విశ్వ పరిణామం... కాలం మహాప్రస్థానం!

by Ravi |   (  Updated:2026-04-13 01:16:02  IST  )

ఎప్పుడూ మీ పాదాల వైపు కాదు, నక్షత్రాల వైపు చూడడం గుర్తుంచుకోండి. మీరు చూసే దానికి ఒక అర్థాన్ని వెతుకుతూ, విశ్వ పరిణామ క్రమంపై ఎల్లప్పుడూ కుతూహలంగానే ఉండండి. ఈ విశ్వం ఎంత పెద్దదైనా కావచ్చు.. కానీ నీ ప్రయత్నం ముందు చాలా చిన్నదనే విషయాన్ని మరువకండి..!’

విశ్వ పరిణామం... కాలం మహాప్రస్థానం!
X

‘ఎప్పుడూ మీ పాదాల వైపు కాదు, నక్షత్రాల వైపు చూడడం గుర్తుంచుకోండి. మీరు చూసే దానికి ఒక అర్థాన్ని వెతుకుతూ, విశ్వ పరిణామ క్రమంపై ఎల్లప్పుడూ కుతూహలంగానే ఉండండి. ఈ విశ్వం ఎంత పెద్దదైనా కావచ్చు.. కానీ నీ ప్రయత్నం ముందు చాలా చిన్నదనే విషయాన్ని మరువకండి..!’

ఈ స్ఫూర్తివంతమైన మాటల్లో మనిషి జీవితం తాలూకు ధృడమైన సంకల్పం, బలమైన ఆత్మవిశ్వాసపు తాత్విక సందేశం దాగి ఉన్నాయి.

కాలం ఆటలో విధినే ఓడించి..

సరిగ్గా గెలీలియో మరణించిన 300 సంవత్సరాల తర్వాత 1942 జనవరి 8న ఉదయించారు స్టీఫెన్ హాకింగ్. పుట్టుకతోనే అద్భుతమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన హాకింగ్.. గణితశాస్త్రంలో అసాధారణ మేధస్సు కలిగి వుండేవారు. దాని ఆధారంగా భౌతిక శాస్త్రంలో బలమైన పట్టు సాధించి.. న్యూటన్, ఐన్ స్టీన్ స్థాయిగల విఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. కాలం ఆటలో..విధినే ఓడించిన ఆయన జీవితం.. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచానికి స్ఫూర్తినందిస్తూనే ఉంది. 21 ఏళ్ల వయసులోనే నాడీ మండలానికి సంబంధించిన వ్యాధి వల్ల శరీరం చాలా వరకు చచ్చుబడిపోయినా... ఒకే ఒక దవడ ఎముక కదిలిస్తూ, దానికి అమర్చిన సంభాషణలు ఉత్పత్తి చేసే పరికరం ఉపయోగించి.. విశ్వ రహస్యాలను మనతో చర్చించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని అందమైన పుస్తకాలుగా అందించారు..!

కార్ల్ శాగన్ అద్భుత ముందుమాట..

ప్రపంచవ్యాప్తంగా.. పాఠశాల విద్యార్థుల దగ్గర్నుంచి.. ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల దాకా...! అందరూ మెచ్చుకున్న.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన బెస్ట్ సెల్లర్ పుస్తకమే..‘A BRIEF HISTORY OF TIME.. From the Big Bang to Black Holes’. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన CARL SAGAN... పాఠకులకు విశ్వ రహస్యాలపై ఆసక్తిని పెంచడమే కాక స్టీఫెన్ హాకింగ్ జీవన పోరాటాన్ని స్ఫూర్తివంతమైన జీవిత చిత్రంగా ఆవిష్కరించారు..! 1988 సంవత్సరంలో విడుదలైన ఈ పుస్తకం కాపీలు నేటికీ కోట్ల సంఖ్యలో అమ్ముడుపోయాయి. దాదాపు 40 పైగా ప్రపంచ భాషల్లో ఈ పుస్తకాన్ని అనువదించారు. తెలుగులో ‘కాలం కథ’ పేరుతో పీకాక్ క్లాసిక్స్ సంస్థ ప్రచురించింది. ఈ పుస్తకం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు..!. ఈ పుస్తకం ఆధారంగా నిర్మించిన సినిమా..."ది థియరీ ఆఫ్ ఎవ్రిథింగ్" (The Theory Of Everything) అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది.

