భారత స్వాతంత్య్ర పోరాటంలో ధీర వనితలు ఎవరో తెలుసా?

by Disha Web Desk 6 |
భారత స్వాతంత్య్ర పోరాటంలో ధీర వనితలు ఎవరో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు..1857లో మొదలైన మహా తిరుగుబాటు నుంచి 1947లో స్వాతంత్య్రం సిద్ధించే వరకు లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు తమ జీవితాలను పోరాటానికి అంకితం చేశారు. పసిపాపలు, పండు ముసలోళ్లే కాదు లింగబేధం లేకుండా ప్రతీ ఒక్కరు భుజం భుజం కలిపి స్వతంత్య్ర కాంక్ష నెరవేర్చేందుకు పోరాడారు. ఈ పోరులో పురుషుల సహకారం ఆదర్శప్రాయమైనప్పటికీ.. నాటి సమాజ మూస పద్ధతులను బద్దలు కొట్టి మరీ ధైర్యంగా ఉద్యమించిన మహిళామణుల చరిత అజరామరం. కొందరు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో విరుచుకుపడితే.. ఇంకొందరు తమ ప్రసంగాల్లో విప్లవాగ్ని రగిల్చారు. ఆ త్యాగధనుల సాక్షిగా ఈ ఏడాది భారత్ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న సందర్భంగా వీరవనితలను తలచుకోవడం సముచితమే కాదు గౌరవం కూడా.

బసంతీ దేవి

1880 మార్చి 23న అస్సాంలోని జమీందారి కుటుంబంలో జన్మించింది బసంతీ దేవి. కోల్‌కతాలోని లోరెటో హౌస్‌లో చదువుకున్న ఆమె.. పదిహేడేళ్ల వయసులో అక్కడే పరిచయమైన చిత్తరంజన్ దాస్‌‌ను పెళ్లి చేసుకుంది. అయితే 1921‌లో అరెస్టయిన దాస్ 1925లో మరణించాడు. ఆ తర్వాత రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంది బసంతీ దేవి. భర్త అడుగుజాడల్లో నడుస్తూ శాసనోల్లంఘన, ఖిలాఫత్ ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించింది. దాస్ అరెస్టు తర్వాత తను ప్రచురించే వార పత్రిక 'బంగార్ కథ'(బెంగాల్ కథ) బాధ్యతలను స్వీకరించిన బసంతీ దేవి.. బెంగాల్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 1922 ఏప్రిల్‌లో చిట్టగాంగ్ సమావేశంలో తన ప్రసంగంతో అట్టడుగు స్థాయిలో ఆందోళనలను ప్రోత్సహించింది. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వలసవాదాన్ని వ్యతిరేకించేందుకు గాను కళలను, సాంస్కృతిక కార్యక్రమాలకు మద్దతిచ్చింది. ఈ క్రమంలోనే మహిళలకు విద్యను అందించాలనే లక్ష్యంతో 'నారీ కర్మ మందిర్' పేరుతో ఓ శిక్షణా కేంద్రాన్ని స్థాపించింది.

పోలీసుల లాఠీ చార్జ్‌లో మరణించిన లజపతిరాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని బసంతీ దేవి భారతీయ యువతకు ఉద్బోధించింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఆమె సామాజిక సేవలో కొనసాగారు. 1959లో కోల్‌కతాలో ప్రభుత్వ నిధులతో స్థాపించిన మొట్టమొదటి మహిళా కళాశాల ఆమె పేరిటే (బసంతీ దేవి కళాశాల) స్థాపించడం విశేషం. కాగా 1973లో భారత ప్రభుత్వం, దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో ఆమెను సత్కరించింది.

డాక్టర్ లక్ష్మీ సెహగల్

కేరళలోని భూస్వాముల కుటుంబంలో జన్మించిన డాక్టర్ లక్ష్మీ సెహగల్.. బ్రిటీష్ పాల‌కుల‌ను త‌రిమేసేందుకు అడ‌వి బాట ప‌ట్టింది. ఆయుధాలు భుజానేసుకొని పోరాడిన‌ ధీరవనితల్లో ఈమె కూడా ఒకరు. దేశంలో కులతత్వానికి వ్యతిరేకంగా ఆమె చేసిన ప్రయత్నాలు స్వాతంత్య్ర సమరయోధురాలు కంటే ఎక్కువనని చెబుతారు. 1938లో మద్రాసు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తయ్యాక 1940లో సింగపూర్ వెళ్లింది. అక్కడ భారతీయ నిరుపేదల వాడలో వైద్యశాల స్థాపించి, స్థానికంగా ఉన్న భారతీయ కార్మికులకు సేవలందించింది. అక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలైన లక్ష్మి.. స్వాతంత్ర్యోద్యమంలో 'ఆజాద్ హింద్ ఫౌజ్ ' మహిళా దళాల్లో చేరి, కెప్టెన్ హోదా పొందింది. డాక్టర్‌గా వైద్యసేవలు కూడా అందించింది. బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆధ్వర్యంలోని ఝాన్సీ రెజిమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె.. ఇండియన్ నేషనల్ ఆర్మీ మొదటి ఆల్-ఉమెన్ రెజిమెంట్‌ను నిర్మించడంలో, కమాండ్ చేయడంలో సాయపడింది. సింగపూర్, మలేషియాలోని భారతీయుల కుమార్తెలు ఈ రెజిమెంట్‌లో చేరగా.. వారికి ఆయుధాలు ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో సింగపూర్‌లో INA టాప్ అధికారి లెఫ్టినెంట్ లాహోర్‌కు చెందిన కర్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్‌తో ప్రేమ‌లో ప‌డింది.

