- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉడెన్ హౌజెస్.. ఇండ్ల నిర్మాణంలో మారుతున్న ట్రెండ్
వివిధ రకాల ఆకృతులలో కండ్లు తిప్పుకోలేని రీతిలో ఉడెన్ తో నిర్మిస్తున్నారు

దిశ, హైదరాబాద్ బ్యూరో: ఇప్పటి వరకు అమెరికా, స్విట్జర్లాండ్ వంటి దేశాలకే పరిమితమైన ఉడెన్ హౌజెస్ కొంత కాలంగా నగర ప్రజలకు చేరువ అవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా రిసార్ట్, ఫాం హౌజ్ కల్చర్ కొంతకాలంగా గణనీయంగా పెరిగిపోయింది. వీటిని వివిధ రకాల ఆకృతులలో కండ్లు తిప్పుకోలేని రీతిలో ఉడెన్ తో నిర్మిస్తున్నారు.
సినిమాలలో కూడా..
ఒకప్పుడు కర్రతో ఇల్లా ? ఒక్కసారి చెదలు పట్టిందంటే మొత్తం నాశనమవుతుందనే అభిప్రాయం అందరిలో ఉండేది. దీనికితోడు వాతావరణ ప్రతికూల పరిస్థితులను ఎలా తట్టుకుంటాయనే అనుమానాలు కోకొల్లలుగా ఉండేవి. అయితే వీటిన్నింటిని పటాపంచలు చేస్తూ కర్రతో కట్టిన ఇండ్లు పెరిగిపోతున్నాయి. కర్రకు చెదలు పట్టకుండా కెమికల్ ట్రీట్మెంట్ పూర్తి చేసుకున్నవే అందుబాటులో దొరుకుతున్నాయి. వీటిలో కొన్నింటిని విదేశాల నుంచి సైతం దిగుమతి చేసుకుంటున్నారు . నాణ్యత, దీర్ఘ కాలం మన్నికగా ఉంటుండడంతో ఇలాంటి ఇండ్ల నిర్మాణం కోసం ప్రజలు ముందుకు వస్తున్నారు . వీటిని నిర్మించేందుకు నగరంలో అనేక నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సినిమాలలో కూడా ఇలాంటి ఇండ్లు అధికంగా కనబడుతుండడంతో కొత్తగా ఇండ్లు కట్టుకునేవారు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు .
విదేశాల నుంచి కలప
కెనెడా, స్వీడన్ , జర్మనీ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉడ్ తో నగరంలో ఈ ఇండ్లను నిర్మిస్తున్నారు. సిమెంట్ స్లాబుతో కట్టిన ఇండ్లలో వేసవి కాలం ఏసీలు లేకుండా ఉండడం పెద్ద టాస్క్ గా ఉంటుంది. అయితే కర్రతో నిర్మించిన ఇండ్లు సుమారు 30 శాతం ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి . స్టీల్, సిమెంట్ తో కట్టిన ఇండ్లతో సంవత్సరాల వ్యవధిలోనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. స్లాబులకు, గోడలకు పగుళ్లు రావడం వంటివి అనేకం కనబడుతుంటాయి. ఎంతో నాణ్యతతో కట్టిన ఇళ్లైనా యాభై ఏండ్లు గడిచేసరికి పటుత్వం కోల్పోయి శిథిలావస్థలో కనబడుతున్నాయి. అయితే ఉడెన్ ఇండ్లు మాత్రం వీటికి రెట్టింపు లైఫ్ ను కలిగి ఉంటున్నాయని నిర్మాణదారులు చెబుతున్నారు.
వేగంగా నిర్మాణం
ఉడెన్ హౌజెస్ నాణ్యతతో పాటు వేగంగా నిర్మాణం పూర్తవుతాయి. సుమారు రెండు వేల చదరపు ఫీట్లలో నిర్మించే ఆర్సీసీ హౌజ్ పనులు పూర్తవడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. నిర్మాణం మొదలైన నాటి నుంచి పిల్లర్లు, స్లాబులు వేయడం, వాటిని వాటర్ తో క్యూరింగ్ చేయడానికి నెలల సమయం తీసుకుంటుంది. అయితే ఉడెన్ హౌజెస్ కు ఇవన్నీ అవసరం లేకపోవడం, నాణ్యతతో పాటు సమయం కలిసి వస్తుండడంతో గత కొంత కాలంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలలో వీటి నిర్మాణాలు అధికంగా జరుగుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో మార్పులు కూడా చేసుకోవచ్చు. నచ్చిన డిజైన్లను అలంకరించే అవకాశం ఉంది. అవసరమైతే కూల్చివేయడానికి కూడా అతి తక్కువ సమయం తీసుకుంటుంది. తొలగించిన కర్రను మరో డిజైన్ తో ఇల్లు నిర్మించుకోవచ్చు.ఒకవేళ ఏదేని కారణంతో ఇంటి నిర్మాణం తొలగించి మరో ఇల్లు నిర్మించకపోతే ఈ ఉడ్ తో ఫర్నీచర్ సైతం చేసుకునే అవకాశం ఉంది.
ఆధునీకరణ సులువు
కర్రతో కట్టుకున్న ఇండ్లలో మార్పులు చేర్పులు చేసుకోవడం చాలా సులువు. హాల్ పెద్దగా ఉంది, మరో రూం అవసరం అనుకుంటే రోజుల వ్యవధిలోనే పూర్తి అవుతుంది. జీ ప్లస్ టు అంతస్తులలో కూడా వీటిని నిర్మించుకోవచ్చు. ఒకవేళ మొదటి అంతస్తు ఆర్సీసీ స్లాబుతో ఉంటే కూడా పై అంతస్తులలో ఉడెన్ తో నిర్మించుకునే అవకాశం ఉంది. ఆర్సీసీతో చేసే నిర్మాణం పై అంతస్తులకు చేరే సరికి మెటీరియల్ తరలించడం చాలా కష్టమవుతుంది . వీటికి యంత్రాల సహాయం అవసరమౌతుంది. అయితే కర్రతో నిర్మించే ఇండ్లలో ఈ సమస్య అంతంత మాత్రమే. ఉడ్ ను పై ఫ్లోర్లకు తరలించడం చాలా సులువు. గోడలకు వినియోగించే కర్రకు పలు రకాల కలర్స్ వేసుకోవడంతో మరింత ఆకర్షణీయంగా కనబడతాయి. సింగిల్ బెడ్ రూం నిర్మాణం కేవలం రూ. 15 లక్షలు, డబుల్ బెడ్ రూం సుమారు రూ. 25 లక్షలలో నిర్మాణం పూర్తవుతుంది .






