- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంక్చర్ షాపులే మ్యాథ్స్ ల్యాబ్‌లు.. ఫైర్ స్టేషన్లే సైన్స్ గదులు!!
సాధారణ తరగతి గదులు పాఠ్య పుస్తకాలతో ఆగిపోతుంటాయి. టీచర్ ఉజ్వలా వాడేకర్ తరగతులు మాత్రం నిజ జీవితాలు ముడివడిన చోటు నుంచే ప్రారంభం అవుతుంటాయి.

దిశ, ఫీచర్స్ : రోజూ ఎంతో మందితో మాట్లాడుతుంటాం. కానీ.. కొందరితో మాట్లాడుతుంటే మైండ్‌లో పాజిటివ్ వైబ్స్ ఏర్పడుతుంటాయి. పాఠాలు అందరూ చెబుతుంటారు. కానీ.. కొందరు టీచర్లు చెబితే మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ కోవకు చెందిన వ్యక్తే ఉజ్వల వాడేకర్ (Ujjwala Wadekar). ఒక టీచర్‌గా ఆమె విద్యార్థులకు కేవలం పుస్తకాల్లోని పాఠాలే కాదు. వాటి వెనుకున్న జీవితాలను సైతం బోధిస్తారు. అందుకోసం కొన్నిసార్లు పంక్చర్ షాపులనే మ్యాథ్స్ ల్యాబ్‌లుగా, ఫైర్ స్టేషన్లనే సైన్స్ గదులుగా భావించి, పుస్తక పాఠాలను జీవితానికి ఎలా అప్లయ్ చేసుకోవాలో ప్రాక్టికల్‌గా వివరిస్తారు. అందుకే ఆ టీచర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అదెలాగో చూద్దాం పదండి.
వాస్తవాలు కళ్లకు కట్టేలా..
అది మహారాష్ట్రలో గల జల్‌గావ్ గ్రామీణ ప్రాంతంలోని జిల్లా పరిషత్ పాఠశాల. ఈ పేరు వింటేనే చుట్టు పక్కల ప్రాంతాలవారికి ఠక్కుమని గుర్తుకు వచ్చే మరో పేరు ఉజ్వల టీచర్. ఎందుకంటే ఆమె బోధనా పద్ధతి అలాంటిది. సాధారణంగా టీచర్లు క్లాస్ రూముల్లోకి వస్తుంటేనే కొందరు పిల్లలు భయపడుతుంటారు. కానీ.. ఉజ్వల టీచర్ వస్తోందంటే మాత్రం ఆనందంతో ఎగిరిగంతేస్తారు. కొందరు టీచర్లు మ్యాథ్స్ చెబితే వెంటనే అర్థం కాకపోవచ్చు. కానీ.. ఉజ్వల టీచర్ ఒక్కసారి చెబితే జీవితాంతం గుర్తుండి పోతుంది. అందుకు కారణం.. ఆమె పుస్తకాల్లోని అంశాలను బట్టీ పట్టించరు. సూత్రాలు వల్లెవేసి ఊరుకోరు. విద్యార్థులపై ఒత్తిడి తేవడమో, బెత్తంతో కొట్టడమో అస్సలు చేయరు. పుస్తకంలోని అంశాలను నిజ జీవితంలో కళ్లకు కట్టేలా చూపిస్తూ, ఉదాహరణలను వివరిస్తూ చెబుతారంతే..!
ప్రత్యక్షంగా.. ప్రాక్టికల్‌గా
సాధారణ తరగతి గదులు పాఠ్య పుస్తకాలతో ఆగిపోతుంటాయి. టీచర్ ఉజ్వలా వాడేకర్ తరగతులు మాత్రం నిజ జీవితాలు ముడివడిన చోటు నుంచే ప్రారంభం అవుతాయి. ఆమె పాఠం చెప్పాలంటే పుస్తకం ఒక్కటే ఉంటే సరిపోదు. అందులోని పాఠానికి తగిన వాస్తవాలు సైతం కళ్లకు కట్టాలి. అందుకే ఆమె పిల్లలకు గణిత పాఠాలు అర్థం చేయించడానికి పంక్చర్ షాపులకు, ఫైర్ సేఫ్టీ గురించి పాఠం చెప్పేటప్పుడు ఫైర్ స్టేషన్లకు, ఇలా పాఠానికి తగిన పరిస్థితుల్లోకి తీసుకెళ్లి ప్రత్యక్షంగా చూపెడుతూ.. పాఠాలు వివరిస్తారు. బోధనలో అనుసరించిన ఈ కొత్త ఒరవడియే ఆమెను ఉత్తమ ఉపాధ్యాయినిగా సమాజం గుర్తించేలా చేశాయి.
నిబద్ధతే నిజమైన సిలబస్..
పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు. వాటి వెనుక ఉన్న వాస్తవాలను ప్రాక్టికల్‌గా వివరిస్తుంటారు ఉజ్వలా వాడేకర్. దీంతో అవి చాలా సులభంగా అర్థం అవుతుంటాయి. దీంతో పరీక్షల సమయంలో బట్టీ పట్టి చదవాల్సిన అవసరం తప్పుతోందని విద్యార్థులు చెబుతుంటారు. కారణం.. ఉజ్వల టీచర్ ప్రాక్టికల్ క్లాసులవల్ల పాఠంలోని ప్రతీ ప్రశ్నకు జవాబు విద్యార్థుల మైండ్‌లో ఉండిపోతుంది. ఆమె ఒక ఉపాధ్యాయినిగా కేవలం తరగతి గదికి, పుస్థకంలోని పాఠానికి మాత్రమే పరిమితం కాలేదు. గ్రామాన్ని మొత్తం తరగతి గదిగా మార్చి పాఠాలు బోధించారని స్థానికులు అంటుంటారు. అందుకుగాను ఆమె 2014లో ఆమె ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు(Ideal Teacher Award)ను అందుకున్నారు. 2026లో Aspiring Women Award (Education Field)ను అందుకున్నారు. పిల్లలపట్ల ప్రేమ, వృత్తిపట్ల నిబద్ధత, ప్రాక్టికల్ టీచింగ్ పట్ల ఉత్సుకత కలిగిన ఉజ్వలా టీచర్ బోధనా పద్ధతి నేటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మొత్తం సమాజానికి ఒక ప్రేరణగా నిలుస్తోందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదంటున్నారు స్థానికులు అనేకమంది.






