- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మట్టి తిన్న రోజులు.. ఈ పుస్తకం నేర్పిన పాఠం
Cheppulu Kuduthu Kuduthu Book Review

వందేళ్లు బ్రతికిన మా నాయనమ్మ కొన్నేళ్ల క్రితం చనిపోయింది. మేమందరం చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని కూర్చోపెట్టుకుని చాలా ముచ్చట్లు చెప్పేది. ఆ ముసలమ్మ చెప్పే ముచ్చట్లు బలే ఆసక్తిగా ఉండేవి. ముచ్చట్లతో పాటు అప్పుడప్పుడూ వాళ్ళ చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చుకునేది. " మీరిప్పుడు కమ్మగా తింటున్నారు కానీ, ఆ రోజుల్లో కడుపు నింపుకోవడానికి ఎంత కష్ట పడే వాళ్ళో తెలుసా.." అంటూ తడి ఆరిన ఆమె కళ్లతో గతాన్ని గుర్తు చేసుకునేది." ఓ పూట తినాలంటే రోజంతా కష్ట పడాలి. బతకాలంటే రోజూ పోరాటమే. మా అయ్యల, తాతయ్యల కాలంలో గొప్ప కరువు వచ్చిందంట. అప్పట్లో తిండి లేక చచ్చిన శవాలు పొలిమేరల్లో గుట్టలు గుట్టలుగా ఉండేవట. ఆకలికి తట్టుకోలేక ఆ కరువు రోజుల్లో మట్టి కూడా తిన్నారట..." ముసలామె చెబుతుంటే ఆమె గాజు కళ్ళలో గతం తాలూకు భయం కనిపించేది.
ఇంత కరువు ఎలా వచ్చింది?
తినడానికి ఇంత కష్ట పడ్డారా? చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అసలు ఆ కరువు ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో కలిగింది. కొన్ని చరిత్ర పుస్తకాలు తిరగేస్తూ ఉండగా నేను వెతుకుతున్న, నాకు కావాల్సిన సమాచారం ఓ పుస్తకంలో కనిపించింది.
చెప్పులు కుడుతూ కుడుతూ..
1890కి ముందు ఒంగోలు కేంద్రంగా నడిచిన మిషనరీలో జాన్ ఇ క్లౌ పనిచేశారు. అతని భార్య ఎమ్మా రోషాంబు క్లౌ. ఆమె గొప్ప పరిశోధకురాలు. ఆ రోజుల్లో ఒంగోలు ప్రాంతంలోని మాదిగలతో ఆమె కలిసి జీవించారు. మాదిగల జీవితాన్ని అతి దగ్గరగా చూసారు. వారితో స్నేహం చేశారు. వారి గాథలు విన్నారు. ఆ చారిత్రక అంశాలన్నిటిని ఆమె పుస్తక రూపంలో భద్రపరిచారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత, అనువాదకులు వివిన మూర్తి తెలుగు అనువాదం చేశారు. ఆ పుస్తకం పేరే.. " చెప్పులు కుడుతూ కుడుతూ.." అత్యంత విలువైన మాదిగల గాధలు, నాటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, చారిత్రక అంశాలను వివిన మూర్తి ఈ పుస్తకం ద్వారా భద్రంగా తెలుగు ప్రజలకు అందించారు.
ఎటుచూసినా శవాల గుట్టలు..
