- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస వేదనని ఒడిసి పట్టిన అక్షరం..
కవిత్వం కాకతాళీయంగా వచ్చి చేరేది కాదు, వారసత్వపు ఆస్తిలా కూడా వరించదు. కాలక్షేపం కోసమో, కీర్తి కండూతి కోసమో అంటించుకునేది కాదు.. సున్నిత స్వభావం, సునిశిత పరిశీలన, సృజనాత్మకత తోడైతే తప్ప కవిత్వం మన దరికి రాదు.

కవిత్వం కాకతాళీయంగా వచ్చి చేరేది కాదు, వారసత్వపు ఆస్తిలా కూడా వరించదు. కాలక్షేపం కోసమో, కీర్తి కండూతి కోసమో అంటించుకునేది కాదు.. సున్నిత స్వభావం, సునిశిత పరిశీలన, సృజనాత్మకత తోడైతే తప్ప కవిత్వం మన దరికి రాదు. ఆ లక్షణాలను పుణికి పుచ్చుకున్న యువకవి జాబేర్ పాషా తన తొలి కవితా సంపుటి ‘అగరు ధూపం ఊదుపొగ’ని ఇటీవలే ఆవిష్కరించాడు. పేరుకు తగ్గట్టే ఈ సంపుటిలోని కవితలు భిన్న మతాల మధ్య ఒదిగిన స్నేహాన్ని, ఆత్మీయతను చాటేవి. మానవీయతను చాటి చెప్పే కవితా సంపుటి 'అగరు ధూపం ఊదు పొగ'.
పరస్పర ఆత్మీయతే సమస్యలకు విరుగుడు..
ఈ ధూప పరిమళం నిండా ఒక్క వలస వేదనే కాదు రాజ్యం పోకడ, రైతు నిర్వేదం ,సర్కార్ బడి, పల్లె యాది, శిథిలమైన ఇల్లు, యుద్ధం ముగిసిన తర్వాత, ప్రేమలోతు, దోస్త్ ముచ్చట, నాన్న పద్యం, అమ్మీ జాన్, ఇఫ్తార్ ఘుమఘుమలు ఇలా తనను కదిలించిన అన్నిటినీ ఒడుపుగా పట్టుకొని పద్యం చేశాడు. యాభై ఐదు కవితా వస్తువులున్న ఈ గ్రంథం బరువైనదే. ఓ కవితలో "ఊరంటే../ ఉగాది పచ్చడి /ఈద్ సేమియాలు కలబోత/ మట్టి మనుషుల మోముల్లో/ వికసించిన నవ్వుల పూత అంటాడు. ఇంకో కవితలో ‘ఇదిగో నీకిష్టమనీ/పెద్దగుట్ట పీర్ల మలీద తెచ్చిన/ ఎప్పటిలాగే/ ఎల్లమ్మ పండుక్కి/ ఇస్తారాకేసి చెయ్యి కడిగిస్తవ్ కదూ’ ఇలా పరస్పర ఆత్మీయతే అన్ని సమస్యలకు విరుగుడు అంటాడు జాబేర్. దీంట్లోని 'అమ్మీజాన్' హృద్యంగా సాగిన కవిత. అప్పటి కాలాన్ని, వలస వేదనని, ఒంటి చేత్తో ఇంటిని చక్కదిద్దుతున్న అమ్మ అవస్థలని కళ్ళ ముందుకు దించుతుంది..! నిజమే కవిత్వం కన్నీళ్లను తెప్పిస్తుంది, తప్పిస్తుంది' అన్నట్లుగా ఉంది. 'యాది' కవితలో "మోయతుమ్మెద వాగులో మునకేసిన తడారని జ్ఞాపకం కళ్ళనుండి బొట్టు బొట్టుగా కారుతుంది" అంటూ ఊరిని, ఊరి జ్ఞాపకాలను పలవరిస్తుంటాడు.
వలస కూలి శ్వాస లాగా..
ఈ కవి ఎక్కువగా మెటాఫర్‌లను ఉపయోగించే సరళ శైలిలో కవిత్వాన్ని మలుస్తాడు, అది ఇట్టే పాఠకులను ఆకట్టుకునే కవితా లక్షణం. జాబేర్ పాషా కవిత్వం కేవలం వ్యక్తిగత అనుభూతుల భాష్యం కాదు, అది సమాజపు గాఢమైన దుఃఖ చిహ్నాల ప్రదర్శన. ఇతని పదాల్లో అలంకారాల కన్నా అనుభవాలు ఎక్కువ, వ్యాకరణం కన్నా వేదన ఎక్కువ. ప్రతి కవితా పంక్తి ఒక వలస కూలి శ్వాస లాగా ఒక తల్లి ఆవేదన లాగా తోస్తుంది. ఇది చలించబడిన హృదయం నుంచి వచ్చింది కాబట్టి మనలో చలనం కలిగిస్తుంది. ఇక 'వలస శవం' గురించి ఓ కవితలో 'లోహ విహంగమై ఎగిరినవాడు ఇనుప పెట్టెలో ఇంటి ముందు వాలాడు' అన్నప్పుడు మన కళ్ల నుండి రెండు అశ్రుబిందువులు టపటపా రాలిపడతాయి. ఆ కలంలో నింపింది సిరానా లేక కన్నీళ్లా అనిపించక మానదు. యాభై ఐదు కవితా వస్తువులున్న ఈ గ్రంథం బరువైనదే.
పుస్తకం: అగరు ధూపం ఊదు పొగ
రచయిత: జాబేర్ పాషా
పేజీలు: 166, వెల : రూ.180
ప్రచురణ: కవి సంగమం
ప్రతులకు: నవోదయ, న్యూ విశాలాంధ్ర బుక్ హౌస్
సమీక్షకురాలు
-నాంపల్లి సుజాత అన్నవరం
98480 59893