1944 డిసెంబర్‌లో జపాన్ సైన్యంతో పాటు INA దళాలు బర్మాకు వెళ్లాయి. కానీ మిత్రరాజ్యాల దళాల నుంచి జపాన్‌కు ఎదురుదెబ్బ తగలడంతో సైనికులందరినీ బ్రిటిష్ సైన్యం బంధించింది. వారిలో లక్ష్మీ సెహగల్ కూడా జైలుపాలైంది. భార‌త దేశానికి స్వాతంత్రం వచ్చిన త‌ర్వాత లక్ష్మి CPI(M)లో చేరారు. 2002లో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక‌ కావడంతో ఉమ్మడి ప్రతిపక్ష నాయ‌కురాలిగా బాధ్యత‌లు చేప‌ట్టింది. బంగ్లాదేశ్ యుద్ధం, భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో కూడా ఆమె సహాయ శిబిరాలకు నాయకత్వం వహించారు. ఆమె మహిళల హక్కుల కోసం, అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాడారు. కాన్పూర్‌లో పేదలకు ఉచిత వైద్యం అందించే క్లినిక్ న‌డిపించిన లక్ష్మి త‌న 97వ ఏట 2012లో మృతి చెందారు.

ఉమాబాయి కుందాపూర్ :

ఉమాబాయి కుందాపూర్ 1892లో మంగళూరులో గొలికేరి కృష్ణారావు, జుంగాబాయి దంపతులకు జన్మించింది. 13 ఏళ్ల వయస్సులోనే సంజీవ్ రావు కుందాపూర్‌తో ఆమెకు వివాహం జరిగింది. మామ ఆనందరావు మార్గదర్శకత్వంలో చదువు కొనసాగించి, మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణురాలైంది. అనంతరం కర్ణాటకలో ముద్రణాలయాన్ని ప్రారంభించడం సహా ఉమాబాయి నేతృత్వంలో బాలికల కోసం 'తిలక్ కన్యా శాల' అనే పాఠశాలను కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే డాక్టర్ NS హర్దికర్ యువతను జాగృతం చేసేందుకు 1921లో 'హిందుస్తానీ సేవా దళ్‌'ను ప్రారంభించాడు. ఈ కార్యకలాపాలకు హుబ్లీ కేంద్రంగా మారగా.. ఉమాబాయి హిందుస్తానీ సేవాదళ్ మహిళా విభాగానికి నాయకురాలైంది. 1924లో అఖిల భారత కాంగ్రెస్ బెల్గాం సెషన్‌లో సాయం చేసేందుకు డాక్టర్ హర్దికర్‌కు 150 మంది మహిళలను నియమించడంలో ఆమె సాయపడింది. 1932లో ఆమెను అరెస్టు చేసి నాలుగు నెలలపాటు ఎరవాడ జైలులో ఉంచారు. ఆమె జైలులో ఉండగానే బ్రిటిష్ వారు కర్ణాటక ప్రెస్‌ను జప్తు చేసి, ఆమె పాఠశాలను సీలు చేశారు. ఆమె నడిపిస్తున్న ఎన్‌జీవో 'భగినీ మండల్'‌ను చట్టవిరుద్ధమని ప్రకటించారు. జరిగిన సంఘటనలతో అధైర్యపడకుండా ఉమాబాయి పోరాటం కొనసాగించాలని నిర్ణయించుకుంది. తన ఇంటిని మహిళా స్వాతంత్య్ర సమరయోధులకు ఆశ్రయంగా మలిచింది. అంతేకాదు గ్రామ సేవికలకు శిశు సంక్షేమం, ఆరోగ్య కార్యక్రమాలు, విద్యలో శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామాల పరిస్థితిని మెరుగుపరిచేందుకు నిధులను సేకరణ కోసం ఇతర మహిళలతో కలిసి ఉమాబాయి భిక్షాటన చేసింది. ఇలా చివరి శ్వాస వరకు దేశానికి నిర్భయంగా సేవ చేసిన ఈ స్వాతంత్య్ర ప్రచారకురాలు.. చరిత్రలో స్థానం పొందింది.

వీరితో పాటు తారా రాణి శ్రీవాస్తవ, మాతంగిని హజ్రా(గాంధీ బరీ), కమలాదేవి చటోపాధ్యాయ, ఉదా దేవి, అరుణా అసఫ్ అలీ, భికైజీ కామా, బేగం హజ్రత్ మహల్, గులాబ్ కౌర్, కమలా నెహ్రూ, ఉషా మెహతా, కల్పనా దత్తా వంటి ఎంతోమంది ధీరవనితలు స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరగని పోరాటం చేశారు. నిజానికి భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగమైన చాలా మంది మహిళల గురించిన ప్రస్తావన చరిత్ర పుస్తకాల్లో కనబడదు. వీళ్లంతా సాధారణ మహిళలే కానీ భరతమాత స్వేచ్ఛ కోసం అసాధారణ కృషి చేశారు. వజ్రోత్సవ వేళ ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ మహిళలకు స్మరించుకోవడం మనకు గర్వకారణం.

నివేదన: ఆ త్యాగాలను స్మరించుకుందాం



Next Story