అమ్మ ప్రేమతో.. ఆటిజాన్ని జయించాడు.!

by Daayi Srishailam |
అమ్మ ప్రేమతో.. ఆటిజాన్ని జయించాడు.!
X

అందరిదీ ఓ లోకం..

"ఆటిజం" సమస్య ఉన్న పిల్లలదీ ఓ లోకం.

అందరికీ సంతోషం కలిగినప్పుడు వీళ్లకు కలగదు.

అందరూ మాట్లాడినప్పుడు వీళ్లు మాట్లాడరు.

భావాలను.. ఎమోషన్స్‌ను వ్యక్త పరచరు.

అలాంటి తన కొడుకును సాధారణ పిల్లల్లా మార్చి..

ఆటిజానికే సవాలు విసిరిందో అమ్మ.

ఆ అమ్మ కథే ఇది.!!

- దిశ, ఫీచర్స్

ఇది మిలన్ సింగ్ కథ. ప్రత్యేక అవసరాల పిల్లవాడిగా ఉన్న తన కొడుకును సాధారణ పిల్లవాడిగా మార్చిన అమ్మ కథ. ఆటిజం సవాలుగా మారుతున్న ఈ రోజుల్లో సరైన మద్దతు.. అవగాహనతో తన కొడుకులో ఉన్న సామర్థ్యాలను వెలికితీసి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించింది మిలన్ సింగ్.

ప్రత్యేకమైన ప్రపంచం..

మిలన్ సింగ్ కొడుకు సమర్‌జీత్ సింగ్. అతడికి ఆటిజం ఉందని తెలిసినప్పటి నుంచి సమాజం వారి కుటుంబాన్ని భిన్నంగా చూసేది. దీనిని సవాలుగా తీసుకున్న మిలన్.. కొడుకు పరిస్థితిని చూస్తూ కుమిలిపోవడం కంటే.. అతడిని సాధారణ పిల్లవాడిగా మార్చాలని కంకణం కట్టుుకుంది. ఆటిజం పట్ల సంకుచిత అభిప్రాయం ఉన్న సమాజానికి దూరంగా సమర్‌ను పెంచింది. అందరూ ఆటిజంను ఒక సమస్యగా.. లోపంగా చూస్తే.. మిలన్ మాత్రం తన కొడుకులో దాగివున్న అద్భుతమైన తెలివి తేటలను గుర్తించింది. పూర్తి సమయం కొడుకుకే కేటాయించి తనకోసం ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని నిర్మించింది.

కొడుకుతో పాటే..

సమర్‌కు బేకింగ్ అంటే ఇష్టం. ఇది తెలుసుకున్న తల్లి అతడిని ప్రోత్సహించింది. తను చేసే ప్రతీ పనిలో భాగస్వామ్యం చేసేది. కలిసి ఆడుకునేది.. రకరకాల పనులు చేయించేది. ఎమోషన్స్ క్యారీ అవడానికి.. తనలో ఉన్న భావాల్ని పంచుకోవడానికి ఏమేం చేయాలో అవన్నీ ట్రిక్స్ ఫాలో అయింది మిలన్. తన బేకింగ్ నైపుణ్యాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవాలి అని సమర్ భావించినప్పుడు అతడికి మర్గదర్శనం చేసింది. ఈ ప్రయత్నాలన్నీ సమర్‌ను ఒక బిడ్డగా కాకుండా.. తన గుర్తింపును గర్వంగా చాటుకున్న వ్యక్తగా ట్రీట్ చేసి.. అతడిని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది.

సంపూర్ణమైన వ్యక్తి..

సమర్ ఇప్పుడు ఎమోషన్స్‌ను అర్థం చేసుకోగలడు. ప్రేమ.. ఓర్పు.. అన్నీ వ్యక్తపరుస్తాడు. అతడు ఇప్పుడు ఆటిజంతో బాధపడే సమర్ కాదు. ఒక డిజిటల్ క్రియేటర్.. బేకర్.. ట్రావెలర్.. ఆటిజం సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న వలంటీర్. మామూలుగా వేరేవాళ్లయితే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పుడితే అది వాళ్ల దురదృష్టంగా భావించి ఇక ఇంతే అనుకుంటారు. ఏదో ప్రత్యేక అవసరాలు గల పాఠశాలలో చేర్చి ఊరుకునేవారు. కానీ మిలన్ సింగ్ అలా చేయలేదు. మంచి వాతావరణంలో సమర్‌ను పెంచి.. అతడిలో ఉన్న సామర్థ్యాలను వెలికితీసి సంపూర్ణమైన వ్యక్తిగా మార్చింది.

మార్పు సాధ్యమనీ..

న్యూరో డైవర్జెంట్ ఆటిజంతో బాధపడుతున్న పిల్లవాడు సంపూర్ణ వ్యక్తిగా.. సాధారణ యువకుడిగా ప్రవర్తించేలా అభివృద్ధి చెందాడంటే అందులో మిలన్ సింగ్ శ్రమ ఎంత దాగివుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఒక తల్లిగానే కాదు.. ఆటిజం యాక్టివిస్ట్‌గా.. పేరెంటింగ్ కౌన్సెలర్‌గా.. అడ్వకేట్‌గా.. టెడెక్స్ స్పీకర్‌గా.. వ్యాపారవేత్తగా ఆమె తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి.. తన ప్రతీ యాక్టివిటీలో కొడుకును ఇన్వాల్వ్ చేసింది. ఆటిజంపై సమాజంలో ఉన్న అపోహలను.. దృష్టి కోణాన్ని మార్చేసి "న్యూరో డైవర్జెంట్" పిల్లలను సరిచేయడం సమస్య కాదని నిరూపించింది.

తల్లి సందేశం

మిలన్.. సమర్‌జీత్ సింగ్ ఇద్దరూ కలిసి ఆటిజంపై పోరాటం చేస్తున్నారు. యాక్టివిస్టులుగా అదృశ్య వైకల్యాల గురించి దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. "ఆటిజం" ఉన్నవారిని సమాజం ఎలా చూస్తుందో అనే నామోషీ అవసరం లేదనీ.. ప్రతీ బిడ్డకు గౌరవం.. ప్రేమ.. అవకాశాలు లభించాలనే సందేశాన్నిస్తున్నారు.

Next Story

Most Viewed