మోదుగాకు దొప్పల్లో.. ఉగాది పచ్చడి.!

by Daayi Srishailam |

దొప్ప తయారుజేసి.. దాంట్లో పచ్చడి పోసుకొని.. ఆస్వాదించు.!

మోదుగాకు దొప్పల్లో.. ఉగాది పచ్చడి.!
X

మీది ఏ రాశి.?

ఎట్లుంది మీ పంచాగ జాతకం.?

ఆదాయమెంత.? ఖర్చెంత.?

రాజపూజ్యమెంత.? గౌరవమెంత.?

ఈ లెక్కలేసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు జనాలు.

ఫిఖర్ నై మత్ బ్రో.

ఉన్ననాడు ఉగాది.. లేనినాడు కాముని పండుగ.

ఊరుతో ఉగాది.. ఫికర్ జేస్కుంట కూర్చుంటమా.?

ఓ ఐదారు మోదుగాకులు తీసుకో..

దొప్ప తయారుజేసి.. దాంట్లో పచ్చడి పోసుకొని.. ఆస్వాదించు.!

సంక్రాంతికి సకినప్పలు స్పెషల్. దసరాకు యాటకూర స్పెషల్. దీపావళికి మిఠాయి స్పెషల్. అట్లనే ఉగాదికి పచ్చడి స్పెషల్. ఒకే రుచితో కాకుండా షడ్రుచులను కలిపి చేసే విశిష్టమైన ద్రవ పదార్థమే ఈ పచ్చడి. నాటికీ.. నేటికీ పచ్చడిలో పరమార్థం ఒక్కటేగానీ.. సేవించే విధానంలో మార్పొచ్చింది.

సెలవుల ఉగాది

"ఉగాది పచ్చడి చేయాలా" అని అమ్మ అడిగితే.. "టైం వేస్ట్ ఎందుకు మమ్మీ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుందాంలే" అని సలహా ఇచ్చే పిల్లలున్న జమానా ఇది. "మామిడికాయ పచ్చడి తెలుసు.. టమాటా పచ్చడి తెలుసు.. ఈ ఉగాది పచ్చడేంటి కొత్తగా" అని డౌట్ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. "పచ్చడి" ఉగాది స్పెషల్. తీపి.. పులుపు.. కారం.. చేదు.. ఉప్పు.. వగరు సమ్మేళనం ఇది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేసుకునేది షడ్రుచుల పానీయం. అప్పట్లో ఉగాది పండగ వస్తుందంటే కొంత భయం ఉండేది. దానికంటే ఎక్కువ హుషారు కనిపించేది. భయం పరీక్షలెలా రాయాలని.. హుషారు సెలవులొస్తాయని.

దొప్పలే దోసిళ్లు

ఉగాదికి కొత్త జీవితం ప్రారంభమవుతుందనే ఉత్సాహం పెద్దలదైతే.. పచ్చడితో పండగ చేసుకోవచ్చని పిల్లల ఉల్లాసం. అప్పుడు పచ్చడిని గ్లాసుల్లో పోసేవారు కాదు. పరమాన్నం అయినా.. ప్రసాదం అయినా ఆకుల్లోనే ఇచ్చేవారు. ఉగాది పచ్చడి కోసం ప్రత్యేకంగా దొప్పలు కుట్టి వాటిలో పోసుకుని పచ్చడి తాగుతుండె. ఎక్కువగా మోదుగాకుల దొప్పలే ఉండేవి. మోదుగాకులు లేకపోతే మర్రి ఆకులతో ఈ దొప్పలను చేస్తుండె. కొత్త సంవత్సరం నాడు ఇలా కొత్త ఆకు దొప్పల్లో నానా రుచుల సమ్మేళనాన్ని నాలుక ఆస్వాదిస్తుంటే ఆ మాట వర్ణనకు అందేది కాదు.

