16 ప్రభుత్వ ఉద్యోగాలు తిరస్కరించి.. ఐపీఎస్ కల సాకారం చేసుకుంది

by Daayi Srishailam |

ఫస్ట్ అటెంప్ట్‌లోనే యూపీఎస్సీ క్లియర్ చేసి ఐపీఎస్ అయింది

16 ప్రభుత్వ ఉద్యోగాలు తిరస్కరించి.. ఐపీఎస్ కల సాకారం చేసుకుంది
X

దిశ, ఫీచర్స్: కల సాకారం చేసుకునేందుకు ఎంత రిస్క్ అయినా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. ఉత్తరాఖండ్‌కు చెందిన తృప్తిభట్ ఈ కోవకే చెందుతుంది. తన ఐపీఎస్ కల సాకారం కోసం ఏకంగా 16 గవర్నమెంట్ ఉద్యోగావకాశాలను తిరస్కరించింది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే యూపీఎస్సీ క్లియర్ చేసి ఐపీఎస్ అయింది.

ఆఫర్లు తిరస్కరించి..

తృప్తిభట్ ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఉపాధ్యాయుల కుటుంబంలో పుట్టింది. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను కలిసే అవకాశం లభించింది. కలాం స్వదస్తూరితో రాసిచ్చిన ప్రోత్సాహ లేఖ ఆమెలో దేశసేవ చేయాలనే కలను నాటింది. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేసింది. ఐఎస్‌ఆర్‌ఓ సహా 16 ప్రభుత్వ ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించింది. ఎన్టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగం వచ్చింది. ఇది సురక్షిత ఉద్యోగమే అయినా.. దేశానికి నేరుగా సేవ చేయాలనే తపన ఆమెను యూపీఎస్సీ వైపు నడిపించింది.

ఇంటిలిజెన్స్ ఆఫీసర్..

2013లో ఫస్ట్ టైం యూపీఎస్సీ అటెంప్ట్ చేసింది. మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ 165 సాధించింది తృప్తి. ఐఏఎస్ క్వాలిఫై అయినా.. సమాజంపై నేరుగా ప్రభావం చూపాలనే నిర్ణయంతో ఐపీఎస్‌ను ఎంచుకుంది. హోం కేడర్ కేటాయింపు దొరికి డెహ్రాడూన్‌లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేస్తోంది. నిర్భయంగా నిర్ణయాలు తీసుకునే అధికారిగా ఆమెకు మంచి పేరున్నది. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సమయంలో భద్రత నిర్వహణలో ఆమె పాత్ర కీలకం.

కలాం మాటలే స్ఫూర్తిగా..

తృప్తిభట్ కేవలం అధికారిగానే కాకుండా అన్నింట్లోనూ ముందుంటుంది. కామన్‌మ్యాన్‌కు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటుంది. మారథాన్‌లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలుచుకుంది. స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా. తైక్వాండో.. కరాటేలో శిక్షణ పొందింది తృప్తి. ఈ నైపుణ్యాలు తనలోని క్రమశిక్షణ.. ధైర్యాన్ని చూపిస్తాయి. కలలను సాకారం చేయడానికి ధైర్యం.. పట్టుదల అవసరమని ఆమె జీవితం నిరూపిస్తుంది. "అవకాశం కోసం వేచిచూకండి.. అవకాశాలను ఏర్పరుచుకోండి" అని కలాం తనతో చెప్పిన మాటలు ఆమె జీవితాన్నే మార్చేసి డైనమిక్ ఆఫీసర్‌గా నిలబెట్టాయి.

Next Story