పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్న వాళ్లు.. ఆపేదెవరు..?

by  |
పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్న వాళ్లు.. ఆపేదెవరు..?
X

దిశ, నల్లబెల్లి: నియోజకవర్గంలోని మండలాల్లో మద్యం మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఊరూరా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాప్ లు ప్రజల్ని ఆర్ధికంగా దెబ్బతీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో మద్యం భూతం చిచ్చు పెడుతోంది. నల్లబెల్లి మండల వ్యాప్తంగా ఉన్న బెల్ట్ దుకాణాల ద్వారా ఎంతోమంది మద్యానికి బానిసై తమ జీవితాల్ని మధ్యలోనే ముగిస్తున్నారు.

గ్రామగ్రామాన బెల్ట్ షాప్ లే..

నల్లబెల్లి మండలంలో మొత్తం 29 గ్రామాలున్నాయి. వీటిలో ఒక్కో గ్రామానికి సుమారుగా 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయి. పొద్దంతా కూలీ పని చేసిన పేదలు సాయంత్రం అయ్యేసరికి బెల్ట్ షాప్ కు వెళ్లకుండా ఇంటికి వెళ్లే పరిస్థితి దాదాపుగా కనపడదు. సంపాదించిన సొమ్మంతా బెల్ట్ షాప్ లకు ఖర్చు చేస్తుండటంతో కుటుంబాల్లో గొడవలు మొదలై, నేరాలకు కారణమవుతున్నాయి. మద్యానికి బానిసలైన వ్యక్తుల కుటుంబాలు పస్తులుండే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. గ్రామాల్లోని బెల్ట్ షాపుల యజమానుల మధ్య నెలకొన్న పోటీ దృష్ట్యా ఉద్దెరని ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెక్కాడితే గానీ డొక్కాడని పేదల బతుకులు అల్లాడిపోతున్నాయి. ఉద్దెర కారణంగా అప్పులు పెరిగిపోయి ఉన్న భూములు అమ్ముకోవడం, అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దమవుతున్నారు.

క్వాటర్ పై అధికంగా వసూలు..

మండలంలోని గ్రామాల్లో వెలుస్తోన్న బెల్ట్ షాపుల్లో ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కో క్వాటర్ పై రూ. 20-30 అధికంగా, బీర్ పై రూ. 20 అధికంగా వసూలు చేస్తున్నారు.

సీసా వేరు.. మందు వేరు..

నల్లబెల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో కల్తీ మద్యం అమ్మకం జరుగుతున్నట్లు సమాచారం. మద్యం సీసా లేబుల్ ఒకటి ఉండగా అందులో మద్యం మాత్రం వేరే ఉంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిష్ణాతులైన వ్యక్తుల ద్వారా మద్యం సీసా మూతలు తీసి స్పిరిట్, తక్కువ ధర ఉన్న మద్యం అందులోకి పోస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదంతా కొందరు బెల్ట్ షాప్ యజమానుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పట్టింపులేని ఎక్సైజ్ అధికారులు..

మండలంలో బెల్ట్ షాపులు సంఖ్య రోజురోజుకి పెరుగుతోన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బెల్ట్ షాపుల ఆగడాల్ని అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీసు శాఖ అంచనా మేరకు పని చేయట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ఎన్ని బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్న పూర్తి సమాచారం ఎక్సైజ్ అధికారుల వద్ద ఉన్నప్పటికి చర్యలు తీసుకోవడంలో వెనుకడుకు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మామూళ్లు భారీగా అందుతుండటం వల్లే ఉదాసీనత చూపెడుతున్నారని మండలంలో బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పుట్టగొడుగుల్లా వెలుస్తోన్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Next Story