నించినట్లుగా చెప్పేవారు కొందరైతే.. భుజం మీద చేయేసి చెప్పేవారు కొందరు. ఈ వరుసలో కవిగా విజయ్ కోగంటి గొంతు ఎప్పుడూ కల్లోలంపై కదలాడే శాంతి స్వరమే..

‘ఎవరిదీ చూపు’ అంటూ వచ్చిన ఆయన కొత్త కవిత్వం తన లో చూపుకు మరింత సాన పట్టినట్టు ఉంది. మనిషి ఆచూకీ పట్టుకొనేందుకు ఒక విశాల దృక్పథపు ఆలోచనాధార అన్ని వైపులా ప్రవహించినట్లు ఈ కవిత్వం నిండా ఒక వెదుకులాట కనబడుతుంది. తనలోని భావుకతకు మానవీయత అంచును సుతారంగా జత చేసి అల్లిన ఈ కవిత్వం విజయ్ తనదైన బాటలో వేసిన మరో ముందడుగు అవుతుంది.

కొత్త ఊహలకు రెక్కలు కట్టి ఎగరేసినట్టుగా..

ఆశావహ దృక్పథంతో కొత్త ఊహలకు రెక్కలు కట్టి ఎగిరేసిన గాలిపటాల్లా ఇందులోని కవితలు గోచరిస్తాయి. ‘ఒక గుప్పెడు రేపటి ఊహలనివ్వు కొత్త ప్రపంచపు నినాదాల బావుటాను చిత్రిస్తా’ అని నిరాశా చీకటికి తారాతోరణంతో అడ్డుకట్ట వేస్తానంటాడు ఈ కవి. ‘వసంతం వెళ్లిపోయింది కోయిల ఎక్కడికో మరలి పోయింది చెట్టు దేనికీ వగచదు’ అని చలిత లక్షణాన్ని ఎలా భరించాలో లోకానికి నేర్పుతాడు. ఇన్ని ఉగాదుల్లో ఏం నేర్చుకున్నావంటే ‘విషాన్ని ముఖాన చిమ్మినా మనసును కడిగి ముగ్గుపెట్టడం నేర్చుకున్నాను’ అని పండుగతో ఒక మాట చెబుతాడు. ‘సంతోషమెందుకు నవ్వుల్లో ఆవిరౌతుంది, దుఃఖమే ఎందుకు గుండెలో గూడుకట్టుకుంటుంది’ ఆనందమంత క్షణికంగా దుఃఖమెందుకు ఉండదని.. మనిషి వేదన భారాన్ని కొలతేస్తాడు. కవి దేవిప్రియను తలుచుకుంటూ ‘రాజీలేని జీవితపు కదనపు సైనికుడా తేనెకవనపు మత్తు మాటల బాటసారీ తుఫాను తుమ్మెదా’ నీవు లేకున్నా ‘నీ కవితా ఖడ్గపు మెరుపులు తళతళలాడుతూనే వున్నై’ అంటాడు.

చెప్పాలనుకున్న విషయంలో బేషజాలు పోకుండా..

విజయ్ కవిత్వంలో సంశయ సందర్భాలు ఎక్కువే.. ‘రాత్రులెందుకు నిజాలై దుఃఖిస్తాయి పగళ్లెందుకు అబద్దాలై నవ్వుతాయి’ అనే చమత్కారంలో మనిషి గుణం బయటపడుతుంది. ‘మసక పట్టిన మనిషి కన్ను కాలపు కంటి రెప్పల మధ్య కునుకు తీయలేక పోతోందెందుకు’ అంటూ మనిషి మసకను గుర్తు చేస్తాడు. 'తృటిలో కత్తివేటుకు తప్పించుకుని పారిపోతున్న వాడిదో అందని వాడిని చూసి నిట్టూర్చిన కత్తిదో’ ఎవరిదీ చూపు అంటూ చూపుల అర్థాన్ని తెలుసుకోమంటాడు. సగటు మనిషి బతుకును వేటతో పోల్చుతూ ‘కేలండర్‌లోని తేదీలను అడవి పొదలను చేసి వాటి మీద ఎడాపెడా ఈడ్చుకెళ్తుంది’ అంటాడు. ‘కొత్తగా ఇంకొన్ని ‘కవిత’ ఎన్నాళ్లీ విరిగిపోతున్న పాత జండాకర్రలను అతుకు పెట్టుకుని తిరుగుదాం’ అని ప్రశ్నిస్తూ ‘ఒక కొత్త లోకాన్ని సృష్టిద్దాం’ మార్పుకు బలమైన ఆకాంక్ష కావాలంటాడు.. విజయ్ కవిత్వంలో ఎక్కడా తొట్రుపడని భావ గాంభీర్యం ఉంది. వాక్య పొందికలో శిల్ప సౌందర్యం ఉంది. భాష, అభివ్యక్తిలో సరళత, సూటిదనం ఉంది. చెప్పాలనుకున్న విషయంలో బేషజాలు పోనీ స్పష్టత ఉంది. సమాజాన్ని తన పరిధిలో గమనిస్తున్న కవిగా విజయ్ కోగంటి తన వంతు పాత్రను ఒక దీక్షగా కొనసాగిస్తున్నాడు. అందుకు అభినందనీయుడు.

పుస్తకం: ఎవరిదీ చూపు (కవిత్వం)

రచయిత: విజయ్ కోగంటి

పేజీలు:164, ధర: రూ . 200-

ప్రచురణ: ప్రచ్చాయ ప్రచురణలు

ప్రతులకు: 83095 96606


సమీక్షకులు

-బద్రి నర్సన్

94401 28169

Next Story