- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
School Emotions.. బడిని బతికిస్తున్న దోస్తులు.!
బడిని బతికిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇద్దరు మిత్రులు.!
హలో యూత్..
మిమ్మల్నే.
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ షేర్ చేసే బిజిలో ఉన్నారా.?
ఏది ఎటువోతే మనకెందుకు.?
సమాజంలో ఏం జరిగితే మనకేంటి.?
అనే కదా మీ నిర్లక్ష్యం.
ఒకసారి ఇటు చూడండి.
స్నేహితులంటే జల్సాలు చేసుకోవడమే కాదు.
బడిని బతికిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇద్దరు మిత్రులు.!
సర్కారు స్కూళ్లంటే మనొళ్లకు లెక్కలేదు. టీచర్లేమో ఎప్పుడు స్కూల్ టైమ్ అవుతుందా అని ఎదురుచూస్తారు. స్టూడెంట్సేమో తూతూమంత్రంగా చదివి చేతులు దులుపుకొంటారు. ఇక ఊర్లో యువత అయితే సాయంత్రం అయ్యిందంటే స్కూల్లో అడ్డా పెడతారు. అక్కడ చేయని పనంటూ ఉండదనుకోండి. ఇలాంటివి చూస్తూ విసిగిపోయిన ఓ ఇద్దరు స్నేహితులు పాఠశాలలకు కొత్త సొగబులు అద్దుతున్నారు.
తాగుబోతులకు అడ్డా.?
తమిళనాడులోని కొండయంపాళయంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. పొద్దున స్వీపర్ వచ్చేసరికి తరగతి వరండాలో, క్రీడా మైదానంలో, గార్డెన్‌లో తాగేసిన మద్యం సీసాలు.. సిగరెట్ పీకలు కనిపిస్తాయి. ఒకరోజు.. ఒక వారం అని లేదు. ప్రతీ రోజూ ఇదే తంతు. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది స్వీపర్. పేరెంట్స్ మీటింగ్ పెట్టి విషయం చెప్పాడు హెడ్మాస్టర్. కానీ ఎవరేం చేస్తారు. స్కూల్లో మద్యం.. సిగరెట్లు తాగేవారిలో ఆ మీటింగ్‌కొచ్చినవాళ్ల పిల్లలు కూడా ఉండొచ్చు కదా.? చూద్దాంలే.. మళ్లీ జరగకుండా చేద్దాంలే అని వెళ్లిపోయారు.
ఏఎస్‌కేకే ధైర్యం
స్కూల్ ఎంత పవిత్రమైన ప్లేస్.? కానీ.. దాన్ని వీళ్లెలా మార్చేస్తున్నారు.? సమాజంలో పాఠశాలల పట్ల గౌరవం లేకపోవడం నిజంగా బాధాకరమే. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నారు ప్రత్యూష్ అండ్ కాళీ. పాఠశాలల పవిత్రతను పునరుద్ధరించడానికి సంకల్పించారు. ఒక్క కొండయంపాళయంలోనే కాదు. ప్రతీ పాఠశాలను నాణ్యమైన అభ్యాసకేంద్రంగా మార్చాలనుకున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఉండాలనే లక్ష్యం పెట్టుకున్నారు. వాళ్ల ధైర్యం ఏఎస్‌కేకే. అంటే అరామ్ సెయ్యకరం కొడుప్పమ్. ఇదొక స్వచ్ఛంద సంస్థ. పాఠశాలల బాగుకోసమే దీనిని స్థాపించారు.
రీ మోడలింగ్
2018లో వీళ్లు దీనిని స్థాపించారు. ఎక్కడైతే శిథిలావస్థకు చేరిన పాఠశాలలు ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని ఆధునీకరిస్తున్నారు. సర్కారు పాఠశాలలను చూస్తే విద్యార్థులు పారిపోవడం కాదు.. వాటిలో చదివేందుకు విద్యార్థులు పోటీపడేలా చేయాలని కృషి చేస్తున్నారు. ఈ రోజుల్లో సర్కారు బడి ఎంత కళావిహీనంగా ఉంటుందో తెలుసు కదా.? స్కూల్‌ను, పరిసరాలను పరిశుభ్రంగా తయారుచేసి.. రీమోడలింగ్ చేస్తున్నారు. అందమైన కుడ్యచిత్రాలతో పాఠశాలలను ఆకర్శనీయంగా.. అందంగా తీర్చిదిద్దుతున్నారు.
టీమ్‌గా ఏర్పడి
గ్రామీణ తమిళనాడులో ఏఎస్‌కేకే గవర్నమెంట్ స్కూళ్లను అందంగా రూపుమారుస్తోంది. ప్రత్యూష్.. కాళీ చేస్తున్న పనులు నచ్చి ఎంతోమంది స్వచ్చందంగా కదిలివచ్చారు. ఇప్పుడు వాళ్లంతా పెద్ద టీమ్‌గా ఏర్పడి బడిని బాగుచేస్తున్నారు. మహ్మద్ ఇప్పుడు ఆ టీమ్‌కు సారథిగా పనిచేస్తున్నాడు. పాఠశాలలే కాదు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలు చాలానే చేస్తున్నారు. కొవిడ్ సమయంలో అయితే ఎంతోమందికి సేవ చేశారు. నిత్యం సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ ఉండే యువత ఒకసారి వీరిని ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవలో పాలుపంచుకోవాలి.









