మాండలికం కవిత్వానికి శక్తి.. కానీ

by Ravi |   (  Updated:2025-12-08 01:00:14  IST  )

మానవ జీవన గమనంలో మనిషి తనను తాను వ్యక్తీకరించుకునే ప్రయత్నంలో భాగంగా అనేక కళారూపాలని ఆలంబన చేసుకున్నాడు. వాటితో పాటు కవిత్వం కూడా అత్యంత ప్రభావవంతమైన కళారూపంగా దిద్ది తీర్చుకున్నాడు.

మాండలికం కవిత్వానికి శక్తి.. కానీ
X

మానవ జీవన గమనంలో మనిషి తనను తాను వ్యక్తీకరించుకునే ప్రయత్నంలో భాగంగా అనేక కళారూపాలని ఆలంబన చేసుకున్నాడు. వాటితో పాటు కవిత్వం కూడా అత్యంత ప్రభావవంతమైన కళారూపంగా దిద్ది తీర్చుకున్నాడు. ‘భాషలోని స్వరం, దాని రూపం అర్థం కాకముందే మనసును తాకాలి’ అంటాడు కవిత్వాన్ని గురించి టి.ఎస్.ఇలియేట్.

నిజానికి కవిత్వం అనేది కేవలం భాషా రూపమే కాదు, అది భావం, అనుభూతి, లయ, ప్రతీక, అంతర్లీన అర్థాల సమ్మేళనం. ఎప్పుడూ కవితలో భావం సజీవంగా ఉండాలి. అది సంతోషం, విషాదం, కోపం, ప్రేమ ఏదైనా కావచ్చు, అది నేరుగా పాఠకుడి మనసుని తాకాలి. కవితల్లో భావ గాఢత లయ, ఛందస్సు లేదా రిథమ్ పదాలసరళి పాఠకుడి చెవిలో సంగీతంలాగా అనిపించాలి. ఇది ఏ కవితకయినా ప్రత్యేకత ఇస్తుంది.

పదాల వరుసగానే మిగిలే కవిత

కవిత ప్రత్యక్షంగా కాకుండా రూపకాల, ఉపమల, సంకేతాల ద్వారా చెప్పినప్పుడు లోతైన అర్థం పొందుతుంది. అంతే తప్ప కేవలం ఒక ప్రాంత మాండలిక పదాల్ని పొందుపర్చినంత మాత్రాన అది గొప్ప కవిత్వమై పోదు. సాధారణ విషయాన్ని అసాధారణంగా చూపించే కొత్త కోణం మాండలికం లేదా ప్రామాణిక భాష ఏదైనా కావచ్చు, కానీ పదాల ఎంపిక, వాటి అమరికలో కవిత్వపు శిల్పం ఉండాలి. అందులో కవి గుండె నిండా ఎగిసి వచ్చిన అనుభవం ధ్వనించకపోతే ఆ పదాలు ఖాళీ గుత్తుల్లా ఉంటాయి. నిజానికి కవిత్వం భావానికి రూపం ఇచ్చే కళ. ఆ కళా రూపాన్ని తీర్చిదిద్దేది భాష. కవి హృదయంలో పుట్టిన అనుభూతి, పాఠకుడి హృదయానికి చేరే వరకు భాషే వంతెన. అందుకే కవిత్వంలో భాషకున్న ప్రాధాన్యం అపారమైనది. భాష లేకుండా కవిత్వం ఉండదు అది నిజం. కానీ కవిత్వానికి తగిన భాష లేకపోతే అది కేవలం పదాల వరుసగానే మిగిలిపోతుంది. కవి ఎంచుకున్న భాష భావాన్ని సజీవంగా, ప్రాణంగా మార్చగలిగితేనే ఆ కవిత పాఠకుడి హృదయంలో నిలిచిపోతుంది.

మాండలికానికి మహదవకాశం..