ఈ పుస్తకం వెలకట్టలేని జ్ఞాన సంపద

కొన్ని దశాబ్దాలుగా ఇంతలా ప్రభావితం చేస్తున్న ఈ పుస్తకాన్ని సామాన్యులకు కూడా విశ్వ పరిణామ క్రమంలో సైన్స్ గురించి సులభంగా అర్థమయ్యే రీతిలో హాకింగ్ రచించారు.. విశ్వావిర్భావం మొదలు జనరల్ రిలేటివిటీ వరకు భౌతిక శాస్త్రం గురించి బహు రకాల ఆసక్తి శాస్త్రంగా వివరించారు. అందుకే ఈ పుస్తకం ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఓ వెలకట్టలేని జ్ఞాన సంపద..! ఇలాంటి పుస్తకాలు విద్యార్థులు చదవడం వల్ల ఫిజిక్స్‌ను చాలా సులభమైన శాస్త్రంగా అర్థం చేసుకొని, ఎదగడానికి అవకాశం ఉంటుంది. విశ్వం, కాలం, బిగ్ బ్యాంగ్, బ్లాక్ హోల్స్, క్వాంటం గ్రావిటీ, డార్క్ మేటర్, డార్క్ ఎనర్జీ వంటి ఎన్నో శాస్త్రీయ పదాలకు ఇందులో సులువైన వివరణలు ఉన్నాయి. పాఠకులు ఇబ్బంది పడతారనుకొని ఎలాంటి శాస్త్రీయ సమీకరణాలు లేకుండా రాయబడిన పుస్తకం ఇది...! అయినప్పటికీ... విశ్వ మేధావి ఐన్ స్టీన్ ప్రఖ్యాత సమీకరణం E=mc^2 ను ఈ పుస్తకంలో ఉంచక తప్పలేదు..!

స్థలకాలాల సమగ్ర దర్శనం

కాలానికి ఆరంభం ఎక్కడ ఉంది? కాలం ముందుకే వెళ్తుందా, వెనకకు వెళ్లడానికి అవకాశం ఏమైనా ఉందా..? విశ్వానికి హద్దులు, సరిహద్దులు ఏమైనా ఉన్నాయా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నల అన్వేషణలో న్యూటన్ నుంచి ఐన్ స్టీన్ వరకు ‘స్పేస్ అండ్ టైం’ గురించి ఈ పుస్తకం మనతో కూలంకషంగా చర్చిస్తుంది. విశ్వం గురించి మన ఆలోచనా చిత్రం, స్థలం-కాలం, విశ్వ విస్తరణ, అనిశ్చితత్వ సూత్రం, ప్రాథమిక కణాలు, ప్రాథమిక బలాలు, బ్లాక్ హోల్స్ ,విశ్వం యొక్క హద్దు, యునిఫికేషన్ ఆఫ్ ఫిజిక్స్... ఇలా.. ఎన్నో టాపిక్స్‌ను ఆసక్తికరంగా పాఠకులకు చెప్పిన విధానంలో హాకింగ్ అసాధారణ మేధా సంపత్తిని మనం ప్రశంసించక తప్పదు. కాంతి వేగంతో ప్రయాణించే వస్తువులను సైతం మింగగల బ్లాక్ హోల్స్ గురించి హాకింగ్ వర్ణించిన తీరు అద్భుతం. న్యూటన్, ఐన్ స్టీన్‌ల మధ్య గురుత్వాకర్షణ భావనకు సంబంధించిన సారూప్యత, వైవిధ్యతలు మనల్ని ఆలోచన సంద్రంలో మునిగేలా చేస్తాయి. గెలాక్సీలు, క్వాంటం సిద్ధాంతం, డాప్లర్ ప్రభావం, నక్షత్రాల జీవన పరిణామ క్రమం, చంద్రశేఖర్ పరిమితి వంటి వివరణలతో... మన దేశ ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ కూడా మనల్ని పలకరిస్తారు.

దేవుడి మనసు తెలుసుకోగలమా?

