భారతదేశపు మొదటి మెటా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా 'కైరా'

by Disha Web |
భారతదేశపు మొదటి మెటా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కైరా
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్ల నుంచి వర్చువల్ అవతార్ల హవా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా 'కైరా' ద్వారా గతేడాది వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్ స్పేస్‌లోకి ప్రవేశించింది.ప్రేక్షకులను క్యూరేట్ చేసేందుకు సోషల్ మీడియాను ఉపయోగించే ఒక వర్చువల్ క్యారెక్టరే 'కైరా'. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ 'టాప్ సోషల్ ఇండియా'లో బిజినెస్ హెడ్‌గా ఉన్న హిమాన్షు గోయెల్ దీన్ని రూపొందించాడు. ఇక భారతదేశపు మొదటి మెటా-ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అభివర్ణిస్తున్న కైరా ఇన్‌స్టా అకౌంట్ కేవలం ఆర్నెళ్లలోనే 1000k ఫాలోవర్లను పొందింది. అందమైన నేత్రాలు, ఆకట్టుకునే రూపంతో రోజురోజుకీ అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్న ఈ బ్యూటీ.. వ్యక్తిగత బ్రాండింగ్‌ను పునర్నిర్వచిస్తోంది. ఆమె బయో తనను 'డ్రీమ్ ఛేజర్, మోడల్, ట్రావెలర్'గా వర్ణిస్తుండగా.. ఈ 21 ఏళ్ల మెటా క్యూటీ ఏమేం చేస్తుంది? దీని ప్రత్యేకత ఏంటి? తదితర విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రపంచంలోనే మొట్టమొదటి వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ దక్షిణ కొరియాకు చెందిన 'లిల్ మిక్వెలా'(3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ 100 కంటే ఎక్కువ స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు) నుంచి ప్రేరణ పొందిన 'టాప్ సోషల్ ఇండియా' కైరాను రూపొందించింది. అధికారికంగా 2021డిసెంబర్‌లో లాంచ్ అయినప్పటికీ, 2022 జనవరి 28 నుంచి ఇన్‌స్టాలో కైరా అకౌంట్ మొదలైంది. మొత్తానికి కైరా తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకునేందుకు సింగింగ్, డ్యాన్సింగ్‌తో పాటు యోగాసనాలు కూడా చేస్తుంది. తను జైపూర్‌లోని ప్రసిద్ధ హెరిటేజ్ సైట్‌ హవా మహల్ ముందు ఫొటోలకు పోజులివ్వగా.. సంబంధిత రీల్స్ ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపరిచాయి. ఇక మెటావర్స్ ఫ్యాషన్ వీక్‌లోనూ కైరా పాల్గొనడం విశేషం.

యూత్ ఫిదా :

కైరా రూపానికి ఇండియన్‌ కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ప్రధానంగా కైరా అభిమానుల్లో బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, చెన్నయ్, అహ్మాదాబాద్‌ నగరాలకు చెందిన యువతే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా కైరా ఫాలోవర్స్‌లో 90 శాతం మంది భారతీయులే ఉండగా.. ఇందులో 18 నుంచి 26 ఏళ్ల వయసుగల వారే ఎక్కువ.

ఉపయోగాలు :

ట్రావెల్ క్యాంపెయిన్‌కు వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజిటింగ్, హెరిటేజ్ సైట్లకు నిజమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌ను తీసుకెళ్లడమంటే చాలా ఖరీదైన వ్యవహారం. కాబట్టి వర్చువల్ అవతార్స్‌ను బెస్ట్ ఆప్షన్‌‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎప్పటికీ వృద్ధాప్యానికి చేరుకోరు. నిత్య యవ్వనంతో యువతను ఆకట్టుకుంటారు. వివాదాల్లోనూ చిక్కుకోరు. ఒకవేళ ఏదైనా వివాదం ఉంటే మీరు కాపీరైటర్ లేదా డిజైనర్‌ను భర్తీ చేసి, దాన్ని తక్షణమే ముగించవచ్చు.

