వనితలు జర భద్రం.. డయాబెటిస్ పై తాజా పరిశోధనలో షాకింగ్ ఫ్యాక్ట్స్

by Naga Rani Yarlagadda |

మధుమేహం వల్ల కలిగే దుష్ప్రభావాలు స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. మగవారితో పోల్చుకుంటే మహిళల్లో ఈ దుష్పరిణామాలు కాస్త ఎక్కువగా ఉంటాయని తేలింది.

వనితలు జర భద్రం.. డయాబెటిస్ పై తాజా పరిశోధనలో షాకింగ్ ఫ్యాక్ట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మధుమేహం వల్ల కలిగే దుష్ప్రభావాలు స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. మగవారితో పోల్చుకుంటే మహిళల్లో ఈ దుష్పరిణామాలు కాస్త ఎక్కువగా ఉంటాయని తేలింది. మధుమేహ దుష్ప్రభావాలపై దక్షిణ భారతదేశంలో చెన్నయ్ అర్బన్ రూరల్ ఎపిడెమియోలాజికల్ (క్యూర్స్-159) పేరిట స్టడీ నిర్వహించారు. 2001–03 నుంచి 2012–14 మధ్య మొత్తం 1,053 మంది (453 పురుషులు, 600 మహిళలు) ఆరోగ్య స్థితిగతులను పన్నెండేళ్ల పాటు అధ్యయనం చేశారు. మధుమేహం కలిగిన వారిలో కంటి సమస్యలు, నరాల బలహీనత, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, కాళ్లలో రక్తప్రసరణ లోపాల వంటి సమస్యలను గుర్తించారు. డయాబెటిక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు పురుషులతో కంటే స్త్రీలలో కాస్త ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. ఆ వివరాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రచురించింది.

వేర్వేరుగా దుష్ప్రభావాలు

మహిళల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు 36.1 శాతం నమోదు కాగా, ఇది పురుషుల్లో 31.4 శాతమే. ఇక కాళ్లలో రక్తప్రసరణ తగ్గిపోయే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ కూడా మహిళల్లో 35.4 శాతం ఉండగా.. ఇది పురుషుల్లో 23.9 శాతానికే పరిమితమైంది. డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి విషయంలో మాత్రం లింగభేదం కనిపించలేదు. పురుషులు (63శాతం), మహిళలు (63శాతం) సమాన స్థాయిలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. ఇది భవిష్యత్‌లో కాలి గాయాలు, కాళ్ల తొలగింపు వరకు దారితీసే ప్రమాదం ఉండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మధుమేహం కారణంగా వచ్చే కంటి సమస్యలు (డయాబెటిక్ రెటినోపతి) మహిళల్లో 27.3 శాతం ఉండగా.. పురుషుల్లో 37 శాతం ఉన్నది. గుండె సంబంధిత సమస్యలు (కొరోనరీ ఆర్టరీ డిసీజ్) సైతం మహిళల కంటే పురుషుల్లో (36.2 శాతం) ఎక్కువగా ఉన్నది.

వైద్య నిపుణులు సూచనలివే..

సాధారణంగా మహిళలకు ఉండే హార్మోన్ల రక్షణ వల్ల గుండె జబ్బుల ముప్పు పురుషుల కంటే తక్కువగా ఉంటుంది. కిడ్నీ సంబంధిత వ్యాధుల విషయంలో మాత్రం ముప్పు స్వల్పంగా (36.1 శాతం) ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కేవలం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడమే కాకుండా.. వారి లింగ భేదాన్ని బట్టి వచ్చే ప్రత్యేక ఆరోగ్య సమస్యల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ విశ్వనాథన్ మోహన్ బృందం సూచించింది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం ద్వారా ఈ దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చని పేర్కొంది. మధుమేహ చికిత్స అందరికీ ఒకేలా కాకుండా.. జెండర్ వారీగా ప్రమాదాలను గుర్తించి స్క్రీనింగ్, ప్రత్యేక చికిత్సలు అందించాలని పరిశోధకులు సూచించారు. కిడ్నీ, కాళ్ల నరాల సమస్యలపై మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కంటి, గుండె ఆరోగ్యంపై పురుషులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Next Story