ఓ సందర్భంలో... "God doesn't play dice" (దేవుడు పాచికలు ఆడడు) అనే ఐన్ స్టీన్ ప్రఖ్యాత స్టేట్మెంట్ కూడా మనకు దర్శనమిస్తోంది..! ఫిజిక్స్‌తో ఫిలాసఫీని మేళవించి ఈ విశ్వావిర్భావం, పరిణామం, ప్రభావం, చలనంకు సంబంధించిన ‘కంప్లీట్ థియరీ’ గురించి కూడా ఈ పుస్తకంలో చర్చ జరిగింది. 'అయితే, ఒకవేళ మనం ఒక సంపూర్ణ సిద్ధాంతాన్ని కనుగొన్నట్లయితే, అది కేవలం కొద్దిమంది శాస్త్రవేత్తలకు మాత్రమే కాకుండా, కాలక్రమేణా ప్రతి ఒక్కరికీ దాని మౌలిక సూత్రాల పరంగా అర్థమయ్యేలా ఉండాలి. అప్పుడు మనమందరం.. తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, సామాన్య ప్రజలు అందరం.. మనమూ, ఈ విశ్వం అసలు ఎందుకు ఉనికిలో ఉన్నాయనే ప్రశ్నకు సంబంధించిన చర్చలో పాలుపంచుకోగలుగుతాం. ఆ ప్రశ్నకు మీరు సమాధానం కనుగొన్నట్లయితే, అది మానవ వివేకానికి లభించే అత్యున్నత విజయం అవుతుంది. ఎందుకంటే, ఆ క్షణాన మనం 'దేవుని మనసు'ను తెలుసుకున్నట్లవుతుంది' అంటూ ఈ విశ్వాన్ని నడిపించడంలో.. దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడు అనే అన్వేషణలోనే ఈ పుస్తకం ముగించబడింది. ఏదేమైనా ఒకే ఒక పుస్తకంతో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అనంత విశ్వాన్ని ఆవిష్కరించడం... కేవలం స్టీఫెన్ హాకింగ్‌కే సాధ్యమైంది.

ముగిసిన ప్రేరణాత్మక ప్రయాణం

'కాలం కథ'నే పుస్తకంగా రాసిన హాకింగ్ జీవితం ఎన్నో ట్విస్టులతో.. ప్రేరణాత్మక ప్రయాణంగా... 2018 మార్చి 14న అస్తమించింది. కానీ ఆయన ఆలోచనల ప్రవాహం, ఉపన్యాసాల ప్రభావం.. ఇప్పటికీ కొన్ని కోట్ల మందికి ప్రేరణనిస్తూనే ఉంది.. ఇస్తూనే ఉంటుంది..! ఎలాంటి టెలిస్కోప్ ఉపయోగించకుండా... తన శాస్త్రీయ మనోనేత్రంతో విశ్వం ముఖచిత్రాన్ని మన ముందు సాక్షాత్కరింప చేసిన ఆయన జీనియస్ మేధస్సుకు.. అమెరికా అత్యున్నత పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’తో పాటు.. యావత్ ప్రపంచం సెల్యూట్ చేస్తోంది. విశ్వశాంతిని కాంక్షిస్తూ, అణ్వస్త్ర రహిత ప్రపంచం కోసం కలలు కన్నారు హాకింగ్. "జార్జెస్ సీక్రెట్ కీ టు ది యూనివర్స్", "బ్రీఫ్ ఆన్సర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్" వంటి పుస్తకాలను పిల్లల అంతరిక్ష కలల కోసం హాకింగ్ అందించారు.

"నా అంచనా ప్రకారం మానవాళి మరో వెయ్యేళ్లకు మించి మనుగడ సాగించలేదు. కృత్రిమ మేధస్సు,వాతావరణ మార్పులు, ఇతర వైపరీత్యాలు మన అంతానికి కారణమవుతాయి. మనం జాగ్రత్త వహించకపోతే మరో వందేళ్లలోనే ఇలా జరగొచ్చు." హాకింగ్ మాటలతో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. వీలైతే వెంటనే స్టీఫెన్ హాకింగ్ పుస్తకాలను మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం పదండి..!

పుస్తకం: A BRIEF HISTORY OF TIME (ఇంగ్లిష్)

రచయిత: స్టీఫెన్ హాకింగ్

పేజీలు: 220; వెల: రూ. 499

ప్రచురణ: Bantam press edition

లభ్యం: ఆన్ లైన్

సమీక్షకులు

-ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Next Story