వాటర్‌మిలన్‌తో తగ్గుతున్న డీహైడ్రేషన్ రిస్క్.. ఎండాకాలంలో తింటే కలిగే ప్రయోజనాలివే..

by Javid Pasha |

ప్రతీ కప్ వాటర్‌మిలన్‌ రోజువారీ విటమిన్ సి అవసరాల్లో సుమారు15% లభిస్తుంది. విటమిన్ ఎ, బి6, మెగ్నీషియం కూడా ఉంటాయి.

వాటర్‌మిలన్‌తో తగ్గుతున్న డీహైడ్రేషన్ రిస్క్.. ఎండాకాలంలో తింటే కలిగే ప్రయోజనాలివే..
X

దిశ, ఫీచర్స్ : అసలే ఎండాకాలం. బయట ఎక్కువగా తిరిగేవారు డీహైడ్రేషన్ బారినపడే అవకాశం ఎక్కువ. అయితే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అద్భుతమైన చిట్కా ఒకటుంది. అదే వాటర్ మిలన్ (పుచ్చకాయ). ఇది 92%కి పైగా నీటిని కలిగి ఉంటుంది కాబట్టి వేసవిలో డీహైడ్రేషన్ రిస్క్ నుంచి రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కండరాల పనితీరు మెరుగు పడుతుంది

వాటర్ మిలన్ కేవలం ఒక పండు మాత్రమే కాదు. సమ్మర్‌లో మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మెడిసిన్‌ లాంటిదని కూడా నిపుణులు చెబుతుంటారు. ఇందులో శరీరానికి హైడ్రేషన్, అలాగే పోషకాలను అందిస్తుంది. సిట్రులిన్‌ను కలిగి ఉండటంవల్ల రక్తపోటును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అలాగే వేడి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఈ వేసవి పండును ఒక స్నాక్‌గానో, డ్రింక్‌గానో తీసుకుంటూ ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీటిశాతం అధికంగా ఉండటంవల్ల హైడ్రేటింగ్ ఆహారాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఒక కప్ వాటర్‌మిలన్‌లో సుమారు 170 మి. గ్రా. పొటాషియం ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి శరీరంలో ద్రవాలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది నాడులు, కండరాల పనితీరును సమర్థవంతంగా నిర్వహించడంలో కూడా దోహదపడుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

విటమిన్లు, పోషకాలు ఫుల్..

ప్రతీ కప్ వాటర్‌మిలన్‌ రోజువారీ విటమిన్ సి అవసరాల్లో సుమారు15% అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు విటమిన్ ఎ, విటమిన్ బి6, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ శరీరం తన విధులను సక్రమంగా నిర్వహించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా హైడ్రేషన్‌కంటే మించి ఇతర శారీరక ప్రక్రియలకు కూడా పుచ్చకాయలోని పోషకాలు సహకరిస్తాయి. ఈ పండులో ఎరుపు రంగుకు కారణమైన లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని, కాలక్రమేణా కణాలు దెబ్బతినడాన్ని నెమ్మదింపజేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పుచ్చకాయలో 1,500కిపైగా వివిధ ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి దాని రక్షణ గుణాలకు దోహదపడతాయి. తినడంవల్ల మానవుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి వేసవిలో వీలైనంత మేరకు వాటర్ మిలన్‌ను ఆహారంలో చేర్చడం ద్వారా డీహైడ్రేషన్ రిస్క్ నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story