- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోమల నివారణకు సరికొత్త అస్త్రం వెల్లుల్లి..! పరిశోధనల్లో వెల్లడి!
వెల్లుల్లిలో ఉండే సహజ సమ్మేళనం దోమలు, ఈగలకు బర్త్ కంట్రోల్లా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు.

దిశ, ఫీచర్స్ : ఇది తెలుసా? ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అనేక రకాల వ్యాధులకు దోమల వ్యాప్తి కూడా ఒక ప్రధాన కారణం. ఎందుకంటే.. ఇవి వ్యాధికారకాలను మోసుకొస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యూ, ఫైలేరియాసిస్ వంటివి దోమలు కుట్టడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. అందుకే మనలో చాలామంది వివిధ రసాయనాల ద్వారా, దోమ తెరల ద్వారా దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలని చూస్తుంటారు. అలాగే దోమల శాశ్వత నివారణకు ఏం చేయాలనే దానిపై పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే రీసెంట్‌గా యేల్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక ఆశాజనకమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దోమల బర్త్ కంట్రోల్..
దోమల నివారణకు పెద్దగా ఖర్చులేని, ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని యేల్ యూనివర్సిటీ (Yale University) పరిశోధకులు గుర్తించారు. ఏంటంటే.. వెల్లుల్లిలో ఉండే సహజ సమ్మేళనం.. పరోక్షంగా దోమలు, ఈగలకు బర్త్ కంట్రోల్లా పనిచేస్తుందని, వాటి జనాభాను నియంత్రించడంలో సహాయపడటం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో కీ రోల్ పోషిస్తుందని కనుగొన్నారు. ఈ అధ్యయన వివరాలు సెల్ జర్నల్(Cell Journal)లోనూ పబ్లిష్ అయ్యాయి. నిజానికి వెల్లుల్లి సహజ కీటక నివారిణిగా ఉపయోగపడుతుందనే నమ్మకం భారతీయ పెద్దల్లో చాలా కాలంగా ఉంది. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు దాని పనితీరును ఖచ్చితంగా గుర్తించారు. ఇది కేవలం దోమలను తరిమేయడమే కాకుండా, వాటి పునరుత్పత్తిని పూర్తిగా ఆపేస్తుందని చెబుతున్నారు.
కొత్త పరిష్కారాలకు మార్గం..
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 43 రకాల పండ్లు, కూరగాయలను పరీక్షించగా, వెల్లుల్లిలోని ‘డైఅలైల్ డైసల్ఫైడ్’ అనే సమ్మేళనం ప్రభావవంతంగా ఉన్నట్లు తేలింది. ఇది ఆడ దోమలు, ఈగల్లో మేటింగ్, అలాగే గుడ్లు పెట్టడాన్ని పూర్తిగా ఆపేస్తుందని గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వెల్లుల్లి వాసన ద్వారా కాకుండా రుచి ద్వారా మాత్రమే ఈ ప్రభావం చూపుతుంది. ఆడ కీటకాలు ఈ సమ్మేళనాన్ని రుచి చూస్తే.. వాటి రుచి అవయవాల్లోని TrpA1 అనే సెన్సరీ రిసెప్టర్ యాక్టివ్ అవుతుందని, దీని వల్ల వాటికి అత్యధికంగా నిండుకున్నట్లు అనిపించి, మేటింగ్, అలాగే గుడ్లు పెట్టడం పట్ల ఆసక్తి పోతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ ఆవిష్కరణ రసాయనాలు లేని, పర్యావరణానికి అనుకూలమైన కొత్త పెస్ట్ కంట్రోల్ పద్ధతులను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రసాయనిక క్రిమినాశకాలు పర్యావరణానికి, మానవులకు హాని కలిగిస్తున్న నేపథ్యంలో ఈ సహజ పద్ధతి కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఇది దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించవచ్చునని నిపుణులు అంటున్నారు.