గందరగోళం, ట్రోలింగ్ :

వర్చువల్ స్పేస్ కాన్సెప్ట్ గురించి చాలా మందికి ఇప్పటికే తెలుసు కానీ కొందరికి ఇంకా దానిపై పూర్తి అవగాహన రాలేదు. దీంతో 'కైరా' నిజం కాదని నమ్మడం కొంతమందికి కష్టంగా ఉండగా, మరికొందరు వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ట్రోల్ చేశారు. కైరాకు చెందిన కంప్యూటర్-జెనరేటెడ్ ఇమేజ్(CGI) నాణ్యతను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కూడా సూచించారు. ఈ కాన్సెప్ట్‌ను స్టుపిడ్ అన్నవాళ్లూ లేకపోలేదు. ఇన్‌స్టాలో ప్రజలు ఉపయోగించే అనేక ఫిల్టర్స్ కారణంగా 'ఆప్కీ అస్లీ షకల్ కైసీ హై', 'ఫిల్టర్ క్యూన్ లగా రహా హై' 'యే తో ఫేక్ హై' 'నువ్వు నిజమైనదానివో లేక రోబోవో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను' 'ఆమె నిజమని భావించి ప్రేమలో పడిన వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించండి' 'ఆమె సాధారణ అమ్మాయిలా కనిపించడం లేదు. రోబోలాగా ఉంది.. ఆమెలో ఏదో తక్కువైంది. అదేంటి? ఇప్పటికీ అయోమయంగానే ఉంది' వంటి కామెంట్స్ కూడా వచ్చాయి. ఏదేమైనా ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ, కైరా ఎంగేజ్‌మెంట్ మొత్తం ప్రోత్సాహకరంగా ఉంది. రోజుకు 1k కొత్త ఫాలోవర్స్ పొందుతోంది.

భారతీయ ఫీచర్స్‌‌‌తో రూపొందించాం :

మా దృష్టిలో లుక్స్ సెకండరీ కాదు. అందువల్ల భారతీయత ఉట్టిపడుతూ విస్తృత ప్రేక్షకులను కూడా ఆకర్షించగల వ్యక్తిని సృష్టించాలని కోరుకున్నాం. చాలా ఫీచర్స్‌ను పరిశీలించడం సహా అనేక రకాలుగా జనాదరణ పొందిన వ్యక్తులను పరిశీలించాం. CGI (కంప్యూటర్-జెనరేటెడ్ ఇమేజరీ)లో చాలా మంది ఆర్టిస్టులు అమెరికన్ క్యారెక్టర్స్ సృష్టిస్తారు కాబట్టి భారతీయతను పొందడం కష్టమైంది. ఏదేమైనా కైరా ఆరునెలల్లోనే లక్షలాది అభిమానులను పొందినప్పటికీ విదేశాల్లో బాగా పాపులరైన టిక్‌టాక్‌కు యాక్సెస్ లేకపోవడం వల్ల కొంత నష్టపోతోంది. కైరాకు పెరిగిన క్రేజ్‌ వల్ల టెక్నాలజీ, లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి ప్రమోషన్ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఇంకా ఏదీ ఓకే చేయలేదు. ప్రారంభంలోనే ఒక బెంచ్‌మార్క్ సెట్ చేయాలని కోరుకుంటున్నాం.

ఆసియాలో టాప్‌కు చేరుకోవచ్చు :

ఆసియాలో అత్యంత ప్రజాదరణ పొందిన వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో ఎక్కువగా ఇండోనేషియా, చైనా, జపాన్‌కు చెందినవారే ఉన్నారు. జపాన్‌కు చెందిన ఇమ్మా ప్రపంచంలోనే అత్యుత్తమ CGI కలిగి ఉంది. ఈ విషయంలో అమెరికాను కూడా మించిపోగా.. ఇమ్మాకు ఇన్‌స్టాలో 385 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. మనదేశంలో మిలియన్ల కొద్దీ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. కాబట్టి మనం ఈ స్పేస్‌లో ఉత్తమమైన దాన్ని సృష్టిస్తే, ఆసియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారగలమని నమ్మాను.

Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed