కొత్త సంవత్సరంలో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా..? మిమ్మల్ని అలరించే అందమైన హిల్ స్టేషన్లు ఇవే..

by Javid Pasha |

కేరళలోనే నెంబర్ వన్ హిల్ స్టేషన్ మున్నార్. డిసెంబర్- జనవరి నెలల్లో ఇక్కడి హిల్ స్టేషన్‌లు అందమైన ఆకు పచ్చని టీ తోటలతో అలరారుతూ టూరిస్టులను ఆకట్టుకుంటాయి

కొత్త సంవత్సరంలో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా..? మిమ్మల్ని అలరించే అందమైన హిల్ స్టేషన్లు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : ఉరుకులు పరుగుల జీవితంలో రొటీన్ లైఫ్ ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే అప్పుడప్పుడూ కొంగ్రొత్త పర్యాటక ప్రదేశాలను చుట్టి రావడం మీలో ఆనందాన్ని కలిగిస్తుందని పెద్దలు చెబుతుంటారు. అందమైన ప్రకృతి అందాలను, అలరించే ప్రదేశాలను చూడటం కేవలం సరదా మాత్రమే కాదు, మీలో ఉత్సాహాన్ని, మానసిక వికాసాన్ని కలిగిస్తాయి. అందుకే ఏమాత్రం అవకాశం దొరికినా ట్రిప్‌కి ప్లాన్ చేస్తుంటారు పలువురు. అయితే చాలా మంది చలికాలంలోనే, ముఖ్యంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో టూర్లు ప్లాన్ చేస్తుంటారు. మరికొందరు కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేసేందుకు ట్రిప్‌కి ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసం తప్పక చూడదగిన అందమైన టూరిస్టు ప్లేస్‌లలో కేరళ‌లోని హిల్ స్టేషన్లు ఒకటి. ఎప్పుడూ చల్లగా, పచ్చగా, ప్రకృతి రమణీయంగా, పొగమంచుతో కప్పబడి టూరిస్టులను అలరించే ఆ బ్యూటిఫుల్ పర్వత ప్రాంతాలేవో తెలుసుకుందాం పదండి!

మున్నార్

కేరళలోనే నెంబర్ వన్ హిల్ స్టేషన్ మున్నార్. డిసెంబర్- జనవరి నెలల్లో ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ఈ సీజన్‌లో ఇక్కడి ఉష్ణోగ్రలు 5–15°C వరకు నమోదవుతుంటాయి. కొన్ని రోజులు ఉదయంపూట 0–2°C కూడా రికార్డ్ అవుతాయి. కాగా ఈ హిల్ స్టేషన్ అందమైన ఆకు పచ్చని టీ తోటలతో అలరారుతూ టూరిస్టులను ఆకట్టుకుంటుంది. మరోవైపు పొగమంచుతో కప్పబడిన ఎత్తైన పర్వ ప్రాంతాలు, ఎగుడు దిగుడు లోయలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కొండల మీద నుంచి సూర్యోదయం చూస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే.. ఎరవికులం నేషనల్ పార్క్, కుండల డ్యామ్(Kundala Dam) ప్రాంతాలకు వెళ్లాల్సిందే. అంతేకాకుండా ఇక్కడి కొండ ప్రాంతాల్లో 12 ఏండ్లకు ఒకసారి పూసే నీలకురింజి పూలు కూడా చలికాలంలో వికిసిస్తాయి. ఇక టీ ఎస్టేట్స్‌లో ట్రెక్కింగ్, బోటింగ్ (Mattupetty Dam) వంటివి పర్యాటకుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి.

వాగమన్

“కేరళ స్కాట్లాండ్” అని పిలుచుకునే వాగమన్ (Vagamon) కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఇది. అందమైన పచ్చిక బయళ్లతో అలరారుతూ ఉంటుంది. పైన్ అడవులు, తేయాకు తోటలు, మంచుతో కప్పబడిన కొండలకు ప్రసిద్ధి చెందింది. పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, ఆఫ్-రోడ్ జీప్ సఫారీలు వంటి సాహస క్రీడలకు పెట్టింది పేరు. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి, ప్రశాంతతను కోరుకునేవారికి అనువైన ప్రదేశం. ఇది కొట్టాయం-ఇడుక్కి సరిహద్దులో 1100 మీటర్ల ఎత్తులో ఉంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు సందర్శించడానికి ఉత్తమ సమయం. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

తేక్కడి (పెరియార్)

తేక్కడి (Thekkady) అనేది కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఫేమస్ టూరిస్టు స్పాట్. ఇది పెరియార్ టైగర్ రిజర్వ్ (Periyar Tiger Reserve)కు కేంద్రంగా ఉంది. ఏనుగులు, పులులు, వివిధ రకాల పక్షులు, సుగంధ ద్రవ్యాల తోటలకు నిలయంగా ఉండే ఈ ప్రాంతానికి టూరిస్టుల తాకిడి ఎక్కువ. ఇక్కడ బోట్ సఫారీలు, ట్రెక్కింగ్, వన్యప్రాణి వీక్షణ అనుభవాలు అలరిస్తాయి. పెరియార్ నది, అలాగే సరస్సు చుట్టూ విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో ఒకటి. కగా చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు 10–18°C వరకు నమోదవుతాయి.

నెల్లియంపతి

చలికాలంలో పర్యాటకులను ఆకర్షించే హిల్ స్టేషన్లలో మరో ముఖ్యమైన ప్రదేశం నెల్లియంపతి (Nelliyampathy). ఇది కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని అందమైన హిల్ స్టేషన్. దట్టమైన టీ, కాఫీ తోటలు, జలపాతాలు, పచ్చని లోయలు ప్రకృతి అందాలకు, గొప్ప జీవవైవిధ్యానికి నెలవుగా ఉన్నాయి. అలాగే ట్రెక్కింగ్, ప్రకృతి అందాలు వచ్చీ పోయే పర్యాటకులకు ప్రశాంతమైన అనుభూతిని ఇస్తాయి. పొగమంచుతో కప్పబడిన అడవులు, సంత్రపండ్ల తోటలు, ఎత్తైన కొండలు అలరిస్తాయి. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత 8–15°C నమోదువుతుంది. అలాగే సీతార్కుండ్ వ్యూపాయింట్ నుంచి సూర్యోదయం, పద్మనాభపురం వాటర్‌ఫాల్, కేసవన్‌పార్క్ రాక్ వంటివన్నీ ఎంతో ఆకట్టుకుంటాయి. అలాగే చలికాలంలో ఇక్కడి గోల్డెన్ వ్యాలీ, మీన్ముట్టి వాటర్‌ఫాల్, పొన్ముడి హిల్ టాప్ అద్భుతంగా ఉంటాయి. డిసెంబర్ నుంచి మార్చి వరకు కేరళలోని ప్రతీ టూరిస్టు హిల్ స్టేషన్ ఒక అందమైన అనుభూతిని కలిగించే ప్రదేశమని చెప్పవచ్చు.

Next Story