నానమ్మ అల్లికల నుంచి రూ. 4 కోట్ల బిజినెస్ వరకు.. ఓ యువతి సక్సెస్ జర్నీ..

by Javid Pasha |

నానమ్మ అల్లిక పనులను చూస్తూ పెరిగిన వంశికా మిట్టల్, వాటికి ఆధునికతను జోడించి రూ. 4 కోట్ల వ్యాపారంగా మార్చింది.

నానమ్మ అల్లికల నుంచి రూ. 4 కోట్ల బిజినెస్ వరకు.. ఓ యువతి సక్సెస్ జర్నీ..
X

దిశ, ఫీచర్స్ : కొందరు పెద్దగా చదువుకోలేదనో, డిగ్రీ లేదనో, ఉద్యోగం రాలేదనో బాధపడుతూ అక్కడే ఉండిపోతారు. ఎటువంటి ప్రయత్నాలూ చేయరు. కానీ మరికొందరు ఇందకు భిన్నంగా ఆలోచిస్తారు. పెద్ద పెద్ద చదువులు లేకున్నా, జాబ్స్ రాకున్నా సొంత ఆలోచనతో, స్వయం కృషితో ఏదో ఒకటి సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. ఆ కోవకు చెందిన 20 ఏళ్ల వ్యక్తే వంశికా మిట్టల్(Vanshika Mittal). చిన్నప్పటి నుంచే నానమ్మ చేతి అల్లికలను గమనిస్తూ వచ్చిన ఆమె అదే స్ఫూర్తితో ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా ఆలోచిస్తూ అడుగు ముందకు వేసింది. కట్ చేస్తే ఇప్పుడామె ‘ఫ్లోరియల్’ బ్రాండ్ అధినేత. రూ. 4 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. ఇంతకీ ఏం చేసింది? ఆమె సక్సెస్ జర్నీ ఎలా ప్రారంభమైంది? యువతకు ఎలాంటి స్ఫూర్తినిస్తుంది?

కుటుంబ నేపథ్యం & చదువు

వంశికా మిట్టల్ స్వగ్రామం పంజాబ్‌లోని లుధియానా (Ludhiana) నగరం. వీసా కన్సల్టెన్సీని నడిపే చిన్నపాటి బిజినెస్ ఓరియెంటెడ్ కుటుంబం వారిది. దీంతో చిన్నప్పటి నుంచే క్లయింట్లు, రెవెన్యూ వంటి బిజినెస్ చర్చలు చూసి పెరిగింది. ఇక వంశికా మిట్టల్ నానమ్మ స్వెటర్లు, టేబుల్ మ్యాట్లు వంటి చిన్న చిన్న అల్లిక పనులు చేసేది. ఇవన్నీ చూస్తూ పెరిగిన వంశిక వాటితో ప్రేరణ పొందేది తను కూడా ఏదైనా చేయాలని అనుకునేది. 2023లో స్కూల్ చదువు పూర్తి చేసిన వంశికా కాలేజీలో జాయిన్ అవ్వలేదు. ఆమె కుటుంబం కూడా పెద్దగా బలవంతం చేయలేదు. ఆ తర్వాత కొంతకాలానికి లుధియానాలోనే బీబీఏ చదివింది కానీ కాలేజీ డ్రాప్ అవుట్ అయింది. ఇక తనకు‌పై చదువులు పెద్దగా సెట్ కావని ఆలోచించిన ఈ యువతి నాన్నమ్మ ప్రేరణతో ఫ్లోరియల్ బిజినెస్‌ స్టార్ట్ చేయాలని భావించింది.

రూ. 1,000తో మొదలై..

క్రోచెట్ బొకేలు అంటే ఒక విధమైన ఫ్లవర్ బొకేలని చెప్పవచ్చు. ఇవి నిజమైన ఫ్లవర్స్‌లా అనిపిస్తాయి. గులాబీలు, సన్‌ ఫ్లవర్, ట్యూలిప్స్ వంటి పూల మాదిరి కనిపించడంతో చాలా మంది ఇష్టపడతారు. పైగా ఇవి ఎప్పటికీ వాడిపోవు కాబట్టి ఇండ్లల్లో, కార్యాలయాల్లో దీర్ఘకాలంపాటు ఉంచుకునేందుకు అవసరమైన గిఫ్టులుగా భావిస్తారు. బర్త్ డేలు, పెళ్లిళ్లు, వాలెంటైన్స్ డే, ఇంకా ఏవైనా స్పెషల్ ఈవెంట్లలో వీటిని గిఫ్టుగా ఇవ్వండం, స్వీకరించడం చేస్తుంటారు. వంశికా మిట్టల్ సరిగ్గా ఇదే చేయాలనుకుంది. ‘ఫ్లోరియల్’ బ్రాండ్ పేరుతో బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. కేవలం చేతితో మాత్రమే క్రోచెట్ బొకేలను తయారు చేయడం ప్రారంభించింది. మొదట కేవలం రూ. 1,000 పెట్టుబడితో మొదటి బొకే తయారు చేసిన వంశకా మిట్టల్ దానిని రూ. 800కు అమ్మింది. ఇలా మొదటి నెలలోనే రూ. 30 వేలు సంపాదించిన ఆమె వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇంకేముంది రెండేళ్లలోనే అది రూ. 4 కోట్ల రెవెన్యూ బిజినెస్‌గా మారింది. ప్రస్తుతం లుధియానాలోని మూడంతస్తుల వేర్‌హౌస్‌లో ఆ బిజినెస్ కొనసాగుతోంది.

కోట్ల టర్నోవర్.. ఉమెన్ ఎంపవర్

ఫ్లోరియల్ ప్రస్తుతం రోజుకు 700 ఆర్డర్లు (అందులో 500 బ్లింకిట్ ద్వారా, 200 వెబ్‌సైట్ ద్వారా) ప్రాసెస్ చేస్తూ, 130కి పైగా ప్రొడక్ట్స్‌ను (రోజ్, సన్‌ఫ్లవర్స్, ట్యూలిప్స్, మిక్స్ బొకేలు, జంబో అరేంజ్‌మెంట్స్, గిఫ్ట్ బాక్సులు వంటివి) అందిస్తోంది. సంవత్సరాంతానికి రూ. 6-7 కోట్లు టార్గెట్ చేస్తోంది. ఇంతవరకు 80,000 పైగా ప్రొడక్టులు అమ్ముకుంది. సాంప్రదాయ అల్లికలను ఆధునిక గిఫ్టింగ్‌తో మిళితం చేసిన ఫ్లోరియల్ దీర్ఘకాలం నిలిచే క్రోచెట్ ఫ్లవర్స్‌తో రియల్ ఫ్లవర్స్ సమస్యను పరిష్కరించింది. ప్రస్తుతం డిజైన్, ప్రొడక్షన్, ప్యాకింగ్, లాజిస్టిక్ వంటి విభాగాల్లో 30 మంది మహిళా ఆర్టిజన్స్‌కు ఉపాధి కల్పిస్తూ ఆదాయం అర్జిస్తూ, కొత్తవారికి కూడా అవకాశం కల్పిస్తూ మహిళల సాధికారతకు తోడ్పడుతోంది. వంశికా మిట్టల్ విజయం నేటి యంగ్ ఎంటర్ ప్రెన్యూర్లకు ప్రేరణగా నిలుస్తోందని చెప్పవచ్చు. అంతేకదా కృషి, పట్టుదల, ప్రయత్నం ఏదో ఒకరోజు ఫలిస్తుంది. అది సక్సెస్ వైపు నడిపిస్తుందనడానికి ఇదే చక్కటి ఉదాహరణ.

Next Story