- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూట్యూబ్ చూసి.. ఛాంపియన్ అయ్యింది.!
కోచింగ్, కోర్టులు లేకుండా ఛాంపియన్‌గా నిలిచింది

దిశ, ఫీచర్స్: స్క్వాష్ అనేది రాకెట్ ఆట. సింగిల్స్ లేదా డబుల్స్ ఆడతారు. బోలుగా ఉండే రబ్బర్ బంతిని రాకెట్లతో కొట్టే ఆట ఇది. లక్ష్యం.. బంతి రెండుసార్లు నేలను తాకేలోపు కొట్టడం. ఈ ఆట ఖర్చుతో కూడుకున్నది. కోచింగ్, కోర్టులు చాలా అవసరం. అలాంటి ఆటలో కోచింగ్, కోర్టులు లేకుండా ఛాంపియన్‌గా నిలిచింది వసుంధరా నంగరే.
వెనక్కి తగ్గలేదు..
వసుంధరా నంగరే మొదటిసారి బాంబే జిమ్‌ఖానా స్క్వాష్ కోర్టులో అడుగుపెట్టినప్పుడు ఫ్లడ్‌లైట్ల కింద మెరుస్తున్న అద్దాల గోడలను చూసి ఆగిపోయింది. అంతకుముందు తాను చూసింది వేరు.. ఇది వేరు. అంతకుముందు తన కోర్ట్ మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలోని కలంబ్ పట్టణంలో చిన్నదిగా ఉండేది. వర్షాకాలంలో అది నీళ్లతో నిండిపోయేది. బండలు పాకురుపట్టి జారేవి. భయపడి ప్రాక్టీస్ మానేసేది. తాను కూడా అత్యుత్తమ కోర్టులో నిలబడి.. దేశంలోని తోపు ఆటగాళ్లతో తలపడాలనుకునేది. ఆ లక్ష్యం కోసమే నిత్యం సాధన చేసేది. ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తగ్గలేదు.
రోజువారీ ప్రాక్టీస్..
వాస్తవానికి ఈ ఆట తన జీవితంలో భాగమవుతుందని వసుంధరా అనుకోలేదు. అసలు ఫస్ట్ వాళ్ల అక్క ప్రయత్నించింది. ఆమె చదువు దృష్టిపెట్టడంతో క్రీడలకు దూరమైంది. కలంబ్‌లో ఒక టీచర్ స్క్వాష్ కోర్టు నిర్మించాడు. అప్పుడొకసారి రాకెట్ తీసుకుని ఆడింది. ఆ అనుభవం తనకు భిన్నంగా అనిపించింది. వాళ్లనాన్న ముకుంద్ నంగరే కూడా ప్రభుత్వ పాఠశాల టీచర్. ఆటలమీద ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. కూతురు మొదటిసారి ఆడినప్పుడు తన కళ్లలో మెరుపును చూశాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ కోర్టుకు పంపించేవాడు. అలా సాధారణ సందర్శన.. రోజువారీ ప్రాక్టీస్ సెషన్‌లుగా మారింది.
యూట్యూబే కోచ్..
2022లో ఆట ప్రారంభించిన ఆరు నెలలకే వసుంధరా పూణేలో తన మొదటి టోర్నమెంట్ ఆడింది. ఆమెకు అది పెద్ద అడుగు. ఊరు దాటి బయటకు వెళ్లి ఆడటం అదే మొదటిసారి. అప్పుడే తనకు అనిపించింది స్క్వాష్‌లో ఏదో సాధించవచ్చని. కానీ.. సీనియర్ ఆటగాళ్లలో ఫిట్‌నెస్, బ్యాక్‌హ్యాండ్ స్వింగ్‌లు, కంట్రోల్ చూసి అవి తనలో లేవని గ్రహించింది. కోచ్ లేనిదే.. కోర్టు లేనిదే రాణించడం కష్టమని భావించింది. కానీ అంత ఖర్చుపెట్టే స్థోమత లేదు. ఈ క్రమంలో యూట్యూబ్ మీద ఆధారపడింది. యూట్యూబ్‌నే కోచ్‌గా మార్చుకొని తనకు కావాల్సిన సమాచారం, మెళకువలు అన్నీ నేర్చుకొని సాధన స్టార్ట్ చేసింది.
జూనియర్ ఛాంప్..
"ఛాన్స్ టు స్పోర్ట్" అనే గ్రాస్‌రూట్ ఇనిషియేటివ్ క్యాంప్ తన కెరీర్‌ను మలుపుతిప్పింది. వసుంధరాను మొదట చూసినప్పుడు కోచ్ అభినవ్ తన కళ్లలోని కసిని చూశారు. అతడి సహకారంతోనే సరైన కోర్టుల్లో ట్రైనింగ్, స్ట్రక్చర్డ్ డ్రిల్స్, న్యూట్రిషన్, ఫిట్‌నెస్ నేర్చుకుంది. అభినవ్ వీడియో కోచింగ్ ద్వారా గైడ్ చేసేవారు. 2024లో మహారాష్ట్ర స్టేట్ ఓపెన్‌లో టాప్ సీడెడ్ ఆటగాళ్లను ఓడించింది. 2025 అండర్-15 ఏషియన్ జూనియర్ ట్రయల్స్‌లో మూడో స్థానం సాధించి భారత జూనియర్ జట్టులో చోటు పొందింది. వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో ఆడి తర్వాత సీనియర్ స్థాయిలో భారత్‌ను రెప్రజెంట్ చేయాలనేది తన లక్ష్యం.