ఇటీవలి దశాబ్దాల్లో తెలుగు కవిత్వంలో మాండలిక భాష వినియోగం పెరిగింది. అది చాలా గొప్ప పరిణామం. ముఖ్యంగా తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుడికారాలు ఆధునిక కవిత్వానికి కొత్త స్వరాన్ని సరికొత్త శ్వాసను ఇచ్చాయి. ఏ ప్రాంత మాండలికమైన కవిత్వానికి భూమి వాసనను, సహజమైన రూపాన్ని, జీవన స్వరాన్ని తెస్తుందన్నది నిజం. కానీ కేవలం మాండలికం ఉండటంవల్ల మాత్రమే కవిత్వం గొప్పది కాదు. అందులో కవితాత్మక వ్యక్తీకరణ మనసుకు హత్తుకునే శైలి లేకుంటే అది వ్యాసమో వార్తో అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప కవులుగా పేరు పొందిన పాబ్లో నెరూడా, విట్మన్, లోర్కా లాంటి ఎందరో కవులు తమ ప్రాంతీయ భాషా స్వరాలతో గొప్ప కవిత్వాన్ని సృష్టించారు. అయితే వారి గొప్పదనం వారి ప్రాంతీయ పదాల్లోనిదే కాదు ఆ పదాలు ప్రపంచ పాఠకుల మనసుల్లోకి చేరి వారిలో కలిగిన సొంత అనుభవం లా రూపాంతరం చెందిన విధానంలో ఉంది. అంతెందుకు తెలంగాణా కవి కాళోజీ కూడా మాండలికాన్ని ప్రపంచ అనుభవంలోకి తీసుకెళ్లినవాడు. ఆయన తెలంగాణా మాట మాట్లాడాడు కానీ ఆ మాటను ప్రపంచమంతా వినగలిగేలా అర్థం చేసుకునేలా మలిచాడు. ఆయన చెప్పిన, చెప్పదలుచుకున్న విషయం సార్వత్రిక మయింది. దాంతో కాళోజీ కవిత్వ భాష సజీవమయింది.

కవిత్వానికి సాధనమే.. కారణం కాదు

‘Dialect is an identity marker, nota literary scale’ అని భాషావేత్తలు అభిప్రాయపడతారు. మాండలికం గుర్తింపు నిస్తుంది. కానీ గుణాత్మకతను కాదు. అది కవులు గమనించాలి. ఒక రకంగా చెప్పుకుంటే కవిత్వ గొప్పదనం కవి దృష్టిలోనూ ఆతని పరిణతిలోనూ భావ పారదర్శకతలోనూ, శిల్ప ఖచ్చితత్వంలోనూ ఉంటుంది. ఒక కవిత గొప్పది కావడానికి కేవలం మాండలికం మాత్రమే సరిపోదు. ఎందుకంటే మాండలికంలో ఉన్న ప్రధాన శక్తి దాని శబ్దం, కానీ కేవలం శబ్దం కవిత్వం కాదు, కానేరదు, మాండలికంలో సహజత్వం ఉంటుంది కానీ కవిత్వానికి శిల్పం, లాలిత్యం కూడా కావాలి. మాండలికం ఒక ప్రాంతీయ అనుభవమే కాని కవిత్వం ప్రాంతాల్ని దాటి విశాల ప్రపంచ పాఠకుణ్ణి తాకాలి. మాండలికం గొప్ప కవిత్వానికి సాధనమే కాని కారణం కాదు. మన తెలుగులో కూడా ప్రాంతానికో భాష జిల్లాకో యాస వున్నాయి. వాటిల్లోని పదాలు కవిత్వంలో ఉపయోగించాల్సిందే. కానీ కవితలో భావం, ఆర్ద్రత, ఆలోచన స్పందన లేకుంటే ఆ కవిత పదాల కూర్పే అవుతుంది. అందుకే కవిత్వంలో భాష కవి చెప్పిన భావాన్ని పాఠకుడికి చేర్చే వంతెన. పాఠకుడిలో కవి భావం ఎంతమేరకు నిలిచిపోతున్నదన్నదే ఆ కవి సాధించే విజయం. ఆ కవితకు ఒనగూడే సార్థకత.

-వారాల ఆనంద్

94405 01281

Next Story