గాలి నుంచి నీటిని తయారు చేసే జాకెట్..! టెక్సాస్ నిపుణుల అద్భుత ఆవిష్కరణ

by Javid Pasha |

నీటి సమస్యను ఎదుర్కోవడంలో సహాయపడే ఒక అద్భుత ఆవిష్కరణను నిపుణులు మన ముందుకు తెచ్చారు!

గాలి నుంచి నీటిని తయారు చేసే జాకెట్..! టెక్సాస్ నిపుణుల అద్భుత ఆవిష్కరణ
X

దిశ, ఫీచర్స్ : గాలిలోని తేమ నుంచి నీటిని తయారు చేసే టెక్నాలజీ, యంత్రాలు ఇప్పటికే ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే రీసెంట్‌గా టెక్సాస్ యూనివర్సిటీ ఆఫ్ ఆస్టిన్ (UT Austin) ఇంజనీర్లు ఒక విప్లవాత్మక జాకెట్‌ను సైతం అభివృద్ధి చేశారు. ఇది గాలిలోని తేమ (నీటి ఆవిరి)ను గ్రహించి, సురక్షితమైన తాగునీటిగా మారుస్తుంది. తేమ స్థాయిని బట్టి రోజుకు 400 నుంచి 900 మి.లీ. నీటిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలు, ప్రయాణికులు, హైకర్లు, క్యాంపర్లు, ఎమర్జెన్సీ రెస్పాండర్లు, సైనికులు, దూర ప్రాంతాల ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని దానిని డెవలప్ చేసిన ఇంజినీర్లు పేర్కొంటున్నారు.

ఈ సరికొత్త స్మార్ట్ టెక్స్‌టైల్ గాలిలోని నీటి ఆవిరిని గ్రహించి, దానిని డిటాచబుల్ (విడదీయగల) కలెక్షన్ యూనిట్లలో నిల్వ చేసి, సాధారణ హీటింగ్ ప్రాసెస్ ద్వారా నీటిగా విడుదల చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. సాధారణ వాతావరణ నీటి సేకరణ పదార్థాల కంటే ఈ ఫాబ్రిక్ 10 రెట్లు మెరుగ్గా పని చేస్తుందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ సాంకేతికతను బ్యాక్‌ప్యాక్‌లు, టెంట్లు, షెల్టర్లలో కూడా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. సాంప్రదాయ నీటి మూలాలు లేని ప్రాంతాల్లో శుద్ధమైన తాగునీటిని అందించడానికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్యను ఎదుర్కోవడంలో ఈ ఆవిష్కరణ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Next Story