పిల్లలకు టాయ్ ట్రంక్.. నో స్క్రీన్.. నో బ్యాటరీ గేమ్స్..

by Sujitha Rachapalli |

0-8 ఏళ్ల పిల్లలకు తగినట్లుగా ఆట వస్తువులు.. చిన్నారుల్లో క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్.. ఇద్దరు స్త్రీలు కలిసి తీసుకొచ్చిన బ్రాండ్

పిల్లలకు టాయ్ ట్రంక్.. నో స్క్రీన్.. నో బ్యాటరీ గేమ్స్..
X

దిశ, ఫీచర్స్: పిల్లలు మొబైల్, టీవీ, వీడియోగేమ్ ఆటల మధ్య చిక్కుకుపోతున్నారు. వాటి వల్ల సృజనాత్మకత లోపిస్తోంది. మానసికంగా నలిగిపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన పూణేకి చెందిన ఇద్దరు ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్లు ప్రియాంకా మంగావంకర్ వైదే, మిను జోషి ‘టాయ్ ట్రంక్’ అనే బ్రాండ్‌ను ప్రారంభించారు.

చేతి వృత్తులకు ప్రోత్సహం..

‘టాయ్ ట్రంక్’ ద్వారా వీళ్లు తయారుచేసే ఆటలు పిల్లల సృజనాత్మకతను, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇవి పూర్తిగా సురక్షితం. విషరహితం. ఈ ఆటలకు సంబంధించిన వస్తువులన్నీ కలపతో చేస్తారు కాబట్టి ఇవి మరో రకంగా భారతీయ సాంప్రదాయ చేతివృత్తులను ప్రోత్సహిస్తున్నాయి. ప్రియాంక ముంబైలో పుట్టి పెరిగింది. సర్ జెజె ఆర్కిటెక్చర్ కాలేజీ నుంచి బీఆర్క్.. సెప్ట్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేసింది. మినుది అహ్మదాబాద్‌. తను సూరత్‌లో బీఆర్క్ పూర్తిచేసి కార్డిఫ్ యూనివర్సిటీ నుంచి సస్టయినబుల్ డిజైన్‌లో మాస్టర్స్ చేసింది.

0-8 సంవత్సరాల్లో..

2013లో ఇద్దరూ పూణేలోని బ్రిక్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో అధ్యాపకులుగా చేరారు. అక్కడ 18-19 ఏళ్ల విద్యార్థుల్లో బేసిక్ థింకింగ్, నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి స్కిల్స్ లేకపోవడం చూశారు. ఇది 0-8 సంవత్సరాల్లో మొదలవుతుందని తెలుసుకున్నారు. 2017లో ప్రియాంకకు పిల్లలు పుట్టాక అర్థమైందేంటంటే.. పిల్లలు సతాయిస్తున్నారనో లేదా తింటలేరనో.. మారాం చేస్తున్నారనో అడగ్గానే మొబైల్ ఫోన్లు, ఇతర బ్యాటరీ ఆట సామగ్రి ఇప్పిస్తాం. క్రమంగా పిల్లలకు ఇవే అలవాటైతాయి. అప్పుడు ఎంత మొత్తుకున్నా మానేయరు.

రెండింటికీ ఒకే పరిష్కారం..

మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్‌‌లు, ఇతర బ్యాటరీ వస్తువుల ఆటలు పిల్లలను నిష్క్రియులుగా చేస్తున్నాయని వాళ్లకు అర్థమైంది. అదే సమయంలో సావంత్వాడి, చన్నపట్నా వంటి సాంప్రదాయ కట్టె ఆటల కళ క్షీణిస్తోందని కూడా గమనించారు. ఈ రెండు సమస్యలకు ఒకేసారి పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు. టాయ్ ట్రంక్ ద్వారా వాటికి పరిష్కారాలు చూపిస్తున్నారు. ఇవి 0 నుంచి 8 ఏళ్ల పిల్లల కోసం తయారు చేసినవి. టాయ్ ట్రంక్ ద్వారా సిగ్నేచర్ కిచెన్ సెట్, రీడిజైన్డ్ వాబ్లర్స్, ట్రావెల్ ఫ్రెండ్లీ స్ట్రాటజీ బోర్డ్ గేమ్స్ వంటివి అందిస్తున్నారు.

15 లక్షల టార్గెట్..

టాయ్ ట్రంక్ ఆటలు రసాయన రంగులు లేకుండా పసుపు, బీస్‌వాక్స్, కొబ్బరి నూనె వంటి సహజ పదార్థాలతో తయారు చేస్తారు. వీటివల్ల పిల్లలు మోటార్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఊహాశక్తి, సృజనాత్మకత, భావోద్వేగ అభివృద్ధి వంటి ఉపయోగాలు ఉంటాయి. ఆట అంటే పిల్లలు బటన్ నొక్కి ఆడేదిగా కాకుండా తామే ఆలోచించి ఆడుకోగలగాలి అనేది వారి ఉద్దేశం. టాయ్ ట్రంక్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు పైగా టర్నోవర్ సాధించింది. ఈ సంవత్సరం రూ.15 లక్షల టార్గెట్ పెట్టుకున్నారు.

Next Story