- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశీ పత్తితో.. మహిళా సాధికారత రాఖీలు.!
ఈ రాఖీలు ఒక గొలుసు ప్రక్రియలో రైతులను, గృహిణులను, పర్యావరణాన్ని సమృద్ధి చేస్తున్నాయి

దిశ, ఫీచర్స్: మధ్యప్రదేశ్‌లోని పరద్సింగా గ్రామంలో శ్వేతా భట్టడ్ ప్రారంభించిన గ్రామ్ ఆర్ట్ ప్రాజెక్ట్ ద్వారా 300 మందికి పైగా మహిళలు స్థిరమైన రాఖీలను తయారు చేస్తూ తమ జీవితాలను, పర్యావరణాన్ని మెరుగుపరుస్తున్నారు. ఈ రాఖీలు ఒక గొలుసు ప్రక్రియలో రైతులను, గృహిణులను, పర్యావరణాన్ని సమృద్ధి చేస్తున్నాయి.
300 మంది మహిళలు..
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని 14 గ్రామాల నుంచి 300 మంది మహిళలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమై స్థానిక దేశీ పత్తిని ఉపయోగించి రాఖీలను చేతితో తయారు చేస్తున్నారు. ఈ రాఖీలు కేవలం అలంకార వస్తువులు మాత్రమే కాదు. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్లతో, పర్యావరణ హితంగా ఉంటాయి. ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ రైతు నుంచి చేనేత కార్మికుడి వరకు ఒక స్థిరమైన భవిష్యత్తును నిర్మిస్తున్నారు. శ్వేతా భట్టడ్ ఈ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు. రాఖీ తయారీ ఒక స్వతంత్ర ప్రక్రియ కాదు. ఇది దేశీ పత్తిని పండించడం నుంచి మార్కెట్‌కు చేరడం వరకు ఇదొక సమగ్ర ప్రక్రియ.
దేశీ పత్తితో..
విదర్భ ప్రాంతంలోని పరద్సింగా, వార్ధా, అకోలా గ్రామాల్లో రైతులు దేశీ పత్తిని పండించడంతో ఈ రాఖీ యాత్ర ప్రారంభమవుతుంది. బీటీ పత్తితో పోలిస్తే దేశీ పత్తి పర్యావరణ హితం. బీటీ పత్తి జన్యుపరంగా సవరించబడి పురుగులను నాశనం చేసే రసాయనాలను కలిగి ఉంటుంది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుంది. దేశీ పత్తి సహజంగా పెరుగుతుంది. ఇంకా రైతులకు సురక్షితం. దీనిని వార్ధాలోని గ్రామ సేవా మండల్‌లో మహిళలు అంబర్ చరఖాలతో చేతితో నూలుగా వడకతారు. ఈ నూలును హల్దీ, గులాబీ పుష్పాలు, ఇండిగో, ఆలయాల నుంచి సేకరించిన పూల వ్యర్థాల నుంచి తయారైన సహజ రంగులను వేస్తారు.
14 గ్రామాల మహిళలు..
రంగు వేసిన నూలు మధ్యప్రదేశ్‌లోని పరద్సింగాకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 14 గ్రామాలకు పంపుతారు. మహిళలు ఈ నూలును ఉపయోగించి ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్లతో రాఖీలను తయారు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కేవలం రాఖీల తయారీ గురించి మాత్రమే కాదు.. ఇది 300 మంది మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. గ్రామాల్లో సమూహాలుగా కలిసి ఈ రాఖీలను తయారు చేస్తారు. రాఖీలు తయారుచేయడం వారికి ఆదాయ వనరును అందించడమే కాకుండా వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. అంతేకాదు సమాజంలో వారి స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
ప్రకృతికి తిరిగి ఇస్తూ..
రాఖీ తయారీకి దేశీ పత్తి ఉపయోగించడం ద్వారా రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. రైతులకు సురక్షితమైన ఆదాయ మార్గాన్ని అందిస్తున్నారు. సహజ రంగుల వాడకం రసాయన డైల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఇంకా ఈ రాఖీలలో విత్తనాలు ఉండటం అనేది.. ప్రకృతికి తిరిగి ఇచ్చే సంస్కృతికి సింబాలిక్‌గా చెప్పుకోవచ్చు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, రైతులకు స్థిరమైన వ్యవసాయ మార్గాన్ని, పర్యావరణానికి ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తున్నాయంటే రాఖీలు రక్తసంబంధంతో సమానంగా చెప్పుకోవచ్చు.






