- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాస్టిక్ బాటిల్ అందులో వేస్తే ఆహారం అందిస్తున్న ఏటీఎంలు.. ఎక్కడో తెలుసా?
ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వంటివి కనిపిస్తే వాటిని తీసుకెళ్లి ఏటీఎంలో వేయాలి. అందులో నుంచి పెంపుడు కుక్కలు, పిల్లులకు అవసరమైన ఆహార పదార్థాలు బయటకు వస్తాయి.

దిశ, ఫీచర్స్ : ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ వినియోగం ఇప్పటికీ సమస్యగానే మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూ గర్భంలో, నదుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో, స్థానిక నీటి వనరుల్లో కలవడం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి హాని జరుగుతోంది. ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే అవకాశం ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. పైగా ఇది ఖర్చుతో కూడుకున్న పనిగానూ ఉంటోంది. అయితే ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని ఆలోచించింది టర్కీ దేశం. అందకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ పరిష్కారమేంటో చూద్దాం.
ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ సమస్యలను, ఆరోగ్య పరమైన ఇబ్బందులను తొలగించేందుకు టర్కీ దేశం వినూత్న ఆలోచనకు తెరతీసింది. దానిని ఆచరణలో పెట్టి ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఏం చేసిందంటే.. ఇస్తాంబుల్, టర్కీ నగరాలతోపాటు పలు పట్టణాల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఏటీఎంల(ప్రత్యేక వెండింగ్ యంత్రాలను)ను ఏర్పాటు చేసింది. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. వీధుల్లో, ముఖ్య కూడళ్లలో కనిపించే ఈ ఏటీఎంలు రెండు సమస్యలకు ఒకేసారి చక్కటి పరిష్కారాన్ని అందిస్తున్నాయి. ఏమిటంటే.. వీధుల్లో, స్థాని పరిసరాల్లో ఎక్కడైనా ప్రజలు వినియోగించిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వ్యర్థాలు, ఇతర వస్తువులు వంటివి కనిపిస్తే ఎవరైనా సరే వాటిని తీసుకెళ్లి ఏటీఎంలో వేయాలి. అలా వేయగానే అందులో నుంచి పెంపుడు కుక్కలు, పిల్లులకు అవసరమైన ఆహార పదార్థాలు బయటకు వస్తాయి.
టర్కీ నగరాల్లో కనిపించే ప్రత్యేక వెండింగ్ యంత్రాలు లేదా ఏటీఎంల ద్వారా తమ పెట్‌డాగ్స్‌కు, పిల్లులకు, ఇతర పెంపుడు జంతువులకు ఆకలి తీర్చే అవకాశం ఏర్పడినందున చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ ప్లాస్టిక్ బాటిళ్లు, వ్యర్థాలు కనిపించినా తీసుకెళ్లి వాటిలో వేసేస్తున్నారు. దీంతో ఆ వెండింగ్ యంత్రాలు ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడంతోపాటు పెంపుడు జంతువులకు అవసరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే.. వీటి నిర్వహణ కూడా అక్కడి ప్రభుత్వానికి ఆర్థిక భారం అవడం లేదట. ఎందుకంటే ఈ వెండింగ్ యంత్రాల్లో వేసే ప్లాస్టిక్ రీసైక్లింగ్ నుంచి వచ్చే ఆదాయంతోనే వాటిని నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణ, జంతు పరిరక్షణ మిళతమైన ఈ ఐడియా ప్రస్తుతం ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. మిగతా దేశాల్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని పలువురు భావిస్తున్నారు.






