- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిక్‌నిక్‌కు వెళ్లిన పిల్లలు చెరువులో మునిగి చనిపోతే చూసి తట్టుకోలేక 10000 మందికి ఉచితంగా ఈత నేర్పించాడు.!
ఈత కాదు జీవితం నేర్పిస్తున్నాడు

మనిషికి ఈత రావాలంటారు.
కానీ..
టైమెక్కడిది.?
మూడేండ్ల వయసు నుంచే స్కూలు..
పొద్దున ఏడింటికి వెళ్తే..
మళ్లీ సాయంత్రం ఆరింటికి రావడం.
వచ్చినాక.. హోం వర్కుల మోత.
ఇక ఈతెక్కడిది..?
ఇలాంటి వాళ్లకు ఈత నేర్పిస్తూ జీవితాన్ని మరో మలుపు తిప్పుతున్నాడొక వ్యక్తి.
- దిశ, ఫీచర్స్
అది కేరళ. సాజీ వలస్సేరి అనే వ్యక్తి ప్రతీరోజూ పొద్దున 5,30 గంటలకు ఓ నదీ ఒడ్డుకు చేరుకుంటాడు. స్కూలు పిల్లలు.. యువకులు ఆయన చుట్టూ గుమిగూడుతారు. ఈతలో నైపుణ్యాలు నేర్పించి పిల్లలకు సాహసాలను పరిచయం చేస్తున్నాడు.
విషాద ఘటన
2009 ఫిబ్రవరిలో పెరియార్ నదీ సమీపంలోని థట్టెక్కడ్ బర్డ్ సాంక్షువరీకి పిక్‌నిక్‌కు వెళ్లిన స్కూల్ విద్యార్థులకు విషాదం మిగిలింది. 15 మంది పిల్లలు, ఉపాధ్యాయులు వెళుతున్న పడవ ఒడ్డుకు తగిలి మునిగిపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా బయటపడలేదు. ఈ విషాదం సాజీ వలస్సేరిని కదిలించింది. అతడొక ఫర్నీచర్ షాప్ నడిపే వ్యక్తి. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న పిల్లల జీవితాలు ఇలా విషాదాంతం కావడం ఆయనను వెంటాడింది. అందుకే ఆ నదిలోనే ఉచిత ఈత తరగతులను ప్రారంభించాడు.
స్విమ్మింగ్ క్లబ్‌గా
ఈత రాకపోవడం వల్ల ఇంకెవరూ చనిపోవద్దనేది సాజీ పట్టుదల. అందుకే దీనిని చిన్నగా ప్రారంభించాడు. మొదట తన సొంత పిల్లలకు ఈత నేర్పించడు. తర్వాత స్నేహితులకు.. వాళ్ల పిల్లలకు నేర్పించాడు. వారి తర్వాత పొరుగున పిల్లలకు నేర్పించాడు. సాజీ చేతి స్పర్శ.. గైడెన్స్‌తో పిల్లలు నదీ ప్రవాహంలో ఈదడం.. తేలడం వంటివి ప్రశాంతంగా నేర్చుకుంటున్నారు. దీంతో అతడి పేరు మార్మోగిపోయింది. ఎక్కువమంది పిల్లలు రావడం మొదలైంది. ఆ చిన్న ప్రయత్నంతోనే ఇప్పుడు "వలస్సేరిల్ రివర్ స్విమ్మింగ్ క్లబ్"గా రూపాంతరం చెందింది.
కొత్త జీవితం..
సాజీ ఆధ్వర్యంలో నడుస్తున్న "వలస్సేరిల్ రివర్ స్విమ్మింగ్ క్లబ్"లో ఇప్పటివరకు 10,000 మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకున్నారు. ఈ క్లబ్ రికార్డేందంటే.. 2000 మంది పిల్లలు 780 మీటర్ల నదిని ఒకేసారి ఈది రికార్డు సృష్టించారు. ఇక్కడ నేర్పించేది కేవలం ఈత మాత్రమే కాదు. జీవితంలో ఎంతో ముఖ్యమైన భద్రత.. ధైర్యం.. ఈత రాకుండా ఎవరి ప్రాణాలూ పోవద్దనే నిశ్శబ్ద సంకల్పం గురించి సాజీ నేర్పిస్తున్నాడు. సాజీ వయసు ఇప్పుడు 60 ఏళ్లు. ఆ వయసులో కూడా ఎంతోదికి ధైర్యాన్ని నూరిపోస్తూ కొత్త జీవితాన్ని పరిచయం చేస్తున్నాడు.
అందరికీ ఒకటే
సాజీ తన దగ్గరికి ఈత నేర్చుకోవడానికి వచ్చేవాళ్లంతా సమానం అనే సందేశాన్నిస్తున్నాడు. ప్రతీ వ్యక్తికి శిక్షణ ఇవ్వాలి.. వారి జీవితంలో మార్పులు తీసుకురావాలి అనేదొక్కటే పరిగణనలోకి తీసుకుంటాడు. ఇక్కడ హోదాలు.. నేపథ్యాలు ఏవీ పనిచేయవు. ఐఏఎస్ కొడుకైనా.. రోజువారీ కూలీ అయినా అందరూ ఒకేస్థానం నుంచి ఈత నేర్చుకుంటారు. సాజీ పిల్లలనే కాదు.. వారి తల్లిదండ్రులనూ మోటివేట్ చేస్తాడు. ఇక్కడ ఈత నేర్చుకున్నందుకు ఎవరూ ఒక రూపాయి ఇవ్వనక్కర్లేదు. కాకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక ఆరు రోజుల స్వచ్చంద సేవ చేయాల్సి ఉంటుందంతే.