లేతాకు దొప్పలు

నిజంగా మోదుగాకు దొప్పల్లో పచ్చడిని పోసుకొని ఆస్వాదిస్తుంటే మనసెంతో ఉల్లాసంగా ఉండేది. ఎవరికైనా దొప్పలు సరిపోకపోతే "గ్లాసులో పోసుకొని తాగు" అని చెప్తే "చల్.. నాకు దొప్పల్లోనే కావాలె" అని పట్టు పడుతుండె. ఇప్పుడైతే అన్నీ డిస్పోజల్ గ్లాసులు.. ప్లాస్టిక్ ప్లేట్లలోనే పచ్చడయినా.. పరమాన్నం అయినా. అప్పుడే కాతకు వచ్చిన మామిడి కాయలు.. కొత్త చింతపండు.. లేలేతగా కాసిన వేపపూత.. స్వచ్ఛమైన బెల్లం.. తాజా కారం.. ఉప్పు మిశ్రమాన్ని తాజా మట్టికుండలో పోసి.. బుద్ధి పుట్టినప్పుడల్లా ఓ లేతాకు దొప్పడు పచ్చడి తాగుతుంటే ఎంత పసందుగా ఉండేదో కదా.?

పిల్లలదే ఉగాది

సోఫాలో కూర్చొని.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ "అమ్మా.. పచ్చడీ" అని అంతా ప్రిపేర్ అయ్యాక తాగడానికి రెడీగా ఉంటున్నారు ఈ రోజుల్లో. కానీ అప్పట్లో ఉగాది వచ్చిందంటే పెద్దలకంటే పిల్లలకే ఎక్కువ పని ఉండేది. ముందుగా తాజా మామిడాకులు తీసుకొచ్చి ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టేవాళ్లు. పచ్చడిలో వేసేందుకు వేపపూత కోసం వెళ్లేవాళ్లు. మామిడి కాయల కోసం ఇప్పట్లా మార్కెట్‌కు వెళ్లేవారు కాదు. నేరుగా తోటలోకి వెళ్లి వగరు వగరు రెండు మామిడి కాయలు తీసుకొచ్చేవాళ్లు. తర్వాత మోదుగాకులు.. సొప్పబెండ్లు తీసుకొచ్చి దొప్పలు తయారుచేయమని నాన్నకో.. తాతకో ఇస్తుండె.

బక్ష్యాల తీపి

ఉగాది పచ్చడికి ఎంత విశిష్టత ఉందో భక్ష్యాలకు అంతే విశిష్టత ఉంది. అమ్మ బక్ష్యాలకు పప్పు.. బెల్లంతో పూర్ణం చేస్తుంటే ఐదు నిమిషాలకోసారి వాళ్ల దగ్గరికి వెళ్లి ఓ ముద్ద పూర్ణం నోట్లో వేసుకుంటుండె. భక్ష్యాలు చెయ్యడం పూర్తిగాకముందే "అమ్మా ఒకటియ్యవా" అని ఆశగా అడిగితే" దేవుడికి పెట్టినంక ఇస్త ఆగురా జర" అని సముదాయిస్తుండె. పూర్ణం మిగిలితే దాంతోనే పప్పుచారు చేసేవాళ్లు. అదేందోగానీ ఒకట్రెండు భక్ష్యాలు తినగానే "అమ్మా ఇగ చాలే" అనిపిస్తుండె. కడుపు నిండా పచ్చడి తాగి.. దానిమీదికెళ్లి బక్ష్యాలు తిని బ్రేవ్ మనుకుంటూ సాయంత్రం అయ్యగారి దగ్గర పంచాంగం కోసం లైన్లు కట్టేవాళ్లు.

దొప్పల్లోనే ట్రై చేయండి

పచ్చడిలో తీపి.. పులుపు.. కారం.. చేదు.. ఉప్పు.. వగరు ఉన్నట్లే జవితంలో కూడా కష్టసుఖాలు.. ఆనందాలు.. కష్టాలు అన్నీ కలిసి ఉంటాయనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలోని వివిధ రుచులు.. అనుభవాలను సూచించే తాత్విక ప్రతీక ఈ ఉగాది పచ్చడి. జీవితంలో అన్ని రుచులను అంగీకరించాలని.. ఒక్కో రుచి ఒక్కో అనుభాన్ని ఇస్తుందని దీని అర్థం. ఉగాది రోజున పచ్చడిని తాగడం వల్ల కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ.. ఎలాంటి అనుభవం ఎదురైనా పాజిటివ్‌గా తీసుకోవాలని అంటారు పెద్దలు. సాంస్కృతిక.. ఆధ్యాత్మిక సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడిని ఈసారి మోదుగు దొప్పల్లో ట్రై చేయండి.

Next Story