నేను తెలుసుకోవాలనుకుంటున్న నాటి కరువు పరిస్థితులను ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు రాశారు. ఒక గొప్ప సంక్షోభం అంటూ 1876- 78 మధ్య సంభవించిన కరువు పరిస్థితులను రచయిత ప్రస్తావించారు. ఈ కరువు పరిస్థితులను చదివినప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది. బ్రిటిష్ కాలంలో సంభవించిన అతి పెద్ద కరువు ఇది. దక్షిణ భారత దేశం అంతటా తీవ్ర విషాదాన్ని నింపిన రోజులవి. ఈ కరువును ' మద్రాసు కరువు ' అని కూడా అంటారు. ఆకలి దప్పులతో అలమటించి అల్లాడిన ఈ కాలంలో ఎందరు చనిపోయి ఉంటారో లెక్కకు అందని విషయం. ఎటు చూసినా శవాల గుట్టలు. రోడ్ల మీద పడి చనిపోయిన వారి ఎముకలు రోడ్లకి అటూ ఇటూ ఉండేవి. "మేమందరం చచ్చిపోతున్నాం..." అన్నది అప్పటి జనాల చివరి మాటగా ఉండేది.
మనుషుల్ని పీక్కు తిన్న రోజులు..
ఇంతటి ఘోరమైన కరువు కన్నా ముందు మరొక కరువు వచ్చిందట. 1832 - 33లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో అత్యంత ఘోరమైన కరువు సంభవించింది. ఈ కరువును గుంటూరు కరువు, డొక్కల కరువుగా పిలిచారు. క్లౌ రాసిన పుస్తకంలో గుంటూరు కరువు ప్రస్తావన ఉంది. "ముసలి వాళ్లు ఒక కరువుని గుర్తు చేసుకునే వారు. బహుశా అందులో అసాధారణమైన భయానక దృశ్యాలు ఉండి ఉండవచ్చు. ఈ కరువులో మనుషులు మనుషులను తినేవారు అని అందరూ అనేవారు. నా కది నమ్మబుద్ధి అయ్యేది కాదు " అంటూ క్లౌ చెప్పారు. ఈ కరువు ప్రభావం ఇరవై సంవత్సరాల వరకు కొనసాగిందని చెబుతారు. ఇలాంటి దుర్భరమైన కరువుల గురించి చదివిన తర్వాత మనం ఇప్పుడు ఎంత సుఖంగా ఉన్నాం, ఎంత హాయిగా తింటున్నాం అనిపించింది.
మట్టి కూడా తిని బతికిన రోజులు..
1832లో గుంటూరు కరువులో మనుషుల్ని మనుషులే తిన్నారేమో అన్నంత ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 1878లో ఆకులు, అలములు, చివరికి మట్టి కూడా తిని జనాలు బతికారు. 1920లో మా నాయనమ్మ కాలంలో ఒక పూట తినటానికి రోజంతా కష్టపడ్డారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాల్లో 11.30 కోట్ల మంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. పుస్తకం మన ఆలోచనలనూ, అభిప్రాయాలనూ, ప్రవర్తననూ మార్చి వేయగల శక్తి వంతమైనదని చదివాను. కానీ నా విషయంలో నిజమైంది. చెప్పులు కుడుతూ కుడుతూ పుస్తకం నాలోనూ గొప్ప మార్పు తీసుకువచ్చింది. ఈ పుస్తకం చదివిన తర్వాత నాటి కరువు పరిస్థితులను తెలుసుకున్న తరువాత నామటుకు నేను ఆహార వృధాను అరికట్టాలన్న అభిప్రాయానికి వచ్చాను. ఆ తరువాత నేనెప్పుడూ భోజనంలో ఒక్క మెతుకూ మిగల్చలేదు. మితాహారం ఆరోగ్యానికి మంచిదే అన్న భావనకు వచ్చాను.
(ఎమ్మా రోషాంబు క్లౌ రాసి, తెలుగులో వివిన మూర్తి అనువదించిన 'చెప్పులు కుడుతూ కుడుతూ' పుస్తకం ఆధారంగా..)
పుస్తకం: చెప్పులు కుడుతూ కుడుతూ
ఇంగ్లీషు మూలం: ఎమ్మా రోషాంబు క్లౌ
తెలుగు అనువాదం : వివినమూర్తి
పేజీలు : 144
ధర : 150
ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్లైన్ స్టోర్
సమీక్షకులు
శిఖా సునీల్ కుమార్
99081 93534






