- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదువు, అధ్యయనం..ఒక చరిత్ర!
Education, study...a history!

నిన్న సాయంత్రం మా ఆయన కోసం రొమిల్లా థాపర్ రాసిన Our History, Their History, Whose History, SANJAY JHA రాసిన "THE GREAT UNRAVELLING" వచ్చాయి. ఈ రోజు నాకోసం శరత్ చంద్ర రాసిన పుస్తకాలు మూడు చంద్రనాథ్, పల్లీ సమాజ్, నయావిధాన్ వచ్చాయి. ఇలా పుస్తకాలు తెప్పించుకోవటం వాటిని ఏకబిగిన చదివేయడం భలే ఉంటుంది. చదవటం కోసం పుస్తకాల్ని వంతులు వేసుకోవటం, చదివి వాటిపై చర్చించుకోవటం, కొన్ని వాక్యాలు చదివి వాటిని ఉద్దేశించి రచయిత అప్పటి పరిస్థితిలో ఎంత గొప్పగా రాశారు కదా అని ఉద్వేగంతో మాట్లాడుతూ ఆ వాక్యం మళ్లీ రిపీట్ చేసి చదివి వినిపించటం ఎంతో గొప్ప అనుభూతి.
పుస్తకాలు చదివి ఒకప్పుడు స్టడీ సర్కిల్ చేసేవాళ్లు కేశవ్ తన స్నేహబృందం. అలాంటి సందర్భంలోనే కేశవ్ నాకు పరిచయం అయ్యారు. మా తమ్ముడు వెంకటేష్ ఆ గ్రూప్‌తో పరిచయం చేశాడు. వాళ్ళ డిస్కషన్ విని నేను ఫిదా అయ్యాను. చిన్నప్పటి నుండి అమ్మానాన్నలు పుస్తకాలు చదవడం చూస్తూ పెరిగిన మాకు అదే అలవాటు అయ్యింది. ఈ గ్రూప్‌ని చూసి ఇన్స్పైర్ అయి నేను చదివి పాల్గొనే దాన్ని. అలా ఎన్నో పుస్తకాలు వాటిపై చర్చలు అయ్యేవి. పుస్తకాల లిస్టు రచయితల పేర్లు రాసుకొని, ఒక్కో రచయితను చదివి అప్పటి వరకు వచ్చిన ఆ రచయిత పుస్తకాలు మొత్తం చదివేదాన్ని. అలా రంగనాయకమ్మ పుస్తకాలు, వాసిరెడ్డి సీతాదేవి పుస్తకాలు, చలం ఇలా ఇంకా ఎంతోమంది రచయితలు నవలలు పూర్తి చేసేదాన్ని. చదివిన పుస్తకాలపై చిన్న చిన్న రివ్యూలు రాసుకొనే దాన్ని. పుస్తకాలు చదివిన నేనూ పాజిటివ్ థింకింగ్‌పై ఒకటి రెండు వ్యాసాలు రాశాను. ఆటో రిక్షా అన్న కథ కూడా రాశాను. అదే సందర్భంలో వసుంధర గారి ప్రేమహారం కథపై విమర్శనాత్మక విశ్లేషణ సాహితీ వైద్యం కోసం రాశాను. దానికి రచన పత్రికలో మొదటి బహుమతి ప్రకటించారు. అలా మొదలైంది నా సాహితీ ప్రస్థానం.
కాలక్రమంలో అన్నీ మారిపోయాయి. అందరూ చదువులు పూర్తి చేసి ఉద్యోగ వేటలో పడ్డారు. అన్నీ ఆగిపోయాయి. మాకు అలవాటైన బుక్ రీడింగ్ కాస్త తగ్గింది. మేమూ మా జీవితాల్లో బిజీ అయ్యాము. నేనూ డిగ్రీ తర్వాత మాస్టర్స్ పూర్తి చేశాక మా పుస్తక పఠనం మళ్ళీ ఊపందుకుంది. కొంచెం మా జీవితం పట్టాల పైకి రావడంతో కొంత మంది స్నేహితులం కలసి జాగృతి సమీక్ష బులిటెన్‌గా ప్రారంభించాము. కాలక్రమంలో జాగృతి సమీక్ష త్రైమాసిక పత్రికగా రిజిస్ట్రేషన్ చేసి ప్రస్తుతం పత్రికను కొనసాగిస్తున్నాం. చాలా సమస్యలు ఎదురైనా పత్రిక కొనసాగడానికి ముఖ్యమైన కారణం అధ్యయనం అని చెప్పాల్సిందే. అత్యంత దరిద్రావస్థ నుండి వచ్చిన మా లాంటి వాళ్లకు చదువు అవసరం ఎంతో ఉందని తెలుసు.
ఈ మధ్య ఆయన అప్పటి స్నేహితులతో కలసి మళ్లీ మునుపటిలా పుస్తక పఠనం ప్రారంబిద్దామని , ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులపై యువతకు అవగాహన అందిద్దాం అని ప్రణాళిక వేస్తున్నారు. వాళ్లు అదే ఆలోచనలతో ఉన్నామని చెప్పారు. ఇలాంటి పాత్ర తను ఎప్పుడూ పోషిస్తారు. జీవితంలో ఏ ఆశయం లేకుండా జీవిస్తే మనిషి నిరాశ నిస్పృహతో జీవితాన్ని భారంగా సాగిస్తారు. అదే ఆశయంతో ఏదైనా చేద్దామని ఆలోచనతో తను చేస్తూ ఇతరులు కూడా చేసేలా ప్రోత్సాహ పరిస్తే జీవితానికి గొప్ప సార్ధకత అని మనకి మన అధ్యయనమే నేర్పుతుంది.
- సర్వమంగళ
89616 26848






