టూర్ వెళ్లాలనుకుంటున్నారా? వర్షాకాలంలో ఎక్కడికి వెళ్లాలో తెలియటం లేదా? మీకోసమే ఈ సూపర్ ప్యాకేజీ

by Yella Dhawani Reddy |

కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమల అంచున వెలసిన కూర్గ్ సహజసిద్ధమైన అందాలతో పర్యాటకులకు స్వర్గధామంగా మారింది.

టూర్ వెళ్లాలనుకుంటున్నారా? వర్షాకాలంలో ఎక్కడికి వెళ్లాలో తెలియటం లేదా? మీకోసమే ఈ సూపర్ ప్యాకేజీ
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమల అంచున వెలసిన కూర్గ్ (Corge) సహజసిద్ధమైన అందాలతో పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. ఎండమావుల్లోనూ ఆకట్టుకునే ఈ ప్రాంతం, వర్షాకాలంలో మరింత అపూర్వంగా మారుతుంది. వర్షపు చిరుజల్లులతో మెరుస్తూ, పచ్చటి పర్వతాలు, మేఘాల మధ్య అలముకుంటున్న కాఫీ తోటలు, ఉప్పొంగే జలపాతాలు, చారిత్రక కట్టడాలు.. అన్ని సందర్శకులను ఆకర్షిస్తుంటాయి. ఇక మైసూర్‌ (Mysore) రాజభవనం, చందనంతో చేసిన ఇక్కడి కళాఖండాలు అద్భుతంగా ఉంటాయి. ఒకే ప్యాకేజీలో ఈ రెండు ప్రాంతాలను చుట్టే అవకాశం వస్తే.. ఎంత బాగుంటుంది కదా! అయితే అలాంటి వారికోసమే ఐఆర్‌సీటీసీ(IRCTC) 'కాఫీ విత్‌ కర్ణాటక (Coffee with Karnataka)' ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో వెళ్లాలనుకునే వారి కోసం జులై 2 నుంచి ప్రతి బుధవారం కాచిగూడ నుంచి రైలు ఉంటుంది. ఆగస్టు 27 వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్యాకేజీ ధర రూ.12,670 నుంచి ప్రారంభమవుతుంది.

ప్రయాణం వివరాలు:

* మొదటి రోజు కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి రాత్రి 7.05 గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.

* రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మైసూరు చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఆర్‌సీటీసీ సిబ్బంది కూర్గ్‌ తీసుకెళ్తారు. మధ్యాహ్నానికి కూర్గ్‌ చేరుకుంటారు. ముందుగానే ఏర్పాటు చేసిన హోటల్‌లో చెకిన్ తర్వాత.. అబ్బె జలపాతం, ఓంకారేశ్వర ఆలయం సందర్శించొచ్చు. కూర్గ్‌లోనే ఆ రాత్రి బస ఉంటుంది.

* మూడో రోజు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ చేసి తలకావేరి, భాగమండల, రాజా సీట్‌ పార్క్‌ను చూడొచ్చు. మూడో రోజు కూడా బస కూర్గ్‌లోనే ఉంటుంది.

* నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసి హోటల్ చెక్ అవుట్ అనంతరం మైసూర్‌‌కు బయలుదేరుతారు. ఆ దారిలో కావేరి నిసర్గధామ, టిబెటెన్‌ మానెస్టరీ, బృందావనం గార్డెన్స్‌ సందర్శించొచ్చు. ఆ రాత్రి మైసూరులో బస ఉంటుంది.

* ఇక ఐదో రోజు ఉదయం చాముండి హిల్స్‌, మైసూర్‌ ప్యాలెస్‌ చూపించి మధ్యాహ్నానికి రైల్వే స్టేషన్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 3.15 గంటలకు రైలు మైసూర్‌ నుంచి కాచిగూడకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.

* ఆరో రోజు ఉదయం 5.40 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో ట్రిప్‌ పూర్తవుతుంది.

ప్యాకేజీ వివరాలు:

* కంఫర్ట్‌ థర్డ్‌ ఏసీ బెర్త్‌లో సింగిల్‌ షేరింగ్‌లో అయితే రూ.33,160, డబుల్‌ షేరింగ్‌కు రూ.18,730, ట్రిపుల్‌ షేరింగ్‌లో రూ.14,690 చెల్లించాల్సి ఉంటుంది. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్‌ బెడ్‌కు రూ.11,140, విత్‌ అవుట్‌ బెడ్‌ రూ.9,530గా నిర్ణయించారు.

* స్టాండర్డ్‌ స్లీపర్‌ బెర్త్‌లో సింగిల్‌ షేరింగ్‌లో రూ.31,140, డబుల్‌ షేరింగ్‌కు రూ.16,710, ట్రిపుల్‌ షేరింగ్‌లో రూ.12,670 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్‌ బెడ్‌కు రూ.9,120, విత్‌ అవుట్‌ బెడ్‌ రూ.7,510 చెల్లించాల్సి ఉంటుంది.

ప్యాకేజీలోని సౌకర్యాలు:

* ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైల్లో 3 ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.

* ప్యాకేజీని బట్టి సైట్ సియింగ్‌ ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు.

* హోటల్‌లో బస, ఉదయం అల్పాహారం ఉచితంగా లభిస్తుంది.

* ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.

* మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పర్యాటకులే ఏర్పాటు చేసుకోవాలి

* పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే పర్యాటకులే చెల్లించుకోవాలి.

* గైడ్‌ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.

* ఏదైనా కారణం వల్ల టికెట్లు 15 రోజుల ముందు రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్‌కు క్యాన్సిలేషన్‌ కింద రూ.250 మినహాయించి మిగతా మొత్తాన్ని రీఫండ్‌ చేస్తారు. అదే 8-14 రోజుల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం, 4-7 రోజుల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకుంటే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.

ఈ టూర్‌ పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Next Story